పార్లమెంట్‌లో వైఎస్సార్‌సీపీ ఆందోళన

28 Dec, 2018 02:44 IST|Sakshi

పార్లమెంటు ఆవరణలో ప్లకార్డులను ప్రదర్శించిన పార్టీ నేతలు

రాజ్యసభలో వెల్‌లోకి దూసుకెళ్లి నినదించిన విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి  

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటు ఆవరణలో, పార్లమెంటు లోపలా ఆందోళన కొనసాగించింది. ఉదయం సభ ప్రారంభానికి ముందు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద పార్టీ ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, పీవీ మిథున్‌రెడ్డి, వైఎస్‌ అవినాష్‌రెడ్డి, సీనియర్‌ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, అనంత వెంకట్రామిరెడ్డిలు ఆందోళన నిర్వహించారు. ప్రత్యేక హోదా అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు. అనంతరం సభ ప్రారంభం కాగానే రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వెల్‌లోకి దూసుకెళ్లి ప్రత్యేక హోదాపై నినదించారు. ప్లకార్డులను ప్రదర్శించారు. సభ వాయిదా పడిన తరువాత ఎంపీలు జంతర్‌మంతర్‌కు చేరుకుని ‘వంచనపై గర్జన’ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఎన్నికలు వస్తున్నాయనే చంద్రబాబు హడావుడి: విజయసాయిరెడ్డి
ఎన్నికలు వస్తున్నాయని చెప్పి చంద్రబాబు హడావుడి చేస్తున్నారని విజయసాయిరెడ్డి విమర్శించారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘‘కడప స్టీల్‌ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయడం డ్రామా మాత్రమే. ఎన్నికలు వస్తున్నాయని హడావిడి చేస్తున్నారు తప్ప స్టీలు ఫ్యాక్టరీని ప్రారంభించాలన్న ఉద్దేశం ఏమాత్రం లేదు. ఈ ప్రపంచంలో అత్యంత అవినీతిపరుడు, అధర్మానికి పాల్పడేవాడు చంద్రబాబు. దేశంలో ఉన్న 15 రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని కాపురం చేసిన రాజకీయ వ్యభిచారి చంద్రబాబు. చంద్రబాబుకున్న 15 ముసుగుల్లో ఒక్కొక్క ముసుగులో ఒక్కొక్క రాజకీయ పార్టీ ఉంటుంది. తాను దొంగతనం చేసి అందరినీ దొంగ అనడం చంద్రబాబు సిద్ధాంతం. ఇటువంటి దగాకోరు ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్నందునే ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీలు నెరవేరలేదు’’ అని విమర్శించారు.  

మరిన్ని వార్తలు