నేతన్నలకు జననేత భరోసా

31 Jan, 2018 06:31 IST|Sakshi
జననేతకు గోడు వెళ్లబోసుకుంటున్న మహిళ

 సైదాపురంలో చేనేతలతో ఆత్మీయ సదస్సు n దారిపొడవున వినతుల వెల్లువ

పొదుపు సంఘాలను చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నాడని మహిళల ఆవేదన

75వ రోజు 14.9 కిలోమీటర్లు సాగిన యాత్ర

నేడు సర్వేపల్లి నియోజకవర్గంలోకి ప్రవేశం

ప్రధాన ప్రతిపక్ష నేత.. వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 75వ రోజైన మంగళవారం సైదాపురం మండలంలో ఉత్సాహంగా సాగింది. జన హృదయాలను తాకుతూ.. సమస్యలతో సతమతమవుతున్న వారికి ధైర్యం చెబుతూ.. భవిష్యత్‌పై అందరికీ భరోసానిస్తూ..వైఎస్‌ జగన్‌ ముందుకు కదిలారు.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నేతన్నలకు భరోసా లభించింది. వారి కష్టాలను కడతేర్చేందుకు, చేనేత కార్పొరేషన్‌ సహా ఇతర డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పూర్తి భరోసా ఇచ్చారు. సైదాపురం మండలం కలిచేడులో మంగళవారం నిర్వహించిన చేనేత ఆత్మీయ సదస్సులో జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించారు. అనంతరం ముఖాముఖిలో వారి సమస్యలను తెలుసుకున్నారు. అధైర్యపడవద్దని, చేనేత కార్మికులందరికీ అండగా ఉంటా నని భరోసా ఇచ్చారు. 75వ రోజున మంగళవారం పోటెత్తిన అశేష జనవాహిని నడుమ ప్రజాసంకల్ప యాత్ర కొనసాగింది. ఉదయం 8గంటలకు సైదాపురంలో ప్రారంభమైన యాత్ర అదే మండలంలోని తలుపూరు క్రాస్‌ రోడ్డు వద్ద ముగిసింది. మొత్తం 14.9 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. బుధవారం వెంకటగిరి నియోజకవర్గంలో యాత్ర ముగిసి సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రారంభం కానుంది. పొదలకూరులో మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగిస్తారు.

ఎన్నాళ్లీ వివక్ష
ప్రజాసంకల్ప యాత్రలో మహిళలు, వృద్ధులు దారి పొడవునా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి సమస్యలను విన్నవించారు. ఎన్టీఆర్‌ వైద్యసేవలు మొదలుకుని డ్వాక్రా రుణాల వరకు అన్ని పథకాల్లోను అడుగడుగునా వివక్ష చూపుతున్నారని వాపోయారు. ప్రతి ఒక్కరి సమస్యను ఆసాంతం విన్న వైఎస్‌ జగన్‌ అధైర్యపడొద్దని భరోసా కల్పించారు. తొలుత ఆళ్ల శాంతమ్మ జననేతతో మాట్లాడుతూ తనకు తెల్ల రేషన్‌కార్డు ఉన్నా ఆరోగ్యశ్రీ కార్డు లేకపోవడంతో వైద్యం అందటం లేదని వాపోయింది. వీరమాసి జ్యోతి అనే మహిళ మాట్లాడుతూ తన తండ్రి ఉపాధి కోసం సౌదీ వెళ్లారని, ఈనెల 11న అక్కడ మరణించాడని తెలిపింది. 20 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకూ మృతదేహం రాలేదన్నా అంటూ విలపించింది. మృతదేహాన్ని రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించిన వైఎస్‌ జగన్‌ అనంతరం దాడిశెట్టిపల్లి క్రాస్‌ రోడ్డుకు చేరుకున్నారు. ప్రజలు ఆయనకు ఎదురేగి స్వాగతం పలికారు.

జగన్‌ సీఎం కావాలంటూ యువత ప్లకార్డులను చేతబూని ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి సిద్ధలయ్యకోనకు చేరుకున్న ఆయనకు ప్రజలు ఆత్మీయ ఆహ్వానం పలికారు. శిరసనంబేడి పోలమ్మ అనే వృద్ధురాలు తన కష్టాలను చెప్పుకుంది. భర్త మరణించి పదేళ్లయ్యిందని, రేషన్, ఆధార్‌ కార్డులు ఏమీ లేకపోవడంతో పింఛను అందలేదని, పూట గడవటం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేసింది. అక్కడ నుంచి పోకందుల గ్రామానికి చేరుకున్న జగన్‌కు అపూర్వ స్వాగతం లభించింది. తమకు అన్ని అర్హతలు ఉన్నా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభిమానులమన్న కారణంతో ఇళ్లు మంజూరు చేయలేదని, పొదుపు సంఘాలను చంద్రబాబు నాయుడు నిర్వీర్యం చేస్తున్నాడని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ నుంచి ఊటుకూరు చేరుకుని పార్టీ జెండాను వైఎస్‌ జగన్‌ ఆవిష్కరించి అక్కడి మహిళల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గిద్దలూరు చేరుకోగా.. మహిళలు, యువత  సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. అక్కడి నుంచి తురిమెర్ల చేరుకున్న జగన్‌కు ఘన స్వాగతం లభించింది. పరసారెడ్డిపల్లి, గోవిందపల్లి, ఇస్కపల్లి నుంచి పెద్దఎత్తున ప్రజలు జననేతను కలిసేందుకు తరలివచ్చారు. జననేత కలిచేడుకు చేరుకోగా మైనింగ్‌ స్కూల్‌ విద్యార్థులు కలిసి వినతిపత్రం అందజేశారు.

అనంతరం తలుపూరు క్రాస్‌ రోడ్డుకు చేరుకుని యాత్ర ముగించారు. నెల్లూరు, తిరుపతి ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, డాక్టర్‌ వెలగపల్లి వరప్రసాద్, ఎమ్మెల్యేలు కిలివేటి సంజీవయ్య, మేకపాటి గౌతమ్‌రెడ్డి, డాక్టర్‌ పోలుబోయిన అనిల్‌కుమార్‌ యాదవ్,జెడ్పీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, వైఎస్‌ జగన్‌ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రజాసంకల్ప యాత్ర కో–ఆర్డినేటర్‌ తలశిల రఘురాం, గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళి, పార్టీ నేతలు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి, జెడ్పీ వైస్‌ ఛైర్మన్‌ పొట్టేళ్ల శిరీష పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు