భారీ మెజారిటీ; మోదీ కేబినెట్‌లో చోటు దక్కేనా?

27 May, 2019 10:06 IST|Sakshi

లక్నో : సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించి అధికారంలోకి రావడంతో మంత్రివర్గ కూర్పుపై అన్నివర్గాల్లో ఆసక్తి నెలకొంది.  మోదీ కేబినెట్‌లో చోటు కోసం బీజేపీ సహా మిత్రపక్షాల నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌ సిక్రీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన రాజ్‌ కుమార్‌ చహర్‌ కేంద్రమంత్రి పదవి దక్కించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.  యూపీ కాంగ్రెస్‌ చీఫ్‌ రాజ్‌ బబ్బర్‌పై భారీ మెజారిటితో గెలుపొందిన రాజ్‌ కుమార్‌ మోదీ కేబినెట్‌లో కచ్చితంగా చోటు దక్కించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఈ స్థానం నుంచి పోటీ చేసిన బీజేపీ నేత బాబూలాల్‌ చౌదరి కూడా రాజ్‌ బబ్బర్‌పై పైచేయి సాధించారు. అయితే అప్పడు ఆయన కేవలం లక్షన్నర ఓట్ల మెజారిటీ మాత్రమే పొందారు. 2019 ఎన్నికల్లో ఫతేపూర్‌ సిక్రీ అభ్యర్థిగా రాజ్‌ కుమార్‌ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. సిట్టింగ్‌ ఎంపీని కాదని బీజేపీ అధిష్టానం ఆయనకు అవకాశం కల్పించింది.

ఈ నేపథ్యంలో గెలుపు కోసం తీవ్రంగా శ్రమించిన రాజ్‌ కుమార్‌ మొత్తంగా 6.67,147 ఓట్లు సాధించారు. 4, 95, 065 ఓట్ల మెజారిటీతో ప్రత్యర్థిని మట్టికరిపించారు. వారణాసిలో నరేంద్ర మోదీకి వచ్చిన మెజారిటీ కంటే కూడా ఇదే ఎక్కువ. అదే విధంగా రాజ్‌ కుమార్‌ చహర్‌కు 64.32 శాతం ఓట్లు దక్కడంతో కాంగ్రెస్‌ అభ్యర్థి రాజ్‌ బబ్బర్‌ దారుణ ఓటమి చవిచూశారు. ఈ క్రమంలో ఓటమికి బాధ్యత వహిస్తూ.. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు కూడా. ఈ నేపథ్యంలో అత్యధిక మెజారిటీ సొంతం చేసుకున్న రాజ్‌ కుమార్‌ చహర్‌కు మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. కాగా అత్యధిక లోక్‌సభ స్థానాలున్న యూపీలో కాంగ్రెస్‌ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సైతం మోదీ హవాలో కొట్టుకుపోయారు. బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక 80 లోక్‌సభ స్థానాలున్న యూపీలో బీజేపీ 62, బీఎస్పీ 10, ఎస్పీ 5 స్థానాల్లో విజయం సాధించగా.. కాంగ్రెస్‌ కేవలం ఒకే ఒక స్థానం(సోనియా గాంధీ- రాయ్‌బరేలీ)లో గెలుపొందిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు