మోదీ అప్పుడెందుకు రాలేదు?

17 May, 2019 17:35 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశానికి కాబోయే ప్రధాని ఎవరనేది ప్రజలు నిర్ణయిస్తారని కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పనితీరు ఆధారంగా 23న ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో సహకరించిన వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. 2014 నుంచి ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషించామని పేర్కొంటూ తమకు తాము ‘ఏ’ గ్రేడ్‌ ఇచ్చుకున్నారు.

కేంద్ర ఎన్నికల సంఘం పనితీరును ఆయన తప్పుబట్టారు. ఈసీ పక్షపాతంగా వ్యవహరించిందని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఏం మాట్లాడినా ఈసీ పట్టించుకోలేదని, తమను మాత్రం కట్టడి చేసిందని వాపోయారు. మోదీ ప్రచారానికి అనుగుణంగా ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసిందన్నారు. మోదీ- అమిత్‌ షా దగ్గర లెక్కలేనంత సొమ్ము, అధికారం ఉందని విమర్శించారు. మోదీ కుటుంబంపై తాను విమర్శలు చేయలేదన్నారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి భంగపాటు తప్పదన్నారు.

ఎన్నికలు ముగియడానికి నాలుగైదు రోజుల ముందు ప్రధాని నరేంద్ర మోదీ మీడియా ముందుకు వచ్చారని వెల్లడించారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ విలేకరుల సమావేశం నిర్వహించడం ఇదే మొదటిసారి అని గుర్తు చేశారు. రఫేల్‌ వ్యవహారంపై చర్చకు రావాలని సవాల్‌ విసిరినా మోదీ ఎందుకు స్పందించలేదని రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. అమిత్‌ షాతో కలిసి మోదీ ఈరోజు సాయంత్రం విలేకరుల సమావేశంలో పాల్గొన్న నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని వార్తలు