కుటుంబ ‘రుణాలు’

6 May, 2019 04:52 IST|Sakshi

కుటుంబసభ్యుల నుంచి అప్పు తీసుకున్న వారిలో రాహుల్, ములాయం, శత్రుఘ్న సిన్హా

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్, సినీ నటుడు, ఎంపీ శత్రుఘ్న సిన్హా.. వీరంతా తల్లి, కొడుకు, కూతురు తదితర కుటుంబసభ్యులకు బాకీ ఉన్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల బరిలో ఉన్న వీరంతా కుటుంబ సభ్యులకు బకాయి ఉన్నట్లు ఎన్నికల సంఘానికి సమర్పించిన తమ అఫిడవిట్‌లలో పేర్కొన్నారు. రాహుల్‌ తన తల్లి సోనియా నుంచి అప్పు తీసుకోగా, ములాయం కొడుకు అఖిలేశ్‌ నుంచి, శత్రుఘ్న సిన్హా కూతురు సోనాక్షి సిన్హా నుంచి రుణం తీసుకున్నట్లు వెల్లడించారు.

రాహుల్‌కు రూ.5 లక్షల అప్పు
యూపీలోని అమేథీ నుంచి, కేరళలోని వయనాడ్‌ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ తన తల్లి, యూపీఏ చైర్‌ పర్సన్‌ సోనియా గాంధీ నుంచి రూ.5 లక్షలను అప్పు రూపంలో తీసుకున్నట్లు అఫిడవిట్‌లో తెలిపారు. ఇది తప్ప ఇతర అప్పులేవీ లేవని తెలిపారు. సోనియా మాత్రం ఎవరి వద్దా రుణం తీసుకోలేదని పేర్కొన్నారు. యూపీలోని మైన్‌పురి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఎస్‌పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ తన కుమారుడు, మాజీ సీఎం అఖిలేశ్‌ నుంచి రూ.2.13 కోట్లు రుణం తీసుకున్నట్లు వెల్లడించారు.  రెండో భార్య సాధనా యాదవ్‌కు రూ.6.75 లక్షలు, కొడుకు ప్రతీక్‌కు రూ.43.7 లక్షలు, కుటుంబ సభ్యురాలు మృదులా యాదవ్‌కు రూ.9.8 లక్షలు అప్పు  ఇచ్చినట్లు ములాయం తెలిపారు.  

కూతురి నుంచి రూ.10 కోట్ల అప్పు
పట్నా సాహిబ్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీ బీజేపీ నేత శత్రుఘ్న సిన్హా తన కూతురు, సినీ నటి అయిన సోనాక్షి సిన్హాకి రూ.10.6 కోట్లు బకాయి ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే, తన కుమారుడు లవ్‌ సిన్హాకు రూ.10 లక్షలు, భార్య పూనమ్‌ తదితరులకు రూ.80 లక్షల మేర అప్పుగా ఇచ్చినట్లు తెలిపారు. యూపీలో లక్నో నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరఫున పోటీ చేస్తున్న పూనమ్‌ సిన్హా తన కూతురు సోనాక్షి నుంచి రూ.16 కోట్లు అప్పు తీసుకున్నట్లు తెలిపారు. ఆమె ప్రధాన ప్రత్యర్థి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఎటువంటి రుణం లేదని వెల్లడించారు. శత్రుఘ్న సిన్హా ప్రత్యర్థి,  కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఎటువంటి బకాయిలు లేవని తెలిపారు. బిహార్‌ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కూతురు, ఆర్‌జేడీ తరఫున పాటలీపుత్రలో బరిలో ఉన్న మిసా భారతి వ్యక్తిగత రుణాలు లేవని, తన భర్త శైలేష్‌ కుమార్‌కు మాత్రం రూ.9.85 లక్షల బ్యాంకు లోన్‌ ఉందని పేర్కొన్నారు. రుణాలు, అడ్వాన్సుల రూపంలో తాను రూ.28 లక్షలు, తన భర్త రూ.2.9 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. బీజేపీకి చెందిన ఆమె ప్రత్యర్థి రామ్‌కృపాల్‌ రూ.17.17 లక్షలు‡ తన కూతురి కోసం విద్యారుణం తీసుకున్నట్లు వెల్లడించారు.

నిరుద్యోగిగా పేర్కొన్న కన్హయ్యకుమార్‌
బిహార్‌కు చెందిన మరో కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ తనకు రూ.5.86 లక్షలు, తన భార్యకు రూ.26.5 లక్షలు రుణం ఉన్నట్లు  అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తనకు రూ.75 లక్షలు, తన భార్యకు రూ.15 లక్షల ఆస్తిపాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈయన ప్రత్యర్థిగా ఉన్న జేఎన్‌యూ మాజీ విద్యార్థి నేత కన్హయ్యకుమార్‌ బ్యాంకు అకౌంటు లేదని, నిరుద్యోగినని తెలిపారు. చండీగఢ్‌ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిని కిరణ్‌ ఖేర్‌ తన కుమారుడి నుంచి రూ.25 లక్షలు తీసుకున్నట్లు, భర్త, ప్రముఖ సినీ నటుడు అయిన అనుపమ్‌ ఖేర్‌కు  రూ.35 లక్షలను రుణంగా ఇచ్చినట్లు చెప్పుకున్నారు. దక్షిణ ముంబై నియోజకవర్గం కాంగ్రెస్‌ అభ్యర్థి మిలింద్‌ డియోరా తన భార్య పూజాకు బదులు రూపంలో రూ.4.96 కోట్లు ఇచ్చినట్లు వెల్లడించారు.  

మరిన్ని వార్తలు