కాలగర్భంలో కలుస్తావు.. ఖబర్దార్‌: పొన్నం

21 Oct, 2019 14:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆర్టీసీ సమ్మె గురించి గవర్నర్‌తో నివేదిక తెప్పించుకున్న కేంద్రం ఎందుకు మౌనంగా ఉంటోందని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ ప్రశ్నించారు. గల్లీలో కొట్లాట, ఢిల్లీలో దోస్తానా అన్న చందంగా బీజేపీతో టీఆర్ఎస్ స్నేహం చేస్తోందని ఆరోపించారు. సెలవులు ఇచ్చి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుకుంటున్న సీఎం కేసీఆర్‌ గురించి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌తో మ్యాచ్ ఫిక్సింగ్ లేకపోతే వెంటనే కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి ఆర్టీసీ సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఉద్యమ స్ఫూర్తిని అభినందిస్తున్నానన్నారు. సమస్య పరిష్కారం అయ్యేవరకు విభజించి.. పాలించే టీఆర్‌ఎస్ కుట్రలో చిక్కుకోకుండా ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని.. ఆర్టీసీ కార్మికులు ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దని విఙ్ఞప్తి చేశారు. 

కాలగర్భంలో కలుస్తావు.. ఖబర్దార్‌
ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తున్న ఎంఐఎం పార్టీకి ఆర్టీసీ సమస్యలు కనబడటం లేదా అని పొన్నం ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎం మూడు పార్టీలు ఒక్కటేనని అందుకే.. సమ్మె గురించి మాట్లాడటం లేదని పేర్కొన్నారు. ‘ రాష్ట్రవ్యాప్తంగా పోలీసులను పెట్టి అక్రమ అరెస్టులు చేయించి కార్యకర్తలను, ప్రజలను కేసీఆర్ భయభ్రాంతులకు గురిచేశారు. కోర్టు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, తెలంగాణ సమాజం ఆర్టీసీ సమస్యను పరిష్కరించాలని కోరినా అహంకారంతో ప్రవర్తిస్తున్నారు. అధికారం శాశ్వతం కాదు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతే కాలగర్భంలో కలుస్తావు. ఖబర్దార్‌ కేసీఆర్‌’అని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు