కాంగ్రెస్, బీజేపీ ఓట్లకన్నా నోటా ఓట్లే ఎక్కువ

25 May, 2019 04:21 IST|Sakshi

రాష్ట్ర అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో సిత్రమిది

లోక్‌సభ స్థానాల్లో నమోదైన ఓట్లు 4,69,863

అసెంబ్లీ సెగ్మెంట్లలో నోటా ఓట్లు 4,01,969

సాక్షి, అమరావతి: రాష్ట్ర జాతీయ పార్టీలకు లభించిన ఓట్లకంటే నోటా (నన్‌ ఆఫ్‌ ది ఎబవ్‌) ఓట్లే అధికంగా నమోదయ్యాయి. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో నోటా ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమైంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు నోటా స్థాయిలో కూడా ఓట్లు పడలేదు. లోక్‌సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీకి కేవలం 1.29 శాతం ఓట్లు రాగా, మరో జాతీయ పార్టీ బీజేపీకి  0.96 శాతం ఓట్లు లభించాయి. అదే లోక్‌సభ నియోజకవర్గాల్లో నోటాకు మాత్రం 1.49 శాతం ఓట్లు నమోదయ్యాయి. అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలైన ఓట్లను పరిశీలించినా ఈ రెండు జాతీయ పార్టీల కన్నా నోటాకే ఎక్కువ ఓట్లు వచ్చాయి.  కాంగ్రెస్‌కు అసెంబ్లీ స్థానాల్లో 1.17 శాతం ఓట్లు రాగా.. బీజేపీకి 0.84 శాతం ఓట్లు లభించాయి. నోటాకు మాత్రం 1.28 శాతం ఓట్లు నమోదయ్యాయి.

మరో పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు వైఎస్సార్‌సీపీ ఓట్లను చీల్చాలనే కుట్రతో బీఎస్పీ అభ్యర్థులను రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లో పోటీకి దింపారు. ఆ పార్టీకి కూడా నోటాకు వచ్చిన ఓట్ల శాతంలో సగం కూడా లేకపోవడం గమనార్హం. ఆ పార్టీకి రాష్ట్రంలోని లోక్‌సభ స్థానాల్లో కేవలం 0.26 శాతం ఓట్లు, అసెంబ్లీ స్థానాల్లో 0.28 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. జాతీయ పార్టీలైన సీపీఎం, సీపీఐలకు సైతం నోటా ఓట్లలో సగం కూడా రాలేదు. ఆ రెండు పార్టీలు జనసేనతో సీట్ల సర్దుబాటు చేసుకుని పోటీ చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీ స్థానాల్లో సీపీఐకి కేవలం 0.11 శాతం ఓట్లు రాగా, సీపీఎంకు 0.32 శాతం ఓట్లు వచ్చాయి.

మరిన్ని వార్తలు