‘అది మోదీ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌’

6 May, 2018 20:20 IST|Sakshi
పాండిచ్చేరి సీఎం నారయణ స్వామి (ఫైల్‌ ఫొటో)

మోదీ ఏపీని మోసం చేశారు

పాండిచ్చేరి సీఎం నారయణ స్వామి

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను ప్రధాని నరేంద్ర మోదీ మోసం చేశారని పాండిచ్చేరి సీఎం నారయణ స్వామి అన్నారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. విభజన హామీలను పూర్తి చేసే విషయంలో కాంగ్రెస్‌ పార్టీ స్పష్టమైన వైఖరితో ఉందని తెలిపారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశాన్ని కాంగ్రెసే చేర్చిందని, ఈశాన్య రాష్ట్రాలతో సమానంగా హోదా ఇవ్వాలని పార్లమెంట్‌లో అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ చెప్పారని గుర్తు చేశారు. దీనికోసం రూ. 40 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసారని, రాజధాని నిర్మాణం కోసం రూ. 50 వేల కోట్లు ఇవ్వాలని చెప్పామన్నారు.

పోలవరానికి రూ. 2500 కోట్లు, అమరావతికి రూ.1500 కోట్లు ఇచ్చి చేతులు దులిపేసుకుంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రధానమంత్రి విదేశి మంత్రిగా మారి విదేశాలకు తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఏపీని మోసం చేసిన బీజేపీకి కర్ణాటకలోని తెలుగు ప్రజలు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. సీబీఐ దర్యాప్తు వ్యవహారాల్లో కాంగ్రెస్‌ ఎప్పుడూ తలదూర్చలేదని, మోదీ మాత్రం జాతీయ దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్నుశాఖలను తన జేబులో పెట్టుకున్నారని ఆరోపించారు. ఇప్పుడది మోదీ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషనగా మారిందని ఎద్దేవా చేశారు. విదేశాల్లో నల్లధనం తెస్తానని, ప్రజల చేతులోని డబ్బులు లాగేసుకున్నారని మండిపడ్డారు. నోట్ల రద్దు, జీఎస్టీతో దేశ ప్రగతి కుంటుపడిందని, వృద్ధి రేటు 6 కే పరిమితం అయ్యిందని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ కర్ణాటక ఎన్నికల్లో గెలువదని జోస్యం చెప్పారు.

మరిన్ని వార్తలు