Sakshi News home page

తెలంగాణ: సొంత జాగా ఉన్నవారికే ఇందిరమ్మ ఇళ్లు!

Published Tue, Dec 26 2023 4:07 AM

Congress government working on granting Indiramma houses - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పేదలకు ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. తొలుత సొంత జాగా ఉన్న వారికి ఇళ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. సొంత స్థలం లేనివారికి పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు వంటివి ఆ తర్వాత చేపట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇంటి స్థలాల పంపిణీ కోసం భూమిని సేకరించేందుకు కాస్త సమయం పట్టే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. 

ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు 
ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు పేదల కోసం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేశాయి. ఇప్పు డు తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావటంతో.. మళ్లీ ఇందిరమ్మ పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. సొంత జాగా ఉన్న అర్హులైన పేదలకు ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చింది. జాగా లేని పేదలకు స్థలం పట్టాలు ఇచ్చి, ఇంటి నిర్మాణానికి నిధులు ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఈనెల 28వ తేదీ నుంచి ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో తొలుత సొంత జాగా ఉన్న పేదలకు ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు చొప్పున నిధులు విడుదల చేసి, వారు వెంటనే ఇళ్ల నిర్మాణం చేపట్టేలా చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. 

తర్వాతే ఇంటి స్థలాల పంపిణీ.. 
రాష్ట్రంలో సొంత జాగా లేని నిరుపేదలు లక్షల్లో ఉన్నారు. అలాంటి వారికి తొలుత ఇంటి స్థలం ఇచ్చి, అందులో వారు ఇల్లు నిర్మించుకునేందుకు నిధులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పేదలకు పంపిణీ కోసం భారీగా భూమిని సేకరించాల్సి ఉంది. ఈ ప్రక్రియ కోసం సమయం పట్టే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. 

ఇళ్ల డిజైన్లపై కసరత్తు 
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మూడు నమూనాలను సిద్ధం చేస్తున్నట్టు ఇటీవల గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. అయితే నిర్ధారిత డిజైన్‌లో ఇళ్లను నిర్మించాలంటే.. కాలనీల తరహాలో ఒకే చోట భూమిని సేకరించాల్సి ఉంటుంది. సొంత జాగా ఉన్నవారు నిర్మించుకునే ఇళ్లు నిర్ధారిత డిజైన్‌లో ఉండాలంటే ఇబ్బంది ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది.

కొందరు ఉమ్మడి కుటుంబంగా ఒకే ఇంట్లో ఉంటున్నారు. అందులో పెళ్లిళ్లు అయినవారు కొత్తగా ఇళ్లకు దరఖాస్తు చేసుకునే వీలుంది. వారు ఉంటున్న ఇంటికి ఆనుకుని ఉండే ఖాళీస్థలాల్లో ఇళ్లను నిర్మించుకుంటారు. అలాంటి ఖాళీ స్థలం ఆకృతి, అధికారులు సిద్ధం చేసే డిజైన్‌ ప్రకారం ఇల్లు నిర్మించేందుకు అనుకూలంగా ఉండకపోవచ్చనే సందేహాలు ఉన్నాయి. ఈ అంశంలో త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. 

అమరుల కుటుంబాలకు ముందుగానే ప్లాట్లు 
తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలకు 250 చదరపు గజాల చొప్పున ప్లాట్లను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అదే స్థలాల్లో వారికి ఇళ్లను కూడా నిర్మించి ఇవ్వనున్నారు. ఇందిరమ్మ లబ్ధిదారుల్లో సొంత జాగా లేనివారికి పట్టాలు ఇచ్చేందుకు కాస్త సమయం తీసుకున్నా.. అమరుల కుటుంబాలకు మాత్రం వెంటనే ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే జాబితా రూపకల్పన, భూసేకరణ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది. 

ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించి.. 
2004– 2014 మధ్య ఉమ్మడి ఏపీలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించి దాదాపు 19 లక్షల ఇళ్లను నిర్మించారు. మళ్లీ అధికారంలోకి వస్తే అదే తరహాలో ఇళ్లను నిర్మిస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. గెలిచి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కసరత్తు ప్రారంభించింది.

అయితే గత సర్కారు ఎన్నికల ముందు స్వీకరించిన గృహలక్ష్మి దరఖాస్తులను తిరస్కరించాలని ఇప్పటికే నిర్ణయించింది. దీంతో ఇందిరమ్మ ఇళ్ల కోసం మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ప్రజాపాలన కార్యక్రమంలోనే పేదల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. వాటిని పరిశీలించి అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నారు.  

Advertisement

What’s your opinion

Advertisement