పవన్‌ బేరం పెట్టాడంటూ బాబు లీకులిచ్చారు

6 Jul, 2018 02:47 IST|Sakshi

నన్ను కొనగలరేమోగానీ జన సైనికుల్ని మాత్రం దక్కించుకోలేరు: పవన్‌ కల్యాణ్‌  

టీడీపీ ఎమ్మెల్యేలు దిగొచ్చారా?.. చొక్కాలు పట్టుకుని రోడ్డుపైకి లాగుదాం

సాక్షి, విశాఖపట్నం, గాజువాక: తనను కొనగలరేమోగానీ జన సైనికుల్ని మాత్రం దక్కించుకోలేరని సీఎం చంద్రబాబునుద్దేశించి జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ వ్యాఖ్యలు చేశారు. గురువారం విశాఖ పోర్టు స్టేడియంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.  2014 ఎన్నికల సమయంలో తాను కూడా కొందర్ని పోటీలో పెట్టాలనుకుంటున్నానని చెబితే.. ఎందుకు తమ్ముడూ ఓట్లు చీలిపోతాయంటూ చంద్రబాబు నచ్చజెప్పారన్నారు.

ఆ మరుసటి రోజు పేపర్లలో పవన్‌ బేరం పెట్టాడంటూ వార్తలొచ్చాయని, అవి చంద్రబాబు ఇచ్చిన లీకులు కాదా? అని ప్రశ్నించారు. మీకు విలువలు లేవా? పద్ధతి లేదా? అని అప్పట్లోనే చంద్రబాబును నిలదీయాలనుకున్నానని, అయితే పెద్దమనిషి అన్న మర్యాదతో వదిలేశానని చెప్పారు. ఆ తర్వాత చంద్రబాబే వెతుక్కుంటూ తన ఇంటికొచ్చి మద్దతు కోరారని గుర్తు చేశారు. అప్పుడు టీడీపీ ఓడిపోయి ఉంటే తన పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవడానికే భయమేస్తోందన్నారు.

మాపై కులముద్ర వేశారు..
జనసేనకు ఎమ్మెల్యేలు, ఎంపీలు లేకపోయినా ప్రతి సమస్యపైనా ముందుకొచ్చి పోరాటం చేస్తున్నానని పవన్‌ చెప్పారు. దురదృష్టవశాత్తూ ప్రజారాజ్యం పార్టీకి కులం అంటగట్టారన్నారు. నాకు కులపిచ్చి ఉంటే మీకెందుకు మద్దతు ఇస్తా? అని టీడీపీనుద్దేశించి పవన్‌ ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యేలంటే ఏమైనా దిగి వచ్చారా? చొక్కాలు పట్టుకుని రోడ్లపైకి లాగుదామన్నారు.

బాబు హయాంలో భారీ భూ కుంభకోణాలు
చంద్రబాబు హయాంలో భారీ భూ కుంభకోణాలు జరిగాయని పవన్‌ ఆరోపించారు. ఈ కుంభకోణాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ల బంధువులు ఉన్నారని గాజువాకలో గురువారం రాత్రి నిర్వహించిన బహిరంగ సభలో పేర్కొన్నారు. మధురవాడ ఐటీ సెజ్‌ ప్రాంతంలో ఎకరం భూమి మూడు కోట్ల రూపాయలుంటే టెంపుల్‌టెన్, ఇన్నోవా సొల్యూషన్స్‌ వంటి సంస్థలకు ఎకరం పాతిక లక్షలకే ఇచ్చారన్నారు.

టెంపుల్‌టెన్‌కు న్యూయార్క్‌లోనే పదెకరాల భూమి లేనప్పుడు ఇక్కడ పాతిక ఎకరాల స్థలం దేనికని ప్రశ్నించారు. వారు స్థానికులకు ఉద్యోగాలివ్వరని, అది కూడా 100, 500కు మించి ఉండవన్నారు. ఆమాత్రం దానికి రూ.50 కోట్ల నజరానాలు ఎందుకన్నారు. అనుకూలమైన పారిశ్రామిక వేత్తలకు కోట్ల విలువైన భూములను కారు చౌకగా ఇవ్వడాన్ని భూ దోపిడీ కాక ఏమనాలని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు