రఫేల్‌పై మళ్లీ వాగ్యుద్ధం

5 Jan, 2019 04:03 IST|Sakshi
రఫేల్‌పై చర్చ సందర్భంగా రాహుల్, ఖర్గే, కాంగ్రెస్‌ సభ్యులు. ప్రసంగిస్తున్న సీతారామన్‌

ప్రధాని నోరు విప్పాలి: కాంగ్రెస్‌

ముడుపులు ముట్టనందుకే ఒప్పందానికి అడ్డుపడ్డ యూపీయే: సీతారామన్‌

బోఫోర్స్‌తో మునిగిన కాంగ్రెస్‌..రఫేల్‌తో మోదీకి తిరిగి అధికారమని వ్యాఖ్య

న్యూఢిల్లీ: రఫేల్‌ యుద్ధ విమానాల ఒప్పందంపై శుక్రవారం లోక్‌సభలో అధికార, విపక్షాల మధ్య మరోసారి వాడివేడి చర్చ జరిగింది. ఈ ఒప్పంద విషయమై కేంద్రం సుప్రీంకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చిందని, ప్రధాని స్పందించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. ముడుపులు అందని కారణంగా కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వం రఫేల్‌ ఒప్పందాన్ని అడ్డుకుందని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆరోపించారు. ఎన్డీయే హయాంలో మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే రక్షణ శాఖ పనిచేస్తోందని పరోక్షంగా యూపీయే నాటి బోఫోర్స్, అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ కుంభకోణాల్ని ప్రస్తావించారు. బోఫోర్స్‌తో కాంగ్రెస్‌ అధికారం కోల్పోయిందని, కానీ రఫేల్‌తో మోదీ మళ్లీ ప్రధాని అవుతారని పేర్కొన్నారు.

1.30 లక్షల కోట్ల  కుంభకోణం: కాంగ్రెస్‌
కల్పిత కాగ్‌ నివేదికను ఉటంకించి సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం తప్పుదోవపట్టించిందని కాంగ్రెస్‌ మండిపడింది. లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే మాట్లాడుతూ..ప్రధాని మోదీ తన సన్నిహితుడికి ఆఫ్‌సెట్‌ కాంట్రాక్టును కట్టబెట్టారని, ఈ మొత్తం వ్యవహారంపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీతో విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు. ‘రఫేల్‌ ఒప్పందంలో రూ.1.30 లక్షల కోట్ల కుంభకోణం ఇమిడి ఉంది. ఈ ఒప్పందంపై చర్చించేందుకు మోదీ..ఏఏ(అనిల్‌ అంబానీ)ని తన విమానంలోనే తీసుకెళ్లారు. పార్లమెంట్‌ కోర్టులోనే నిజాన్ని నిగ్గు తేల్చాలి. ప్రధాని పార్లమెంట్‌కు వచ్చి సమాధానం చెప్పే వరకు సమస్య పరిష్కారం కాదు. అవసరం లేని చోట మాట్లాడే మోదీ..దేశం ఆయన మాటలు వినాలనుకున్నప్పుడు మౌనం వహిస్తున్నారు’ అని ఖర్గే అన్నారు.

బోఫోర్స్‌ కుంభకోణం..రఫేల్‌ డీల్‌..
రఫేల్‌లో ఎలాంటి స్కాం లేదని, జాతీయ భద్రత కోసం కుదుర్చుకున్న ఆ ఒప్పందంపై అసత్య ప్రచారం చేస్తూ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తోందని నిర్మలా సీతారామన్‌ ఆరోపించారు. యూపీయే నాటి రక్షణ ఒప్పందం బోఫోర్స్‌ ఒక కుంభకోణమని, కానీ రఫేల్‌ ఒక ఒప్పందమని వ్యాఖ్యానించారు. యూపీయే హయాంలో రఫేల్‌పై జరిగిన బేరసారాలను ప్రస్తావిస్తూ..‘రఫేల్‌ ఒప్పందం మీకు నప్పలేదు. దాని నుంచి మీకు ఎలాంటి ముడుపులు రాలేదు. అందుకే, ఓ వైపు వైమానిక దళం ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కీలకమైన రఫేల్‌ ఒప్పందాన్ని చాలా రోజుల పాటు అడ్డుకున్నారు.

కాంగ్రెస్‌ ఒప్పందాల్లో క్యూ(ఖత్రోచి), ఆర్‌వీ(రాబర్ట్‌ వాద్రా) ఉన్నారు’ అని మండిపడ్డారు. బోఫోర్స్‌తో కాంగ్రెస్‌ ఓటమిపాలవగా, రఫేల్‌తో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చి సరికొత్త భారత్‌ను నిర్మిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఫ్లైఅవే(ఎగరడానికి సిద్ధంగా ఉన్న) విధానంలో 36 యుద్ధ విమానాల్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి వైమానిక దళమే సూచించిందని గుర్తు చేశారు. యూపీయే హయాంలో ఫ్లైఅవే విధానంలో కేవలం 18 విమానాలే కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. 126 యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో సొంత పార్టీ ఖజానా ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌ దేశ భద్రతపై రాజీపడిందని ఆరోపించారు.

మేమొస్తే రఫేల్‌పై దర్యాప్తు : రాహుల్‌
2019 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే రఫేల్‌ ఒప్పందంపై విచారణ చేపడతామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రకటించారు. దోషుల్ని శిక్షించకుండా వదిలిపెట్టమని హెచ్చరించారు. పార్లమెంట్‌ బయట ఆయన మీడియాతో మాట్లాడుతూ...రఫేల్‌పై చర్చకు రాకుండా ప్రధాని మోదీ పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. రఫేల్‌ ఒప్పందంపై విచారణ జరపడం తమ పరిధిలో లేదని మాత్రమే సుప్రీంకోర్టు చెప్పిందని, కానీ అసలు విచారణే వద్దని ఆదేశించలేదని అన్నారు. కొనుగోలు చేయాల్సిన విమానాల్ని 126 నుంచి 32కు ఎందుకు తగ్గించారని ప్రశ్నించారు. లోక్‌సభలో సీతారామన్‌ వివరణ ఇచ్చిన తరువాత రాహుల్‌  స్పందిస్తూ..రఫేల్‌ ఒప్పందంపై తాను సంధించిన ప్రశ్నలకు ఆమె బదులివ్వలేదని తెలిపారు. ‘ప్రధాని పార్లమెంట్‌కు రారు. గోవా ముఖ్యమంత్రేమో రఫేల్‌ ఫైల్స్‌ తన వద్ద ఉన్నాయని అంటున్నారు. రక్షణ మంత్రి రెండు గంటలు ప్రసంగించినా నేను అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేదు’ అని రాహుల్‌ అన్నారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా