కాంగ్రెస్‌, ఎన్‌సీపీకి చేరువవుతున్న రాజ్‌ థాకరే

20 Mar, 2018 13:28 IST|Sakshi
ఫైల్‌ఫోటో

సాక్షి, ముంబై : మోదీ ముక్త్‌ భారత్‌ నినాదంతో మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్‌) చీఫ్‌ రాజ్‌ థాకరే విపక్షాలకు చేరువవుతున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో కాంగ్రెస్‌, ఎన్‌సీపీలతో ఎంఎన్‌ఎస్‌ కలిసి పోటీ చేసే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మోదీ సర్కార్‌పై ఎంఎన్‌ఎస్‌ సదస్సులో రాజ్‌ థాకరే విరుచుకుపడిన తీరును బట్టి వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఢీకొనేందుకు తమ పార్టీ కాంగ్రెస్‌-ఎన్‌సీపీ కూటమితో జట్టు కడుతుందనడంలో సందేహం లేదని ఓ ఎంఎన్‌ఎస్‌ సీనియర్‌ నేత పేర్కొన్నారు. మరోవైపు ఎన్‌సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌తో ఇటీవల రాజ్‌ థాకరే భేటీ కూడా ఈ సంకేతాలనే పంపుతున్నాయి.

ఈ మూడు పార్టీలు కలిస్తే ఇప్పటివరకూ బీజేపీతో కత్తులు దూస్తున్న శివసేన ఆ పార్టీతో పొత్తుకు సముఖత చూపవచ్చని ఎంఎన్‌ఎస్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రాజ్‌ థాకరే కాంగ్రెస్‌, ఎన్‌సీపీలతో కలిస్తే మూడుపార్టీలూ మరాఠా ఓట్లను కొల్లగొడతాయని..హిందుత్వ ఓటుబ్యాంకును పటిష్టపరిచే క్రమంలో బీజేపీ, శివసేన ఎన్నికల్లో కలిసి పోటీచేస్తాయని ఓ సీనియర్‌ శివసేన నేత చెప్పుకొచ్చారు. కాగా ఎన్‌సీపీ, కాంగ్రెస్‌, ఎంఎన్‌ఎస్‌తో పాటు రైతు సమస్యలపై పోరాడుతున్న వర్గాలను ఏకం చేసేందుకు శరద్‌ పవార్‌ సన్నాహాలు చేస్తున్నారు. స్వాభిమాని షేట్కారి సంఘటన నేత,ఎంపీ రాజు షెట్టిని తమ కూటమిలోకి రప్పించేందుకు పవార్‌ ప్రయత్నిస్తున్నారు. రైతు సమస్యలపై కాంగ్రెస్‌-ఎన్‌సీపీ కూటమి దృష్టిసారిస్తుండగా, ముంభై మహానగర పరిధిలో మరాఠా కార్డు ప్రయోగించడం ద్వారా ఎంఎన్‌ఎస్‌ రాజకీయ లబ్ధికి పావులు కదుపుతున్నాయి.

మరిన్ని వార్తలు