ఏడాది వరకు నేనే సీఎం

16 Jun, 2018 02:58 IST|Sakshi

లోక్‌సభ ఎన్నికలయ్యే వరకు నన్నెవరూ టచ్‌ చేయలేరు

సీఎం కుమారస్వామి వ్యాఖ్యలు  

సాక్షి, బెంగళూరు: కనీసం సార్వత్రిక ఎన్నికలయ్యే వరకైనా తానే కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉంటాననీ, అప్పటి వరకు తననెవరూ టచ్‌ చేయలేరని ఆ రాష్ట్ర సీఎం హెచ్‌డీ కుమారస్వామి శుక్రవారం వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌–జేడీఎస్‌ల సంకీర్ణ ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికల వరకు కొనసాగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.   ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చేలా పనిచేయడమే తన తొలి ప్రాధాన్యమని చెప్పారు. సంకీర్ణ ప్రభుత్వం ఎంత కాలం ఉంటుందో ఎవరూ చెప్పలేరని ఆయన పేర్కొనడం గమనార్హం. రుణమాఫీపై గందరగోళం వద్దని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామన్నారు.

కుమారస్వామి వ్యాఖ్యలపై చర్చ
ఐదేళ్ల పాటు సంకీర్ణ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదనీ, ముఖ్యమంత్రిగా కుమారస్వామి కొనసాగుతారని కాంగ్రెస్‌ చెబుతున్నా.. సీఎం అందుకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేయడంపై రాష్ట్రంలో చర్చ మొదలైంది. జేడీఎస్‌–కాంగ్రెస్‌లు అధికారం చేపట్టినప్పటి నుంచి మంత్రివర్గంలో స్థానం కోసం ఇరు పక్షాల నేతలు తీవ్రస్థాయిలో లాబీయింగ్‌లు చేశారు. చివరకు ఇటీవల మంత్రివర్గ విస్తరణ పూర్తవడంతో పదవులు దక్కని వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో సంకీర్ణ ప్రభుత్వంపై చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే లోక్‌సభ ఎన్నికల వరకు కాంగ్రెస్‌ పార్టీకి జేడీఎస్‌ మద్దతు అవసరం కాబట్టి ఎలాంటి ఇబ్బందులూ తలెత్తే ప్రసక్తే ఉండబోదని పరిశీలకులు భావిస్తున్నారు.

ముసాయిదా కమిటీ ఏర్పాటు
జేడీఎస్‌–కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం నెరవేర్చాల్సిన వివిధ హామీలను ఎంపిక చేసేందుకు ఐదుగురు సభ్యులతో ఓ ముసాయిదా కమిటీ ఏర్పాటైంది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీరప్ప మొయిలీ ముసాయిదా కమిటీకి నేతృత్వం వహిస్తారు. ఇరు పార్టీల మేనిఫెస్టోల్లోని హామీలను పరిశీలించి వాటిని ఎలా నెరవేర్చాలో నివేదిక ఇవ్వడమే ఈ ముసాయిదా కమిటీ విధి. 

మరిన్ని వార్తలు