నువ్‌ జాగర్త నాయనా..

14 Nov, 2018 04:47 IST|Sakshi
గెడ్డలుప్పిలో జగన్‌తో కలిసి నడుస్తున్న అవ్వ

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌తో వృద్ధులు 

ఈ పాలకులు ఎంతకైనా తెగిస్తారని ఆందోళన 

అయినా ఈసారి అందరి ఓట్లూ జననేతకే.. 

దారిపొడవునా ఊరూరా ఘన స్వాగతం 

బాబు మాటలకు మోసపోయామన్న నిరుద్యోగులు 

అందరి కష్టాలు విని ధైర్యం చెప్పిన జగన్‌ 

వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ మంత్రి సి.రామచంద్రయ్య

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘నువ్‌ జాగర్తగా ఉండాలి నాయనా.. నీ మీద ఇంకా కుట్రలు సేత్తారు..’ అని పలువురు వృద్ధ మహిళలు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌తో ఆందోళన వ్యక్తం చేశారు. మరి కొందరైతే జననేతను చూడగానే ఉద్వేగాన్ని ఆపుకోలేక ఏడ్చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 296వ రోజు మంగళవారం ఆయన సాలూరు, పార్వతీపురం నియోజకవర్గంలో పాదయాత్ర సాగించారు. కొయ్యానపేట నుంచి ప్రారంభమై కంచేడువలస క్రాస్, వెంకటభైరిపురం, బగ్గందొర వలస, గెడ్డలుప్పి జంక్షన్‌ మీదుగా తామరఖండి వరకు కొనసాగిన యాత్రలో ఆద్యంతం ప్రజలు జననేతకు ఘన స్వాగతం పలికారు. మరో వైపు తమ కష్టాలూ చెప్పుకున్నారు. జగన్‌ తమ గ్రామాల గుండా వెళుతున్నారని తెలుసుకున్న మహిళలు పనులను పక్కనబెట్టి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. రోడ్డుకు ఇరువైపులా వేచి ఉండి జగన్‌కు సంఘీభావం ప్రకటించారు. జగన్‌పై జరిగిన హత్యాయత్నం గురించి పాదయాత్రలో పాల్గొన్న జనం చర్చించుకున్నారు. ‘అధికారం కోసం ఈ పాలకులు ఏమైనా చేస్తారు.. జగన్‌ మరింత జాగ్రత్తగా ఉండాలి. అయినా ఈసారి అందరూ జగన్‌కే ఓటు వేయడం ఖాయం’ అని పలువురు వృద్ధులు అనుకుంటుండటం వినిపించింది.


వెంకటభైరిపురంలో ప్రజలకు అభివాదం చేస్తున్న జగన్‌  

 
వెంకటభైరిపురమే కదలి వచ్చిందా.. 
సాలూరు నియోజకవర్గం సరిహద్దుల్లో ఉన్న వెంకటభైరిపురం గ్రామం మీదుగా జగన్‌ వెళుతున్నపుడు ఊరే కదిలి వచ్చిందా.. అన్నట్లు వీధులన్నీ మహిళలు, జనంతో కిక్కిరిశాయి. ఈ గ్రామంలోకి జగన్‌ వస్తున్నప్పుడు దాదాపుగా ఇళ్లన్నీ ఖాళీ. ప్రజలందరూ రోడ్డుపైకి వచ్చారు. ఊరి పొలిమేరల్లో ప్రారంభమైన సందడి దాటి వెళ్లే వరకూ కొనసాగింది. సాలూరు దాటి పార్వతీపురం నియోజకవర్గంలో ప్రవేశిస్తున్నపుడు సీతానగరం మండలంలోని బగ్గందొరవలస గ్రామంలో అపూర్వమైన రీతిలో స్థానికులు స్వాగతం పలికారు. డప్పుల మోతలు, చిందులతో అక్కడి ప్రజలు జననేతను ఆహ్వానించారు. రెప రెపలాడుతున్న పార్టీ జెండాలు చేతబూని, పార్టీ రంగులున్న టీషర్టులు ధరించిన యువకులు, కండువాలు వేసుకున్న కార్యకర్తలు పెద్ద సంఖ్యలో జననేత వెంట అడుగులో అడుగు వేశారు. నవరత్నాలు పథకాలను ప్రజలకు తెలియ జెప్పేలా అమర్చిన పెద్ద పెద్ద ఫ్లెక్సీలతో పార్వతీపురం ప్రజలు జగన్‌పై తమ అభిమానాన్ని చాటుకున్నారు. జగన్‌ను కలిసి సంఘీభావం తెలిపిన వారిలో మహిళలే ఎక్కువగా కనిపించారు.  ఏళ్ల తరబడి గ్రామాల్లో పరిష్కారం కాని సమస్యల గురించి ప్రజలు జగన్‌కు విన్నవించారు.


 
బాబు మోసం చేశారన్నా.. 
‘బాబు వస్తే జాబు వస్తుంది’ అని మమ్మల్ని నమ్మించి ఓట్లు వేయించుకుని.. తీరా గద్దెనెక్కాక దారుణంగా మోసం చేశారు.. మేం చదువులు పూర్తి చేసి ఏళ్లు గడుస్తున్నా ఉద్యోగాలు రావడం లేదు. రోజులు గడవడమే కష్టమవుతోంది’ అని సాలూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నిరుద్యోగులు వెంకటభైరిపురం గ్రామం వద్ద వైఎస్‌ జగన్‌తో మొర పెట్టుకున్నారు. మీరు అధికారంలోకి రాగానే తమ సమస్యలు తీర్చాలని కోరారు. చంద్రబాబు అన్ని వర్గాల వారినీ మోసం చేశారని పలువురు జననేతకు చెప్పుకున్నారు. అందరి సమస్యలను ఓపికగా విన్న జననేత.. మనందరి ప్రభుత్వం రాగానే అందరినీ ఆదుకుంటామని భరోసా ఇస్తూ ముందుకు సాగారు.

రామచంద్రయ్య మంచి చేస్తారని విశ్వసిస్తున్నా.. 
సి.రామచంద్రయ్య తనకున్న అపార రాజకీయానుభవంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి మంచి చేస్తారని తాను సంపూర్ణంగా విశ్వసిస్తున్నానని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. మాజీ మంత్రి, వైఎస్సార్‌ జిల్లాకు చెందిన సీనియర్‌ నేత సి.రామచంద్రయ్య మంగళవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వెంకటభైరిపురం శివారు వద్ద అనుచరులతో కలిసి వచ్చిన ఆయన్ను జననేత వైఎస్‌ జగన్‌ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ కుటుంబ సభ్యునిగా రామచంద్రయ్య రాబోయే రోజుల్లో తనకున్న అనుభవంతో పార్టీకి మేలు చేస్తారని భావిస్తూ పార్టీలోకి ఆహ్వానిస్తున్నానన్నారు.  

వైఎస్సార్‌సీపీ గెలుపు చారిత్రక అవసరం: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా అడుగంటి పోయిందని, ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకు రావడం అనేది చారిత్రక అవసరమని రామచంద్రయ్య అన్నారు. పార్టీలో చేరిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు ఖూనీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్‌ వ్యవస్థను కూడా నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ప్రజాస్వామ్యం బతకాలంటే చంద్రబాబు లాంటి వ్యక్తులను దూరంగా ఉంచాలన్నారు. ఏ భావాలతోనైతే టీడీపీ పుట్టిందో అదిప్పుడు లేదని, ఇప్పుడు చంద్రబాబు.. తల్లి కాంగ్రెస్‌ కాళ్లు పట్టుకుని దేశంలో చక్రం తిప్పాలని కలలు కంటున్నారని విమర్శించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి ఇంకా చాలా మంది నేతలు వచ్చే అవకాశం ఉందన్నారు. తన అనుభవంతో పార్టీ మరింత బలోపేతం కావడానికి కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, తాజా మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వైఎస్సార్‌ జిల్లా ఎమ్మెల్యేలు శెట్టిపల్లి రఘురామిరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, షేక్‌ బేపారి అంజాద్‌బాషా, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, కడప మేయర్‌ కె.సురేష్‌బాబు పాల్గొన్నారు.     

జగన్‌ క్షేమం కోసం అజ్మీర్‌లో ప్రార్థనలు 
రాష్ట్ర ప్రజల కోసం వైఎస్‌ జగన్‌ క్షేమంగా ఉండాలని కోరుతూ అజ్మీర్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించినట్లు పార్టీ మైనార్టీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మైనార్టీ ప్రచార అధ్యయన కమిటీ సభ్యుడు అస్సరీ మహ్మద్‌ రఫీ తెలిపారు. అజ్మీర్‌లో ప్రార్థనల ఫొటోలను ఆయన వైఎస్‌ జగన్‌కు అందజేశారు. జగన్‌ ముఖ్యమంత్రి కాగానే మరోసారి అజ్మీర్‌ వెళ్లి మొక్కులు తీర్చుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మైనార్టీ సెల్‌ నేతలు పి.ఖాజా, అల్లావలి, షేక్‌ మున్నీ, ఎ.మస్తాన్‌వలీ పాల్గొన్నారు.  

 

‘నేను సైతం అన్న కోసం’ వెబ్‌సైట్‌ ప్రారంభం 
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి బృందం: వైఎస్సార్‌సీపీ ఐటీ విభాగం, అమెరికా వైఎస్సార్‌సీపీ విభాగం సంయుక్తంగా రూపొందించిన ‘నేను సైతం అన్న కోసం’ అనే కార్యక్రమంలో భాగంగా www.annakosam.com వెబ్‌సైట్‌ను ప్రతిపక్ష నేత, ఆ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. మంగళవారం పాదయాత్రలో మధ్యాహ్న భోజన విరామ శిబిరం వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు. దేశ, విదేశాల్లో ఉంటూ వైఎస్సార్‌సీపీ అభివృద్ధికి సహకరించాలనుకునే వారి కోసం ఈ వెబ్‌సైట్‌ రూపొందించినట్లు పార్టీ ఐటీ విభాగం అధ్యక్షుడు చల్లా మధుసూదనరెడ్డి తెలిపారు. పార్టీ కోసం పని చేయాలనుకునే వారు ఈ వెబ్‌సైట్‌లో లాగాన్‌ అయ్యి, వారు ఏ రకమైన సహాయం చేయాలనుకుంటున్నారో పొందుపరచాలన్నారు. దాదాపు 25 దేశాల్లోని అభిమానులను ఇందులో సభ్యలుగా చేర్చాలని లక్ష్యం పెట్టుకున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అమెరికా కన్వీనర్‌ రత్నాకర్, ఎన్‌ఆర్‌ఐలు మేడపాటి వెంకట్, హర్షవర్థన్‌రెడ్డి, సాయికృష్ణారెడ్డి, జగదీష్, చందు తదితరులు పాల్గొన్నారు.   

మా కష్టాలు అన్నీ ఇన్నీ కాదయ్యా.. 
అయ్యా.. మాది మక్కువ మండలం తూరుమామిడివలస. మా ఊరికి రోడ్డు సమస్య చాలా కాలం నుండి వేధిస్తోంది. కాలువలు కూడా లేవు. ఎక్కడికక్కడ నీరు గోతుల్లోనే ఉండిపోతోంది. దీంతో పొలాలు తడవక పంటలు చేతికందడం లేదు. మేము జనుము, చెరకు, పత్తి పండిస్తుంటాము. ఈ ఏడాది నీరు లేక ఏ పంట కూడా సరిగా చేతికందలేదు. పత్తి అయితే అసలు పండనే లేదు. నీరు సరిపోక వరి  పండించడం ఏకంగా మానేశాము. మా ఊరు సర్పంచ్‌ రెడ్డి కృష్ణంనాయుడుకు మా సమస్యలు విన్నవించాం.  
– జక్కు రామలక్ష్మి, రెడ్డి గౌరమ్మ,చప్ప పోలమ్మ, రెడ్డి రామలక్ష్మి

జూనియర్‌ కళాశాలల్లో నేల చదువులు 
అన్నా.. మేం మక్కువ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చదువుతున్నాం. కనీస సౌకర్యాలు కూడా లేవన్నా.. పేరుకే కళాశాల కానీ కూర్చునేందుకు బెంచీలు లేక నేలపైనే కూర్చొని చదువుతున్నాం. కనీసం ఫ్యాన్లు కూడా లేవు. ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నాం. ప్రహరీ లేక పందులు, కుక్కలు, పశువులు ఆవరణలోకి వస్తున్నాయి. అపరిశుభ్ర వాతావరణంలో చదవలేకపోతున్నాం. మరుగుదొడ్లకు రన్నింగ్‌ వాటర్‌ లేదు. మా కాలేజీ సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోండన్నా..  
– వెన్నెల హేమలత, పిట్ట గంగ, ఎ.రామలక్ష్మి  

మధ్యాహ్న భోజన పథకాన్ని తీసేయాలని చూస్తున్నారు..
అన్నా.. చంద్రబాబు నాయుడు మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నాడు. మధ్యాహ్న భోజన కార్మికుల వల్ల కమీషన్లు రావడం లేదని పార్సిల్‌ విధానాన్ని తెరపైకి తేవాలని చూస్తున్నారు. అదే జరిగితే మేమంతా రోడ్డున పడాల్సి వస్తుంది. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి గారు మాకు నెలకు రూ.1000 జీతాన్ని అమల్లోకి తెచ్చారు. ప్రస్తుతం ఖర్చులు బాగా పెరిగినప్పటికీ ఈ ప్రభుత్వం జీతం పెంచకపోగా బిల్లులను కూడా సక్రమంగా మంజూరు చేయడం లేదు. మూడు నెలలకోసారి బిల్లులు మంజూరు చేస్తే ఎలా వండి పెట్టగలుగుతాం? మా బతుకులు మార్చండయ్యా అని ధర్నాలు చేస్తే అక్రమంగా అరెస్ట్‌ చేసి, భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నా. 
– రెడ్డి నీలమ్మ, మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు, వెంకట భైరిపురం  

మరిన్ని వార్తలు