ప్రగల్భాల పవనం

25 Mar, 2019 09:15 IST|Sakshi

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఈ ఎన్నికల్లో రెండు చోట్ల (విశాఖజిల్లాలోని గాజువాక, జిల్లాలోని భీమవరం) నుంచి పోటీ చేస్తున్నారు. రెండుచోట్లా గెలిస్తే ఒక నియోజకవర్గాన్ని వదిలేయాల్సిందే. ఏది ఉంచుకుంటారో... దేనిని వదిలేస్తారో ఆయనకే తెలియాలి. ఆయన మాత్రం రెండు చోట్లా ఓటర్లపై అలవిమాలిన ప్రేమ ఒలకబోస్తూ.. నోటికొచ్చిన హామీలు ఇవ్వడాన్ని జనం నమ్మడం లేదు.

సాక్షి ప్రతినిధి, ఏలూరు: తాను గెలిస్తే భీమవరాన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతానని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ నామినేషన్ల సందర్భంగా హామీ ఇచ్చారు. నామినేషన్లు వేయగానే భీమవరంపై ఎనలేని ప్రేమ కురిపించారు. తాను గెలిస్తే భీమవరం తాగునీటి సమస్యకు ఆరు నెలల్లో పరిష్కారం చూపిస్తానని పవన్‌కల్యాణ్‌చెబుతున్నారు. గతంలో ప్రజాసమస్యలపై స్పందిస్తూ వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి తన ప్రభుత్వం రాగానే అన్ని సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇస్తే, ముఖ్యమంత్రి అయితేగానీ పనులు చేయరా అంటూ భీమవరం వేదికగానే పవన్‌ ఎద్దేవా చేశారు. తన వంతు వచ్చేసరికి మాట మార్చి తాను గెలిస్తే సమస్యలు పరిష్కరిస్తామని చెబుతున్నారు. భీమవరం నుంచే ఉచిత విద్య, భీమవరం ప్రభుత్వాసుపత్రిని కార్పొరేట్‌ ఆసుపత్రులకు దీటుగా వేయి పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతాం అంటున్నారు.

యనమదుర్రు డ్రెయిన్‌పై మీరు కోరినన్ని  వంతెనలు, ఓవర్‌ బ్రిడ్జిలు నిర్మిస్తానని, భీమవరం అభివృద్ధికి ప్రత్యేక సిబ్బంది నియామకం అంటూ వరాల జల్లు కురిపించేశారు. గత ఐదేళ్లుగా ఆ ప్రభుత్వంతో కలిసి ఉన్న వ్యక్తికి భీమవరం తాగునీటి సమస్య, డంపింగ్‌ యార్డు సమస్యకు పరిష్కారం ఎందుకు గుర్తుకు రాలేదో అన్న ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. తానే పులపర్తి రామాంజనేయుల్ని ఎమ్మెల్యేగా, గోకరాజు గంగరాజును ఎంపీగా గెలిపించానని చెప్పుకుంటున్న పవన్‌కళ్యాణ్‌ ఈ ఐదేళ్లలో  భీమవరానికి ఏం చేశారని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఒక్క సమస్య పరిష్కారం కోసం అయినా ఆయన కృషి చేశారా అన్న ప్రశ్న భీమవరం ప్రజల నుంచి వస్తోంది. తుందుర్రు అక్వా పార్కు నిలుపుదల కోసం ప్రజలు పెద్ద ఎత్తున రోడ్డెక్కి ఉద్యమం చేస్తుంటే, చంద్రబాబునాయుడి ప్రభుత్వం ఉద్యమ కారులపై కేసులు పెట్టడంతో పాటు వారిపై నిర్బంధ కాండను అమలు చేసింది. ఆ సమయంలో ఉద్యమకారులు పవన్‌కళ్యాణ్‌ను పలుమార్లు కలిసి తమ గోడు వెళ్లబుచ్చుకున్నా ఆయన మాట్లాడి పంపడం తప్ప ఆ ప్రాంతాన్ని సందర్శించలేదు.

భీమవరంలో పది రోజులు మకాం వేసినప్పుడు కూడా ఆయన వేరే దారి నుంచి మొగల్తూరు వెళ్లారు. తాజాగా కూడా ఆయన ఉద్యమకారులకు అండగా మాట్లాడలేదు. ఈ ప్రాంత సమస్యల గురించి తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా జనసేన పార్టీ ఏనాడూ ప్రయత్నాలు చేయలేదు. ఇప్పుడు భీమవరాన్ని అంతర్జాతీయ నగరంగా మారుస్తానని చెబుతున్న పవన్‌ కళ్యాణ్‌ గాజువాక, భీమవరం రెండు స్థానాల్లో గెలిస్తే పరిస్థితి ఏంటి? రెండుచోట్లా గెలిస్తే ఒక నియోజకవర్గాన్ని కచ్చితంగా వదులుకోవాల్సిందే. అలాంటప్పుడు పవన్‌ మాటలు ఎంతవరకూ నమ్మాలని ప్రజలు నిలదీస్తున్నారు. నిజంగా రెండుచోట్లా గెలిస్తే సిద్ధాంతాల గురించి ప్రజల సంక్షేమం గురించి మాట్లాడే పవన్‌ కళ్యాణ్‌ ఉప ఎన్నిక భారం ప్రజలపై ఎలా మోపుతారని ప్రశ్నిస్తున్నారు. అయితే ఆ సమస్య ఉత్పన్నం కాదని నర్సాపురం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్ధి కనుమూరి రఘురామకృష్ణంరాజు బల్లగుద్ది చెబుతున్నారు. పవన్‌ కళ్యాణ్‌తో ప్రజలు ఒక్క పని కూడా చేయించుకోలేరు. కనీసం ఒక్క ఫొటో కూడా తీయించుకోలేరు. ఎమ్మెల్యేతో పనిచేయించుకోవాలి అనుకునేవారు ఎవ్వరూ కూడా పవన్‌కు ఓటేయరు. భీమవరంలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి శ్రీనివాస్‌ మంచి మెజార్టీతో గెలుస్తారు అని స్పష్టంగా చెబుతున్నారు. 


 

మరిన్ని వార్తలు