ప్రభంజనం

20 Mar, 2018 07:25 IST|Sakshi
సభలో ప్రసంగిస్తున్న జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. చిత్రంలో ఎమ్మెల్యేలు ఆర్‌కే, ముస్తఫా, పీఆర్‌కే, నేతలు శ్రీకృష్ణదేవరాయలు, రావి వెంకటరమణ, సుచరిత

జనం.. జనం.. ఎటు చూసినా ప్రభంజనం. మేడా మిద్దె, చెట్టూ పుట్ట అన్నీ కిక్కిరిశాయి. తమ కష్టాలు వినేందుకు.. కన్నీరు తుడిచేందుకు ప్రజా సంకల్ప దీక్షబూనిన పాదయాత్రికుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాక కోసం తొలిపొద్దు పొడవకముందే పల్లెలన్నీ జనంతో పోటెత్తాయి. అడుగడుగునా పూలబాటలతో స్వాగతం పలికాయి. తమ బాధలను నిండు మనసుతో వింటూ, పరిష్కరిస్తానని భరోసా ఇస్తూ ముందుకు సాగిన జననేతను చూసి మురిసిపోయాయి.

సాక్షి, అమరావతి బ్యూరో: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర 115వ రోజు ప్రత్తిపాడు నియోజకవర్గంలో కొనసాగింది. దారి పొడవునా ప్రజలు పోటెత్తారు. రోడ్లన్నీ పల్లె ప్రజలతో కిటకిటలాడాయి. తనను చూసేందుకు చిన్నపిల్లలతో వచ్చిన మహిళలను జననేత ఆప్యాయంగా పలుకరించి, చిన్నారులను ఎత్తుకుని వారితో సెల్ఫీలు దిగారు. కొమ్మూరులో చిన్న పిల్లలు రోడ్డు వెంబడి నిలబడి అన్నా.. జగనన్నా అంటూ నినాదాలు చేయడంతో జగన్‌ వారి వైపు తిరిగి అభివాదం చేయగానే వారు ఆనందంతో కేరింతలు కొట్టారు. పాదయాత్ర పొడవునా ఆటోగ్రాఫ్‌ కోసం ఆసక్తి చూపిన యువతీ యువకులను జగన్‌ తన వద్దకు పిలిచి మరీ సంతకం చేసి ఇవ్వడంతో వారి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి.

యాత్ర సాగిందిలా....
సోమవారం ఉదయం 7.30 గంటలకు కాకుమాను శివారులో ఏర్పాటుచేసిన రాత్రి బస ప్రాంతం నుంచి ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభమైంది. కాకుమాను, పెద్దివారిపాలెం క్రాస్, కొమ్మూరు, నాగులపాడు, పెదనందిపాడు వరకు యాత్ర సాగింది. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన ఎంపీలకు సంఘీభావంగా పార్టీ పిలుపు మేరకు కాకుమాను మండలంలోని కొమ్మూరు చర్చి సెంటరు వద్ద జరిగిన ప్రజా సంకల్ప మానవ హారంలో జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు.. ప్రత్యేక హోదా జగనన్నతో సాధ్యం అన్న నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది.

పోటెత్తిన పెదనందిపాడు
పెదనందిపాడు మండలంలో సోమవారం సాయంత్రం జరిగిన బహిరంగ సభకు జనం పోటెత్తారు. స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ జననేత జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రసంగానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. నియోజకవర్గంలో 80 శాతానికి పై గ్రామాల ప్రజలు తాగునీటి ఎద్దడితో అల్లాడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. గ్రామాల్లోని చెరువుల్లో మట్టిని అమ్ముకునేందుకు విచ్చలవిడిగా తవ్వేస్తున్నారని విమర్శించారు. కాకుమాను మండలం కొమ్మూరులో చెరువును లోతుగా తవ్వడంతో మంచినీటికి బదులు ఉప్పునీరు వస్తోందని వివరించారు. ఫలితంగా శుద్ధిచేసిన నీటిని క్యాన్‌ రూ.20 చొప్పున కొని దాహార్తి తీర్చుకోవాల్సిన దుస్థితి నెలకొందని పేర్కొన్నారు.

కరువు ఛాయలు..ముంపు భయం
ప్రత్తిపాడు నియోజకవర్గంలో కరువు ఛాయలు, ముంపు భయం కనిపిస్తోందని జగన్‌ పేర్కొన్నారు. గుంటూరు చానల్‌ను పర్చూరు వరకు పొడిగించాలని రైతులు పలుమార్లు విజ్ఞప్తి చేసినా పాలకుల్లో స్పందన లేదన్నారు. ఈ చానల్‌ను పొడిగిస్తే 35 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. అప్పాపురం చానల్‌కు చంద్రగ్రహణం పట్టిందన్నారు. దివంగత నేత వైఎస్సార్‌ హయాంలో ఈ కాలువ ఆధునికీకరణకు రూ.65 కోట్లు మంజూరుచేసి 10 శాతం పనులు చేపట్టారని గుర్తుచేశారు. ఆయన అకాల మరణం తరువాత చానల్‌ పనులను ఎవరూ పట్టించుకోలేదని విమర్శించారు. పెదనందిపాడు బ్రాంచ్‌ కెనాల్‌ను పొడిగించడానికి దివగంత సీఎం రాజశేఖరరెడ్డి హయాంలో రూ.300 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధంచేసి, సర్వే కోసం రూ.3 కోట్లు కేటాయించారని, ఆయన మరణంతో ఆ పనులూ అటకెక్కాయని పేర్కొన్నారు. నల్లమడ డ్రెయిన్‌కు సంబంధించి వైఎస్సార్‌ హయాంలో 115 కిలోమీటర్లకు 80 కిలోమీటర్ల మీటర్ల మేర పనులు జరిగినా, మిగిలిన 35 కిలోమీటర్ల పనులు ఇప్పటికీ పూర్తికాలేదని విమర్శించారు. ఫలితంగా ఈ ప్రాంతంలో పంట పొలాలు ముంపు బారిన పడుతున్నాయని పేర్కొన్నారు. ఏ పంట సాగుచేసినా రైతులకు గిట్టుబాటు ధర లభించడంలేదని, గతేడాది మిర్చి ధరలు పతనమైనప్పుడు తానే స్పందించి దీక్షా చేయాల్సి దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తంచేశారు. గుంటూరు పార్లమెంట్‌ సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి మేకతోటి సుచరిత, గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు రావి వెంకటరమణ ప్రసంగించారు.

యాత్రలో పాల్గొన్న నేతలు
ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, మొహమ్మద్‌ ముస్తఫా, రామిరెడ్డి ప్రతాపరెడ్డి, మాజీ ఎంపీ వల్లభనేని బాలశౌరి, గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి కిలారి వెంకటరోశయ్య, రాష్ట్ర కార్యదర్శులు డాక్టర్‌ ఆరిమండ వరప్రసాదరెడ్డి, మందపాటి శేషగిరిరావు, తిప్పారెడ్డి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ఎస్సీసెల్‌ విభాగం అధ్యక్షుడు మేరుగ నాగార్జున, రైతు విభాగం అధ్యక్షుడు ఎం.వి.ఎస్‌.నాగిరెడ్డి, గుంటూరు రూరల్‌ జెడ్పీటీసీ సభ్యుడు కొలకలూరి కోటేశ్వరరావు, కాకుమాను, పెదనందిపాడు, వట్టిచెరుకూరు మండల పార్టీ అధ్యక్షులు నల్లమోతు శివరామకృష్ణ, మదమంచి వాసు, మన్నవ వీరనారాయణ, నాయకులు షేక్‌ జిలానీ, ఎల్‌ వీరప్రతాప్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, ఎస్టీ విభాగం నాయకుడు కృష్ణారావు పాల్గొన్నారు.

‘అన్నొస్తాడని చెప్పు. బియ్యం కార్డు ఇస్తాడని, పిల్లలను బడికి పంపితే రూ.15 వేలు ఇస్తాడని, నవరత్నాల్లాంటి సంక్షేమ పథకాలతో అన్ని కష్టాలను తొలగిస్తాడని చెప్పు’ అంటూ జగన్‌మోహన్‌రెడ్డి కాకుమాను మండలం పెద్దివారిపాలెం గ్రామానికి చెందిన మహిళ షేక్‌ దర్భికి భరోసా ఇచ్చారు. తనకు బియ్యం కార్డు లేదని ఆమె చెప్పడంతో జననేత స్పందించి మన పాలన వచ్చాక బాధలు ఉండవు అంటూ ధైర్యం చెప్పారు.

మరిన్ని వార్తలు