హస్తం గాలి ‘వీచినట్టేనా’!

1 Dec, 2023 01:29 IST|Sakshi

కాంగ్రెస్‌ శిబిరంలో ధీమా 

రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్‌ అనుకూలంగాజరిగిందని అంచనా.. 70 స్థానాలకు పైగా గెలుస్తామని లెక్కలు... 

నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్,వరంగల్‌ జిల్లాలపై భారీ ఆశలు 

సింగరేణి సహకరించిందంటున్నహస్తం పార్టీ.. హైదరాబాద్‌ శివారుఓటర్లూ తమవైపేనని ధీమా 

వార్‌ రూం నుంచి పోలింగ్‌ సరళి సమీక్షించిన ఠాక్రే, దీపాదాస్‌ మున్షీ, కుసుమ కుమార్‌  

సాక్షి, హైదరాబాద్‌: ఈసారి అధికారం కచ్చితంగా దక్కుతుందనే ధీమా కాంగ్రెస్‌ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. గురువారం జరిగిన పోలింగ్‌ సరళిని బట్టి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా తమకు అనుకూల పరిస్థితులు కనిపించాయని, 70కి పైగా స్థానాల్లో గెలుపొంది అధికారంలోకి వస్తామని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఇప్పటికి ప్రజలు తమను ఆదరించారని, బీఆర్‌ఎస్‌ పార్టీ, కేసీఆర్‌ పాలన పట్ల వ్యతిరేకతతో ఉన్న అన్ని వర్గాలూ తమవైపు మొగ్గుచూపాయనే అభిప్రాయం రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల్లో కనిపిస్తోంది.

దక్షిణ తెలంగాణతో పాటు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఊహించని విజయం దక్కుతుందని, మిగిలిన జిల్లాల్లో కూడా ఓ మోస్తరు నుంచి అధిక శాతం సీట్లలో గెలుపు తమదేనని వారు లెక్కలు వేస్తున్నారు. సింగరేణి ప్రాంత ఓటర్లు కూడా తమవైపే నిలిచారని, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి ప్రాంతంలోని నియోజకవర్గాల్లో ఎక్కువ స్థానాలు తమ ఖాతాలోనే పడతాయని చెబుతున్నారు.

ఇక, హైదరాబాద్‌ శివార్లలో కూడా తమకు భారీగా పోలింగ్‌ జరిగిందని అంచనా వేస్తున్నారు. మెజార్టీ ఎగ్జిట్‌పోల్స్‌ కూడా తమదే అధికారం అని చెపుతున్న నేపథ్యంలో ఈనెల 3న∙ఫలితాల కోసం కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఆత్రుతతో ఎదురుచూస్తుండడం గమనార్హం. 

పోలింగ్‌ సరళిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ.. 
గురువారం ఉదయం పోలింగ్‌ ప్రారంభమైన సమయం నుంచి కాంగ్రెస్‌ ముఖ్య నేతలంతా పోలింగ్‌ సరళిని నిశితంగా పరిశీలించారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ఠాక్రే, ఏఐసీసీ పరిశీలకురాలు దీపాదాస్‌మున్షీ, టీపీసీసీ మాజీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జెట్టి కుసుమకుమార్‌ గాం«దీభవన్‌లోని వార్‌రూంలో కూర్చుని పరిస్థితిని సమీక్షించారు. నియో జకవర్గాల వారీగా పోలింగ్‌ శాతాన్ని పరిశీలిస్తూ, క్షేత్రస్థాయిలోని నాయకత్వానికి అవసరమైన సూచనలు చేస్తూ వారిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసే పనిలో నిమగ్నమయ్యారు.

ఓటర్ల నాడి అనుకూలంగానే ఉన్నా పోల్‌ మేనేజ్‌మెంట్‌లో కాంగ్రెస్‌ పార్టీ వెనుకబడిందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో తమ ఓట్లన్నీ కచ్చితంగా పోలయ్యేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. వార్‌ రూం కోఆర్డినేటర్‌ విజయభాస్కర్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్‌కౌశిక్‌యాదవ్‌ వార్‌రూం సిబ్బందితో కలిసి ఎప్పటికప్పుడు అభ్యర్థులు, స్థానిక పార్టీ నేతలతో మాట్లాడుతూ పోల్‌ మేనేజ్‌మెంట్‌పై దృష్టి పెట్టి పనిచేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కొడంగల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో పర్యటిస్తూనే ఎప్పటికప్పుడు వార్‌రూంతో టచ్‌లో ఉంటూ పోలింగ్‌ సరళిపై ఆరా తీశారు.

సీఎల్పీ నేత భట్టితో పాటు ఇతర కాంగ్రెస్‌ ముఖ్య నేతలు కూడా తాము పోటీ చేస్తున్న నియోజకవర్గాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పోలింగ్‌ తీరును పరిశీలించారు. ఈ ఎన్నికల్లో వ్యూహకర్తగా కీలకపాత్ర పోషించిన సునీల్‌ కనుగోలు ఆయన బృందం కూడా పోలింగ్‌ సరళిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఎన్ని స్థానాల్లో సానుకూలత ఉందన్న లెక్కలు కట్టింది.

ఆ నాలుగు.. మావే
జిల్లాల వారీగా విశ్లేషిస్తే పోలింగ్‌ తీరును బట్టి నాలుగు జిల్లాల్లో చెప్పుకోదగిన స్థానాలు సాధిస్తామనే అభిప్రాయం కాంగ్రెస్‌ నేతల్లో వ్యక్తమవుతోంది. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్‌తో పాటు వరంగల్‌ జిల్లాల్లో ఉన్న 46 స్థానాల్లోనే 35 తమకు ఖాయమని లెక్కలు వేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో కూడా బీఆర్‌ఎస్‌ కంటే ఎక్కువ సీట్లు వస్తాయని, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్‌ జిల్లాల్లో కొంచెం అటూ ఇటుగా ఫలితాలు వస్తాయని చెబుతున్నారు.

హైదరాబాద్‌ పరిధిలోనికి వచ్చే స్థానాల్లో కూడా 4–5 చోట్ల గెలుపునకు అవకాశాలున్నాయని, ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కలిపి 10 స్థానాల వరకు చేరుకుంటామని అంటున్నారు. అన్ని జిల్లాల్లో కలిపి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ కంటే ఓ 10 సీట్లు ఎక్కువే వస్తాయన్న నమ్మకాన్ని కాంగ్రెస్‌ నేతలు వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు