ఎవరూ సంతోషంగా లేరన్నా.. 

7 Aug, 2018 04:08 IST|Sakshi
తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నెల్లిపూడిలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌తో కలసి పాదయాత్ర చేస్తున్న విద్యార్థినులు

     ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ఎదుట వాపోయిన వివిధ వర్గాల ప్రజలు 

     పంటలకు గిట్టుబాటు ధర దక్కడం లేదని రైతుల ఆవేదన 

     ఆరోగ్యశ్రీని అటకెక్కించారని రోగుల మండిపాటు 

     ఉద్యోగం లేదు.. ఉపాధి లేదు.. భృతీ లేదని నిప్పులు చెరిగిన నిరుద్యోగులు 

     చంద్రబాబు కొడుక్కు మాత్రం జాబొచ్చిందని ఆగ్రహం 

     నాలుగేళ్లుగా అన్నీ కష్టాలేనంటూ ఏకరువు పెట్టిన జనం 

     మనందరి ప్రభుత్వం రాగానే ఆదుకుంటామని జననేత హామీ 

     కృతజ్ఞతలు తెలిపిన కాపులు, కౌలు రైతులు 

ప్రజాసంకల్పయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి:  ఏడాది పొడవునా కాయకష్టం చేసినా వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదని రైతులు.. ఇంటికొకరు మంచం పట్టినా పట్టించుకునే దిక్కు లేకుండా పోయిందని రోగగ్రస్తులు.. నిరుద్యోగులకు ఉద్యోగం, ఉపాధి చూపకుండా ముఖ్యమంత్రి తన కొడుక్కు మాత్రం పదవి ఇచ్చుకున్నారని యువతీ యువకులు.. ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట వాపోయారు. నాలుగేళ్లుగా అన్నీ కష్టాలేనని, ఎవరూ సంతోషంగా లేరని అన్ని వర్గాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా 230వ రోజు సోమవారం ఆయన తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని శంఖవరం మండలంలో పాదయాత్ర కొనసాగించారు. తొలుత.. మాజీ మంత్రి జక్కంపూడి రామమోహనరావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి వైఎస్‌ జగన్‌ పూలమాల వేసి నివాళులు అర్పించారు.

అనంతరం కత్తిపూడి శివారు నుంచి ప్రారంభమైన యాత్ర నెల్లిపూడి, శాంతి ఆశ్రమం అడ్డరోడ్డు మీదుగా శంఖవరం వరకు కొనసాగింది. తమ కష్టాలు వినే నాయకుడు వచ్చారంటూ దారిపొడవునా వివిధ వర్గాల ప్రజలు ఘన స్వాగతం పలికారు. మరోవైపు తమ వ్యక్తిగత సమస్యలు మొదలు సమష్టి అంశాల వరకు... ఎన్నింటినో జననేతకు వివరించారు. పరిష్కారం చూపండని కోరారు. నెల్లిపూడి దాటిన తర్వాత రైతులు, కౌల్దార్లు, వ్యవసాయ కార్మికులు పొలాల్లోంచి బిలబిల మంటూ రోడ్డు పైకి వచ్చి తమ కష్టాలను ఏకరవుపెట్టారు.

ఎకరానికి రూ.25 వేలు ఖర్చవుతుంటే 25 బస్తాల ధాన్యం వస్తోందని, బస్తా రూ.వెయ్యి చొప్పున కల్లాల్లోనే అమ్మి బాకీలు తీర్చి తిండి గింజలకు కూడా ఇక్కట్లు పడాల్సి వస్తోందని సైపిరెడ్డి అప్పారావు, ఆది నాగేశ్వరరావు తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యాన్ని దాచుకుంటే ఇంకో రెండు మూడొందలు అదనంగా వచ్చే పరిస్థితి ఉన్నా, అప్పులపై వడ్డీ పెరిగిపోతుందన్న భయంతో అక్కడికక్కడే అమ్ముకుంటున్నామని చెప్పారు. తమకు సాగు నీరు లేదని, కొండలు, గుట్టలపై నుంచి వచ్చే నీటిని చెరువుల్లో నిల్వ చేసుకుని పొలాలకు పెట్టుకుంటున్నామన్నారు. వర్షాలు పడితే ఫర్వాలేదు గానీ, లేకుంటే పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందన్నారు. ఈ సందర్భంగా జగన్‌ స్పందిస్తూ.. మనందరి ప్రభుత్వం వచ్చాక పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి ఈ ప్రాంతానికి సాగునీరు అందిస్తామని రైతులకు హామీ ఇచ్చారు.  

వైద్యం అందక చచ్చిపోతున్నామయ్యా.. 
ఏజెన్సీ ముఖ ద్వారంగా భావించే శంఖవరం మండలంలో జగన్‌ అడుగుపెట్టినప్పటి నుంచి పదుల సంఖ్యలో అనారోగ్యంతో బాధపడుతున్న వారు తమ ఈతి బాధలను ఏకరువుపెట్టారు. కాళ్లు విరిగినా, డయేరియా బారిన పడినా, క్యాన్సర్‌తో బాధపడుతున్నా, చివరకు చంటి పిల్లలకు జ్వరం వచ్చినా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడని వాపోయారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీని అటకెక్కించారని, కుయ్‌.. కుయ్‌.. కుయ్‌.. అంటూ వచ్చే అంబులెన్స్‌ల మోతలే తమ ప్రాంతంలో వినిపించకుండా పోయాయన్నారు. చిన్నపాటి అస్వస్థతకు గురైనా ప్రైవేటు ఆస్పత్రులకే వెళ్లాల్సి వస్తోందని వాపోయారు. తీరా అక్కడికి వెళితే ఆ టెస్టూ ఈ టెస్తూ అంటూ వేలల్లో ఖర్చు పెట్టిస్తున్నారని బాధపడ్డారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉచిత వైద్యాన్ని అటకెక్కించారని జగన్‌కు ఫిర్యాదు చేశారు. బాధితుల గోడు ఓపిగ్గా విన్న జగన్‌.. వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే తన సహాయకులను పురమాయించారు. అన్ని కేసుల వివరాలను నమోదు చేసుకుని ఎలా పరిష్కరించవచ్చో చూడండని తన వ్యక్తిగత సిబ్బందిని ఆదేశించారు. ఆరోగ్యశ్రీని సంస్కరించి పేదలందరికీ ఉచితంగా వైద్యం అందించేలా ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చారు. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీలో చేరుస్తానని తాను ఇప్పటికే మాట ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. 

జగన్‌ వస్తేనే జాబు వస్తుంది.. 
శంఖవరం గ్రామంలో ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన నిరుద్యోగ యువతీ యువకులు జగన్‌ను కలిసి ఉద్యోగాల కోసం తాము పడుతున్న బాధల్ని విన్నవించారు. బాబొస్తే జాబొస్తుందని, లేకుంటే నిరుద్యోగ భృతి అయినా వస్తుందని నమ్మి మోసపోయామన్నా అని వాపోయారు. లింగంపర్తికి చెందిన సతీష్‌ అనే యువకుడు చంద్రబాబు చేసిన మోసాన్ని జగన్‌ ఎదుట వివరిస్తూ.. రాష్ట్రంలో కోటీ 70 లక్షల కుటుంబాలు ఉంటే చంద్రబాబు ఇప్పుడు కేవలం పది లక్షల కుటుంబాలకే నిరుద్యోగ భృతి ఇస్తామంటున్నారన్నా.. ఇది మమ్మల్ని మోసం చేయడమే.. అన్నారు. జగన్‌ వస్తేనే జాబు వస్తుందని రాసిన ప్లకార్డులు పట్టుకుని పలువురు యువకులు నినాదాలు చేశారు.

బాబు వచ్చాక ఆయన కుమారుడు లోకేశ్‌కు మాత్రమే జాబు వచ్చిందని మండిపడ్డారు. జగన్‌ స్పందిస్తూ.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగ సమస్య పరిష్కరించేందుకు తక్షణ చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు. శంఖవరంలో పెద్ద ఎత్తున కాపు మహిళలు జగన్‌కు ఎదురేగి స్వాగతం పలికారు. ప్రధాన రహదారిపై పూలు చల్లి గ్రామంలోకి ఆహ్వానించారు. కాపు కార్పొరేషన్‌కు రూ.10 వేల కోట్లు ఇస్తామని ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు ఎటువంటి నష్టం లేకుండా తమకు మేలు చేస్తానని వైఎస్‌ జగన్‌ హామీ ఇవ్వడం పట్ల కౌలు రైతులు అనేక మంది జగన్‌ను కలిసి అభినందనలు తెలిపారు.  మధ్యాహ్నం తర్వాత చిరుజల్లులు పడుతున్నా జగన్‌ పాదయాత్రను కొనసాగించారు. జనం సైతం వర్షాన్ని లెక్కచేయకుండా రోడ్లపైకి వచ్చి జననేతకు ఘన స్వాగతం పలికారు.  
  
వైఎస్సార్‌సీపీలోకి సినీ నటుడు కృష్ణుడు 
వినాయకుడు సినిమా ఫేమ్‌గా పేరుగాంచిన నటుడు కృష్ణుడు వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్‌ జగన్‌.. కృష్ణుడికి వైఎస్సార్‌సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పాదయాత్రలో కొద్దిసేపు జగన్‌తో పాటు అడుగులో అడుగువేశారు. అనంతరం కృష్ణుడు మాట్లాడుతూ.. పార్టీ అధ్యక్షుడు జగన్‌ తనకు ఏ బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా పని చేస్తానని చెప్పారు.  

మరిన్ని వార్తలు