కాంగ్రెస్‌లో టికెట్ల కుమ్ములాట

15 Apr, 2018 03:07 IST|Sakshi

వారసుల కోసం 8 మంది కన్నడ మంత్రుల పట్టు

హైకమాండ్‌కు తలనొప్పిగా మారిన ‘కర్ణాటకం’

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కన్నడనాట మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ హై కమాండ్‌కు టికెట్ల పంపిణీ కొత్త తలనొప్పులు తీసుకొచ్చింది. కర్ణాటక సర్కారులో ఉన్న మంత్రులు తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ నేరుగా అధిష్టానాన్ని ఆశ్రయించారు. ఇప్పటికే అన్ని పార్టీలు తొలివిడతగా తమ అభ్యర్థులను ప్రకటించినప్పటికీ.. కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ మాత్రం జాబితా విషయంలో స్పష్టతనీయటం లేదు. కన్నడ మంత్రుల్లో ఎనిమిది మంది.. తమ పిల్లలు, అనుచరులకు టికెట్లు ఇవ్వాలంటూ పట్టుబడుతుండటమే అసలు కారణం. అయితే పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ నేతృత్వంలో దీనిపై సుదీర్ఘంగా చర్చించిన కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ.. ఆదివారం తొలి జాబితా విడుదల చేయొచ్చని తెలుస్తోంది.

సంతానంతోనే సమస్య!
సీఎం సిద్దరామయ్య సైతం చాముండేశ్వరి (సిట్టింగ్‌), బదామీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. తన కుమారుడు యతీంద్రకూ టికెట్‌ ఇప్పించుకోవాలని పోటీపడుతున్నారు. అయితే సిద్దరామయ్య (కుమారుడికి), హోం మంత్రి రామ లింగారెడ్డి (కూతురికి), మాజీ కేంద్ర మంత్రి కేహెచ్‌ మునియప్ప (కూతురికి), మల్లికార్జున ఖర్గే (కుమారుడు – రాష్ట్ర ఐటీ మంత్రి)లు ఈ విషయంలో విజయం సాధించినట్లేనని తెలుస్తోంది. మార్గరెట్‌ అల్వా (కుమారుడు నివేదిత్‌ అల్వా), వీరప్ప మొయిలీ (కుమారుడు హర్ష మొయిలీ), పీసీసీ చీఫ్‌ పరమేశ్వర (కుమారుడు) మంత్రులు ఆర్‌వీ దేశ్‌పాండే (కుమారుడు), టీబీ జయచంద్ర (కుమారుడు)కూడా తమ వాళ్లకు టికెట్లు ఇప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే జేడీఎస్, ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు టికెట్లు ఇవ్వాల్సిందేనంటూ సిద్దరామయ్య, వద్దని ఖర్గే, వీరప్ప మొయిలీ పట్టుబడుతుండటమే ఈ జాబితా ఆలస్యానికి కారణంగా తెలుస్తోంది.

రాహుల్‌ సమక్షంలోనే వాకౌట్లు..: శుక్ర  వారం ఉదయం రాహుల్‌ అధ్యక్షతన జరిగిన ఎన్నికల కమిటీ సమావేశంలో సీఎం సిద్దరామయ్య, లోక్‌సభ పక్షనేత మల్లికార్జున ఖర్గే, మాజీ సీఎం వీరప్ప మొయిలీ, పీసీసీ చీఫ్‌ జి.పరమేశ్వర తదితరులు పాల్గొన్నారు. ఈ భేటీలో నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి నేతలు వాకౌట్‌ చేసేంతవరకు వెళ్లింది. దీంతో మళ్లీ సాయంత్రం సమావేశమయ్యా రు. ఈ భేటీలో సోనియా పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు