రీట్వీట్లలో మోదీని మించిన రాహుల్‌

25 Sep, 2018 15:12 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ సోషల్‌ మీడియా ట్విటర్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పోటీ పడేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ రీట్వీట్ల విషయంలో మొదటి సారి ఆయన్ని అధిగమించారు. గత జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు ఈ ఇరువురికి వచ్చిన రీట్వీట్లపై మిచిగాన్‌ యూనివర్శిటీ అధ్యయనం జరపగా ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ట్విట్టర్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి 4.40 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నప్పటికీ కేవలం 76 లక్షల ఫాలోవర్లు కలిగిన రాహుల్‌ గాంధీకి రీట్వీట్లు ఎక్కువ రావడం విశేషమని మిచిగాన్‌ యూనివర్శిటీ తరఫున ఈ అధ్యయనం నిర్వహించిన ప్రొఫెసర్‌ జోయోజీత్‌ పాల్, డాక్టోరల్‌ అభ్యర్థి లియా బొజార్ట్‌ వ్యాఖ్యానించారు. కేవలం హిందీలో చేసిన ట్వీట్లపైనే వారు ఈ అధ్యయనం జరిపారు.

రాహుల్‌ గాంధీ ట్వీట్లలో ప్రాస, వ్యంగ్యం, ఎత్తిపొడుపు మాటలు ఉండడం అందుకు కారణమని అధ్యయనకారులు తేల్చారు. ఉదాహరణకు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ని కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ సేల్స్‌ టాక్స్‌గా భావిస్తే మోదీ ప్రభుత్వం దాన్ని ‘గబ్బర్‌ సింగ్‌ టాక్స్‌’గా మార్చిందంటూ రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేయడం. ఇక మోదీ ట్వీట్లు చప్పగా, పేలవంగా, సూటిగా ఉండడం వల్ల రీట్వీట్లలో ఆయన వెనకబడ్డారని వారు తెలిపారు. మోదీ ఎక్కువగా ఇంగ్లీషులో, ఆయనకన్నా ఎక్కువగా హిందీలో రాహుల్‌ గాంధీ  ట్వీట్లు చేయడం కూడా రాహుల్‌ గాంధీకి కలసి రావచ్చని వారంటున్నారు. దేశవ్యాప్తంగా 274 మంది రాజకీయ నాయకల ట్విట్టర్‌ ఖాతాలపై వీరు అధ్యయనం జరిపారు. వారిలో ఎవరు ఏ భాషలో ఎక్కువగా ట్వీట్లు చేస్తున్నారో కూడా గుర్తించారు. ఎక్కువ మంది ఇంగ్లీషు, ఆ తర్వాత హిందీ భాషలను ఉపయోగిస్తుండగా, కొందరు కేవలం ప్రాంతీయ భాషలను మాత్రమే ఉపయోగిస్తున్నారు.

2013 నుంచి ఇప్పటి వరకు ప్రధాని నరేంద్ర మోదీ తన మొత్తం ట్వీట్లలో 73.7 శాతం ఇంగ్లీషులో ట్వీట్‌ చేయగా, రాహుల్‌ గాంధీ (2015 నుంచి ఇప్పటి వరకు) 68 శాతం మాత్రమే హిందీలో ట్వీట్లు చేశారు. పి. చిదంబరం, కిరణ్‌ బేడీ, మనోహర్‌ పారికర్, సుబ్రమణియన్‌ స్వామీ, శశి థరూర్, స్మృతి ఇరానీ, అఖిలేష్‌ యాదవ్‌లు మోదీ కన్నా ఎక్కువ శాతంలో (సంఖ్యలో కాదు) ఇంగ్లీషులో ట్వీట్లు చేస్తున్నారు. సుశీల్‌ మోదీ, రఘుబార్‌ దాస్, యోగి ఆదిత్యనాథ్‌లు ప్రాంతీయ భాషనే ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ట్వీట్లలో 8 శాతం ట్వీట్లు మాత్రమే ఇంగ్లీషులో ఉంటున్నాయి.

2014 సార్వత్రిక ఎన్నికల్లో సోషల్‌ మీడియాను ఎక్కువగా ఉపయోగించుకున్న నరేంద్ర మోదీ ఇప్పటికీ ఎక్కువనే వాడుతున్నారు. ప్రపంచంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తర్వాత మోదీకే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. అందుకనే మోదీ తన పార్టీ పార్లమెంట్‌ సభ్యులందరిని సోషల్‌ మీడియాను ఎక్కువగా ఉపయోగించుకోవాలని ఆదేశించడంతోపాటు ప్రతి ఒక్కరిని ఫేస్‌బుక్‌లో కనీసం మూడు వేల లైక్స్‌ కూడా రావాలని షరతు విధించారు.

మరిన్ని వార్తలు