16వ లోక్‌సభ రద్దు

25 May, 2019 14:25 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: 16వ లోక్‌సభను రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ శనివారం రద్దు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో 303 స్థానాలు సొంతంగా గెలుచుకొన్న భారతీయ జనతా పార్టీ మరోసారి అధికారపీఠం ఎక్కనుంది. కేంద్ర కేబినెట్‌ నిన్న సమావేశమై 16వ లోక్ సభను రద్దు చేసేలా సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. 17వ లోక్‌సభకు ఎన్నికలు పూర్తి కావడంతో కేబినెట్ తీర్మానంతో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రస్తుత లోక్‌సభను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

అధికారికంగా లోక్‌సభ రద్దు తరవాత కొత్త లోక్‌సభ ఏర్పాటు ప్రక్రియను రాష్ట్రపతి ప్రారంభిస్తారు. ఇందులో భాగంగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా బీజేపీ పక్ష నేత నరేంద్ర మోదీని రాష్ట్రపతి ఆహ్వానిస్తారు. ప్రస్తుత లోక్‌సభ గడువు జూన్ 3 వరకు ఉండగా.. లోక్‌సభను రద్దు చేసిన తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ మొదలవుతుంది. రెండు రోజుల్లో ఎన్నికల కమిషనర్లు రాష్ట్రపతితో సమావేశమై కొత్తగా ఎన్నికైన లోక్ సభ అభ్యర్థుల జాబితాను అందజేస్తారు. జూన్ 3 లోపే కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటారు.  

మరిన్ని వార్తలు