కుమారస్వామికి మోదీ ఫోన్‌.. బలపరీక్ష!

23 May, 2018 20:59 IST|Sakshi
నరేంద్ర మోదీ, కుమారస్వామి (ఫైల్‌ ఫొటో)

సాక్షి, బెంగళూరు : కర్ణాటకలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ ప్రభుత్వం ఏర్పాటైంది. కర్ణాటక 24వ ముఖ్యమంత్రిగా జేడీఎస్‌ నేత కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ నేత, పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ వజుభాయ్‌ వాలా వీరిద్దరి చేత విధాన సౌదలో ప్రమాణ స్వీకారం చేయించిన విషయం తెలిసిందే. కర్ణాటక నూతన సీఎం కుమారస్వామికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోన్‌ చేసి అభినందించారు. ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న కుమారస్వామికి మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వాన్ని సజావుగా నడిపించాలని ట్విటర్‌లో ఆకాంక్షించారు. కుమారస్వామి, పరమేశ్వరలకు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్‌ చేశారు. అతిపెద్ద పార్టీగా అవతరరించిన బీజేపీ బలపరీక్షకు వెనకడుగు వేయడం, యడ్యూరప్ప రాజీనామా చేయడంతో కాంగ్రెస్‌-జేడీఎస్‌లకు మార్గం సుగమమైంది.  

సీఎం అయ్యాక తొలిసారి మీడియాతో మాట్లాడిన కుమారస్వామి.. రైతుల రుణాలను మాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి దేశం నలుదిశల నుంచి వచ్చిన నేతలు 2019 ఎన్నికల్లో మేమంతా ఒకటిగా నిలుస్తామని సంకేతాలు పంపారు. రాజకీయాల్లో ఇదో అతిపెద్ద పరిణామం. కాంగ్రెస్‌, జేడీఎస్‌ నేతలు నూతనంగా ఏర్పాటుకానున్న ప్రభుత్వాన్ని రక్షించుకుంటారు. ఏకైక పార్టీ ప్రభుత్వాలనున్న ఇతర రాష్ట్రాలతో పోల్చితే కర్ణాటకలో అత్యుత్తమ పాలన అందించడానికి సిద్దంగా ఉన్నాం. రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నామని కుమారస్వామి పేర్కొన్నారు.

బలపరీక్ష..
తొలుత అతిపెద్ద పార్టీ బీజేపీ బలపరీక్షకు ముందు చేతులెత్తేయడంతో కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి రంగంలోకి దిగింది. గవర్నర్‌ వజుభాయ్‌ వాలాను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరారు. బుధవారం సాయంత్రం దేశంలోని కొందరు కీలక నేతల సమక్షంలో జేడీఎస్‌ నేత కుమారస్వామి రెండో పర్యాయం కర్ణాటక సీఎంగా ప్రమాణం చేశారు. సీఎం అయితే 24 గంటల్లో బల పరీక్షకు వెళ్లి, అనంతరం కేబినెట్‌ గురించి ఆలోచిస్తామని కుమారస్వామి ప్రస్తావించారు. కానీ, ఇటీవల చెప్పినట్లుగా కాకుండా రెండో రోజు (ఈ నెల 25న) కుమారస్వామి సర్కార్‌ బల పరీక్షకు వెళ్లనుంది. వారం రోజుల్లో కేబినెట్‌ ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. అయితే తమ పార్టీల నేతలను బల పరీక్ష ముగిసేవరకు కాపాడుకునేందుకు హోటళ్లలోనే బస చేయిస్తూ వారిని ఇంటికి సైతం దూరం పెట్టిన విషయం విదితమే.

మరిన్ని వార్తలు