నాలుగేళ్ల నయవంచనపై జనం దండోరా

5 Jul, 2018 02:11 IST|Sakshi
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామంలో వైఎస్‌ జగన్‌ వెంట అడుగులో అడుగువేస్తున్న అశేష జనవాహినిలో ఒక భాగం

చంద్రబాబు మోసాలపై వెల్లువెత్తిన ఆగ్రహం 

అవసరానికి మించి భూములు తీసుకున్నారని రాజధాని రైతన్నల ఆక్రోశం 

యుద్ధానికి సిద్ధమంటూ సంకేతం 

బాబు దగా చేశారని మండిపడ్డ మాదిగలు 

ఊరూరా వెతలే.. అందరికీ కష్టాలేనని వాపోయిన జనం 

అందరి కష్టాలు ఓపికగా విన్న జననేత

మన ప్రభుత్వం రాగానే అందరినీ ఆదుకుంటామని హామీ

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: చంద్రబాబు నయవంచనపై, నాలుగేళ్ల మోసపూరిత పాలనపై దండోరా వేసి మరీ దండెత్తుతామని ప్రజలు ముక్త కంఠంతో నినదించారు. మండే గుండె చప్పుడు చంద్రబాబు గుండెల్లో ప్రతిధ్వనించాలన్నదే లక్ష్యమన్నారు. మాయ మాటలతో మోసం చేయడానికి మళ్లీ వస్తే కన్నెర్రజేసి ప్రశ్నిస్తామన్నారు. తమ వెనుక జగన్‌ అన్న ఉంటారని ధైర్యంగా చెబుతామని జనం జననేత చేతిలో చెయ్యేసి మరీ చెప్పారు. బుధవారం 205వ రోజు ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రజా వెల్లువ మధ్య కొనసాగింది. అల్లూరి సీతారామరాజు, వంగవీటి మోహన్‌ రంగా జయంతిని పురస్కరించుకుని జగన్‌ వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుయ్యేరు, బాలాంత్రం, ఎర్రపోతవరం, వేగాయమ్మపేట మీదుగా ద్రాక్షారామం వరకు అశేష జనసందోహం నడుమ జగన్‌ అడుగులేశారు. ఊరూరా కిలోమీటర్ల కొద్దీ జనం బారులు తీరారు. ఆయన కోసం గంటల కొద్దీ పడిగాపులుగాశారు. అనేక మంది తమ కష్టాలు చెప్పుకున్నారు. ఎంతో మంది తోడుగా ఉంటామన్నారు. చంద్రబాబు దగా పాలనలో నష్టపోయిన అనుభవాలను ఏకరవు పెట్టారు. అధికారంలోకి వస్తే మీరు న్యాయం చేస్తారన్నా.. అంటూ విశ్వాసం వ్యక్తం చేశారు.   
 
గుండె మండిపోతోందన్నా.. 
కుయ్యేరు దగ్గర రాష్ట్ర రాజధాని ప్రాంతానికి చెందిన పెనుమాక, ఉండవల్లి గ్రామ రైతులు జగన్‌ను కలిశారు. చంద్రబాబు ప్రభుత్వం తమను నిలువెల్లా దగా చేసిందని ఆగ్రహావేశాలతో జననేతకు తెలిపారు. ‘మా భూములపై వాళ్ల పెత్తనమేంటన్నా? ఇప్పటికే 54 వేల ఎకరాలు లాక్కున్నారు. ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో బెదిరిస్తున్నారు. భూములివ్వం అంటే.. లాండ్‌ అక్విజేషన్‌ కిందకు తీసుకొస్తామని వేధిస్తున్నారన్నా.. వాళ్లకు అనుకూలంగా చట్టాలు తెచ్చారన్నా.. మేం కోర్టుకు కూడా వెళ్లే హక్కు లేకుండా చేస్తున్నారన్నా.. అంటూ వాపోయారు. ప్రాణాలైనా ఇస్తాం.. భూములివ్వం అని తెగేసి చెబితే రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. సబ్సిడీలు రానివ్వడం లేదు. నీళ్లకు అడ్డుపడ్డారు. రాజధానికి 900 ఎకరాలు సరిపోతుందని నిపుణులు చెబుతుంటే.. మా నోట్లో మట్టి గొట్టడమేంటన్నా.. అని కన్నీరు పెట్టారు. ఇక మేం ఊరుకోం. చంద్రబాబు మోసాన్ని ఊరూరా డప్పేసి చెబుతాం. మోసగాడు అధికారంలోకొస్తే ప్రమాదమని వివరిస్తాం. జగన్‌ నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం వచ్చేదాకా నిద్రపోము’ అని రైతులు ఎన్‌.నరేష్‌ రెడ్డి, ఎం.సుబ్బారావు, గాదె లక్ష్మణ రెడ్డి,  శ్రీను, లక్ష్మారెడ్డి తదితరులు అన్నారు. జగన్‌కు తమ గోడు చెప్పుకున్నాక మనసు తేలిక పడిందని, తమ పోరాటానికి అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారని తెలిపారు.  
  
మోసాల బాబూ.. ఇక వేషాలు చాలు.. 
కులానికో పేజీ పెట్టి, దగా చేయడంలో పీహెచ్‌డీ పట్టా తీసుకున్న చంద్రబాబు ఆటలు ఇక సాగవని మాదిక ఐక్య వేదిక తేల్చి చెప్పింది. వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సాడే రాజేష్‌ కుమార్‌ పాదయాత్రలో వైఎస్‌ జగన్‌ను కలిశారు. నాలుగేళ్ల క్రితం హామీలిచ్చి మోసం చేసిన చంద్రబాబు నైజాన్ని మాదిగలంతా అర్థం చేసుకున్నారని చెప్పారు. రాష్ట్ర మాదిగలందరూ జగన్‌ వెంటే నడుస్తామని భరోసా ఇచ్చినట్టు తెలిపారు. న్యాయం చేస్తారనే నమ్మకం ఉందని పేర్కొన్నారు. అదే విధంగా కల్లుగీత కార్మికులూ తమ నేత ఎదుట బాధలు చెప్పుకున్నారు. ఎన్నికలప్పుడు చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదని, గీతన్న బతుకు కష్టాల్లో పడిందంటూ బావురు మన్నారు. బీసీ సంక్షేమ నిధి నుంచి ఏ సాయం అందడం లేదన్నారు. ఈ ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా ఆలకించలేదని, మీ వెంటే ఉంటామని.. అధికారంలోకొచ్చాక న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ముస్లిం మైనార్టీలదీ ఇదే ఆవేదన. వాడుకుని వదిలేసిన చంద్రబాబును ఏ ముస్లింలూ నమ్మే పరిస్థితి లేదన్నారు. నాలుగు శాతం రిజర్వేషన్‌ ఇచ్చి అండగా నిలబడ్డ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి వారసత్వాన్ని జగన్‌లో చూస్తున్నామని, ఆయనకు అండగా ఉంటామని చెప్పారు. చంద్రబాబు తమను నడిసంద్రంలో ముంచేశారని మత్స్యకార కుటుంబాలు జననేత ఎదుట కంటతడిపెట్టాయి. 
 
ఉద్యోగుల్లో కట్టలు తెగిన ఆగ్రహం.. 
జీవితకాలం సేవ చేసిన ప్రభుత్వోద్యోగులను వేధించే ప్రభుత్వాన్ని చూస్తున్నామంటూ వైద్య ఆరోగ్య సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. ఎర్రపోతవరం దగ్గర ఏఎన్‌ఎంలు మంగాయమ్మ, అరుణతో కలిసి వచ్చిన సిబ్బంది జగన్‌ ముందు తమ కష్టాలు ఏకరువుపెట్టారు. సీపీఎస్‌ విధానం వల్ల తమకు జరిగే అన్యాయాన్ని చెప్పుకున్నారు. అధికారంలోకొస్తూనే దీన్ని రద్దు చేస్తామంటూ ఇప్పటికే మీరిచ్చిన భరోసాతో ఊరట కలిగిందని చెప్పారు. ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులూ జగన్‌కు తమ గోడు వివరించారు. పదోన్నతుల్లో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఎత్తిచూపారు. ఏళ్లు గడుస్తున్నా పర్మినెంట్‌ అవుతుందన్న ఆశలు లేవని కాంట్రాక్టు ఉద్యోగులు, అధికార పార్టీ నేతల ఆగడాలతో నలిగి పోతున్నామని అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు జగన్‌ ఎదుట కష్టాలు చెప్పుకున్నారు. 
 
ఊరూరా సమస్యలు.. బాబు పాలనపై విసుర్లు 
వెతలు లేని ఊరు లేదు. కన్నీటి కథలు లేని పల్లె లేదు. ఆ దుస్థితిని జగన్‌కు చూపించాలని జనం ఆరాటపడ్డారు. గంగవరం మండలం గోపాలపేట గ్రామస్తులు వాళ్ల ఊళ్లో రోడ్ల దుస్థితిని చెప్పారు. స్కూలుకెళ్లేందుకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని చిన్నారులు తెలిపారు. వైఎస్‌ హయాంలో వేసిన తారు రోడ్డు కొట్టుకుపోతే ఈ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాశ్వత ప్రాతిపదికన కాల్వ పనులను చేపట్టాలని పాలకులకు చెప్పినా వినే నాథుడే లేడని కాజులూరు, కె.గంగవరం మండలాలకు చెందిన రైతులు వాపోయారు. ప్యాకేజీ పనుల పేరుతో సాగు నీరందించే కాల్వల్లో తాత్కాలికంగా పూడిక తీస్తున్నారని, కాల్వలోని మట్టిని యంత్రాలతో తీసి గట్టుమీద వేస్తున్నారని, తర్వాత వర్షాలకు ఆ మట్టి మళ్లీ కాల్వలోకే చేరుతోందన్నారు. ఇచ్చే పింఛను తీసేశారని, ఎలా బతకాలంటూ వృద్ధులు, వికలాంగులు ప్రతి గ్రామంలోనూ జగన్‌ ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నారు. 
 
జననేత పలకరింపు.. జనం పులకరింపు 
జగన్‌ పలకరించారంటూ జనం పులకరించిపోయారు. తమతో సెల్ఫీ దిగారంటూ ఆనందంతో ఉప్పొంగిపోయారు. పాదయాత్రలో అడుగడుగునా ఇలాంటి దృశ్యాలు కనిపించాయి. ‘అన్న నాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు’ అంటూ కుయ్యేరు గ్రామంలో పిల్లి దేవిశ్రీ ఎంతో మందికి గొప్పగా చెప్పుకుంది. ‘దారి పక్కన ఉంటే ఆగి మరీ పలకరించారు’ అని పంక్చర్లు వేసుకునే దివ్యాంగుడు ఏడుకొండలు సంతోషంతో ఉప్పొంగిపోయాడు. ‘జగన్‌ అన్నకు గులాబీ ఇచ్చాము. మమ్మల్ని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకున్నారు’ అని గుడిమళ్ల వద్ద రుచిత, దీక్షిత అనే చిన్నారులు సంతోషంగా చెప్పారు. ‘మా పిల్లలను ఆయన దగ్గరకు తీసుకున్నారు.. ఎంత సంతోషంగా ఉందో’ అని అదే ఊళ్లోని రిచర్డ్‌ శ్యాముల్, మేరీ గ్రేస్‌లు ఆనందంతో అన్నారు. ‘అమ్మమ్మ ఇంటికి రావడం ఎంత మంచిదైంది? నేను ఈ రోజు జగనన్నను కలిశాను. సెల్ఫీ దిగాను. నేనిచ్చిన బొకే తీసుకున్నారు’ అని వేగాయమ్మపేటలో సిందూష ఉబ్బితబ్బిబ్బవుతూ చెప్పింది. అందరితో మాట్లాడుతూ, అందరి సమస్యలు విని జననేత ధైర్యం చెప్పారు. మన ప్రభుత్వం రాగానే ఆదుకుంటామని భరోసా ఇస్తూ ముందుకు సాగారు.  

మరిన్ని వార్తలు