‘అందుకే ఇలాంటి సినిమాలు తీస్తున్నారు’

29 Dec, 2018 19:57 IST|Sakshi

‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌మినిస్టర్‌’  సినిమాపై ఏపీసీసీ రఘువీరా విమర్శలు

సాక్షి, విజయవాడ : మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ యాక్సిడెంటల్‌ ప్రధాని కాదని, అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్‌ను నిలిపిన స్పృహ కలిగిన గొప్ప ప్రధాని అని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ... ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌మినిస్టర్‌’  సినిమా ట్రైలర్‌ మన్మోహన్‌ సింగ్‌ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఉన్న ఆర్థిక నిపుణుల్లో మన్మోహన్ సింగ్ ఒకరు.. 4 శాతం పడిపోయిన దేశ జీడీపీనీ 7 శాతానికి తెచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందని పేర్కొన్నారు. రుణమాఫీతో పాటు అనేక కీలక చట్టాలు మన్మోహన్ సింగ్ పాలనా సమయంలోనే వచ్చాయని గుర్తుచేశారు. తమ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ గురించి మాట్లాడుతూ... ‘ ప్రధాన మంత్రి పదవి కాదు కదా కనీసం కేంద్ర మంత్రి పదవి కూడా వద్దని, తాను ఇంకా నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయని చెప్పిన వ్యక్తి రాహుల్‌’ అని వ్యాఖ్యానించారు.

ఆయన భార్య బీజేపీ ఎంపీ
ఈ సినిమాలో మన్మోహన్‌ సింగ్‌ పాత్రధారి అనుపమ్‌ ఖేర్‌ గురించి ప్రస్తావిస్తూ.... అనుపమ్‌, నరేంద్ర మోదీ ప్రభుత్వంలో  ఫిల్మ్ అండ్ టెలివిజన్ సంస్థ చైర్మన్ గా పని చేశారని రఘువీరా గుర్తుచేశారు. అనుపమ్‌ ఖేర్‌ భార్య కిరణ్ ఖేర్ ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్నారని..  ఓటమి భయంతోనే బీజేపీ ఇలాంటి సినిమాలు తీసుకువస్తోందని విమర్శించారు. సెన్సార్ బోర్డ్ ఈ సినిమా విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. అయినా 2019 ఎన్నికల్లో ఈ సినిమా ప్రభావం ఎంతమాత్రం ఉండబోదని జోస్యం చెప్పారు.

ఏపీ ప్రభుత్వం వెంటనే స్పందించాలి
అగ్రిగోల్డ్ వ్యవహారంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలని రఘువీరారెడ్డి డిమాండ్‌ చేశారు. విభజన హామీల అమలు ఇప్పటికే ఆలస్యమైందని.. హైకోర్టు విభజన అనేది వ్యక్తుల కోసం జరగదని పేర్కొన్నారు. ఈ విషయంలో తమ పార్టీకి స్పష్టమైన విధానం ఉందని తెలిపారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని కాంగ్రెస్ పార్టీ  మొదటి నుంచి చెప్తోందని గుర్తు చేశారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు