చంద్రబాబు.. ఏది జాబు? | Sakshi
Sakshi News home page

చంద్రబాబు.. ఏది జాబు?

Published Sun, May 6 2018 8:12 PM

Chandrababu Naidu Neglecting Unemployees And Benefits : Vijaya Sai reddy - Sakshi

సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేపట్టిన సంఘీభావ యాత్ర ఐదవరోజు సింహాచలం సమీపంలోని ప్రహ్లాద పురం నుంచి మర్రిపాలెం వరకూ సాగింది. అనంతరం ఊర్వశి జంక్షన్‌లో ప్రజలను ఉద్ధేశించి మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లు గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని, ఇదే విషయాన్ని పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సైతం స్పష్టం చేశారని గుర్తు చేశారు.

విభజన చట్టంలో విశాఖపట్నంకు ఇచ్చిన రైల్వే జోన్‌ను సైతం కేంద్రం విస్మరించిందని విజయ సాయి రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ తరపున 25 మంది ఎంపీలను గెలిపిస్తే.. రైల్వేజోన్‌ సాధించి తీసుకు వస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయం నుంచి కోలుకోవాలంటే వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రావాలన్నారు. ప్రత్యేక హోదాతో పాటు, రైల్వే జోన్‌, ఇతర విభజన హామీలను సాధించుకోవాలంటే వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని అన్నారు

ఎన్నికల సమయంలో చంద్రబాబు 600 హామీలు ఇచ్చారని, వాటిలో ప్రతి ఒక్క ఇంటికి ఉద్యోగం కల్పిస్తామని చెప్పిన విషయాన్ని విజయసాయి రెడ్డి గుర్తు చేశారు. ఉద్యోగం ఇవ్వలేని పక్షంలో నిరుద్యోగ భృతి ఇస్తామన్నారని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించారని, పైగా ప్రభుత్వ ఉద్యోగాలను సైతం ఊడపీకుతున్నారని నిప్పులు చెరిగారు. కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ద్వారా ఉద్యోగాల భర్తీ చేస్తున్నారని, వాటి కారణంగా ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement