రైతన్న ముఖంలో చిరునవ్వే లక్ష్యం

18 Mar, 2018 02:28 IST|Sakshi
ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను శివారులో జరిగిన రైతుల ఆత్మీయ సమ్మేళనంలో ప్రసంగిస్తున్న వైఎస్‌ జగన్‌

     రైతుల ఆత్మీయ సమ్మేళనంలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

     వైఎస్సార్‌ జయంతిని రైతు దినోత్సవంగా జరిపేలా గొప్ప పాలన అందిస్తాం

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : ‘ప్రతి రైతన్న ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే నా లక్ష్యం. అన్నదాతల కోసం దివంగత ముఖ్యమంత్రి, ప్రియతమ నాయకుడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఎంతగానో కృషి చేశారు. ఆయన కుమారుడిగా నేను మరింతగా కృషి చేస్తాను. చంద్రబాబు నాయుడులాగా కమీషన్లు తీసుకో వాలనే ఆశ నాకు లేదు. నేను చనిపోయాక కూడా అందరి ఇళ్లలో నాన్నగారి ఫొటోతో పాటు నా ఫొటో కూడా ఉండేలా పాలన అందించాలని తపన పడుతున్నా’అని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శనివారం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం లోని కాకుమాను శివారులో రైతుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. దివం గత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి అయిన జూలై 8వ తేదీన రైతు దినోత్సవం జరిపేలా గొప్ప పాలన అందించాలన్నదే తన లక్ష్యం అని చెప్పారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ, వడ్డీ లేని రుణాలు, రుణమాఫీ అమలు కాక రైతులు అవస్థల్లో ఉంటే వ్యవసాయంలో వృద్ధి రేటు పెరిగిందని చంద్రబాబు జిమ్మిక్కులు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో ఆయనకు తోడుగా వచ్చింది ఒక్క కరువేనని చెప్పారు. ఈ సదస్సులో జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే.. 

కేసీఆర్‌కు ఉన్నదేమిటి.. చంద్రబాబుకు లేనిదేమిటి?
‘‘నాలుగు సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు పాలన చూస్తున్నాం. మరో ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్నాయని ఆయనే చెబుతున్నారు. ఈ నాలుగు సంవత్సరాల్లో మనలో ఎవరమైనా సంతోషంగా ఉన్నామా? ఏడాదిలో జరగబోయే ఎన్నికల్లో ఇలాంటి నాయకుణ్నే ఎన్నుకుందామా? ఒక్కసారి గుం డెల మీద చేయి వేసుకుని ఆలోచించండి. మన కళ్లెదుటే ఇదే జిల్లాలో నాగార్జున సాగర్‌ కుడి కాలువ పోతోంది. 140 టీఎంసీల నికర జలాలు నాగార్జున సాగర్‌ కుడి కాలువకు కేటాయించారు. దాదాపుగా 11 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటి కేటాయింపులు ఉన్నా చంద్రబాబు నాయుడు గారి నాలుగేళ్ల పాలనలో వరి వేసుకునే పరిస్థితి ఉందా? పక్కనే నాగార్జున సాగర్‌ ఎడమ కాలువ అటు వైపు తెలంగాణకు పోతుంది. తెలంగాణలో వరుసగా వరి వేస్తున్నారు. మరి కేసీఆర్‌ గారికి ఉన్నదేంటీ? చంద్రబాబు గారికి లేనిదేమిటి? నాకర్థం కావడం లేదు. మనం వరి వేసుకునే పరిస్థితి లేకపోవడంతో ఆరుతడి పంటలైన మిర్చి, కంది, పెసర, మినుము, మొక్కజొన్న వేసు కున్నాం. ఈ పంటలకు కనీసం గిట్టు బాటు ధరలు ఉన్నాయా? ఈ నాలుగేళ్ళ పాలనలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు.

ఒక్కపంటకైనా గిట్టుబాటు ఉందా?
రైతన్నల వద్ద పంట ఉన్నప్పుడు ధరలు కిందకు వెళ్లిపోతాయి. దళారుల వద్దకు ఆ పంటంతా వెళ్లిపోయినప్పుడు రేట్లు మాత్రం ఆకాశాన్నంటుతాయి. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి.. రైతన్నలకు తోడుగా ఉండాల్సిన తానే.. దళారుల నాయకుడిగా ఎక్కడ బడితే అక్కడ హెరిటేజ్‌ షాపులతో సొంత వ్యాపారం పెట్టారు. రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసిన సరుకును ప్లాస్టిక్‌ కవర్‌లో నీటుగా ప్యాక్‌ చేసి మూడింతలు నాలుగింతలు ధర ఎక్కువతో ఆయన షాపుల్లో అమ్ముకునే పరిస్థితి. సాక్షాత్తు ముఖ్యమంత్రే ఈ పని చేస్తుంటే ఏమనాలి? ఇదే గుంటూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు ఇంటికి, గుంటూరు మిర్చి యార్డుకి బహుశా నాకు తెలిసి 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అదే మిర్చి యార్డులో రైతన్నలకు మిర్చికి క్వింటాల్‌కు ధర రూ.2,500 కూడా దొరక్క అల్లా డుతుంటే పట్టించుకునే నాధుడు కరు వయ్యారు. నేనొచ్చి నిరాహార దీక్ష చేయా ల్సిన పరిస్థితిలోకి వ్యవస్థ దిగజారిపోయిం ది. ఎన్నికల మేనిఫెస్టోలో జగన్‌ రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి తీసుకొస్తానని చెప్పాడు కాబట్టి.. నేను అంతకంటే ఎక్కువగా.. రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి తీసుకొస్తానని చెప్పాడు. ఈ నిధి ఏమైందో ఆలోచించాలని కోరుతున్నా.

యాక్షన్‌.. సీన్‌.. కట్‌.. 
యాక్షన్‌.. సీన్‌.. కట్‌.. అంటూ.. అబద్ధాలు, మోసాలు. ఏడాదిలో ఎన్నికలు జరుగుతాయి కాబట్టి మనకు ఎలాంటి పరిపాలన కావాలో ఆలోచించండి. మీ అందరి దీవెనలతో మనందరి ప్రభుత్వం రాగానే జూలై 8వ తారీఖున నాన్నగారి జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకునేంత గొప్ప పాలన అందిస్తా. మీ అందరి ఆశీర్వాదంతో ఆ మంచి పరిపాలన చేయగలిగే భాగ్యాన్ని దేవుడు నాకివ్వాలని కోరుకుంటున్నా’’అని జగన్‌ అన్నారు. 

మరిన్ని వార్తలు