మత విభేదాలు సృష్టించేందుకే!

4 Aug, 2018 04:41 IST|Sakshi

స్వార్థ ప్రయోజనాల కోసమే ఎన్నార్సీపై వివాదం

రాజ్యసభలో మండిపడ్డ రాజ్‌నాథ్‌

న్యూఢిల్లీ: స్వార్థపూరిత ప్రయోజనాల కోసమే ఎన్నార్సీ (జాతీయ పౌర రిజిస్టర్‌)పై వివాదం సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆరోపించారు. మత కల్లోలాలు సృష్టించేందుకే సోషల్‌ మీడియాలో విద్వేషపూరిత సందేశాలను ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. శుక్రవారం రాజ్యసభలో ఎన్నార్సీ తుది ముసాయిదాపై ప్రభుత్వ ప్రకటనలో భాగంగా రాజ్‌నాథ్‌ మాట్లాడారు. తుది జాబితా రూపకల్పనలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎన్నార్సీ తుది ముసాయిదాలో 40 లక్షల మందికి చోటు దక్కకపోవడంతో వివాదమవడం తెల్సిందే.  

పారదర్శకంగా ఎన్నార్సీ ప్రక్రియ
‘ఎన్నార్సీ ముసాయిదా రూపకల్పన ప్రక్రియ పారదర్శకంగా జరిగింది. ఇది పూర్తిగా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమం. వివక్షకు చోటు లేదు. భవిష్యత్తులోనూ ఎలాంటి వివక్ష ఉండదని భరోసా ఇస్తున్నా. తన పౌరులెవరో తెలుసుకోవాలనుకోవడం ప్రతిదేశానికున్న బాధ్యత. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశం’ అని అన్నారు. రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటనను పలు పార్టీల నేతలు స్వాగతించగా మరికొందరు ఎన్నార్సీపై సూచల విషయంలో స్పష్టత కావాలనికోరారు. కాగా, దేశ భద్రత, సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని రాజ్యసభ ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్‌ స్పష్టం చేశారు. జాబితాలో లేని వారికి చొరబాటుదారులని పిలవడం సరికాదని ఆర్జేడీ ఎంపీ మనోజ్‌ ఝా ప్రభుత్వాన్ని కోరారు.  

ఈశాన్యంలో ‘అస్సాం’ ప్రకంపనలు
అరుణాచల్‌ప్రదేశ్‌: స్థానికతను ధ్రువీకరించే పత్రాల్లేకుండా నివాసం ఉంటున్న స్థానికేతరులు 15రోజుల్లోగా రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్లిపోవాలని ఆల్‌ అరుణాచల్‌ప్రదేశ్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ (ఆప్సు) హెచ్చరించింది. రాష్ట్రంలో అక్రమ చొరబాటుదారులకు వ్యతిరేకంగా ఆగస్టు 17 నుంచి ‘ఆపరేషన్‌ క్లీన్‌ డ్రైవ్‌’ను చేపట్టనున్నట్లు ప్రకటించింది.  

మణిపూర్‌: రాష్ట్రంలోకి ఎవరూ అక్రమంగా ప్రవేశించకుండా పర్యవేక్షించేందుకు అధికార బీజేపీ రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేసింది. ప్రభుత్వం కూడా సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటుచేసింది.
నాగాలాండ్‌: సరిహద్దు ప్రాంతాల నుంచి ఎవరూ ప్రవేశించకుండా చూడాలని నాగాలాండ్‌ హోంశాఖ ఆదేశించింది. నాగాలాండ్‌లోనూ ఎన్నార్సీ చేపట్టాలని అధికార ఎన్‌డీపీపీ.. కేంద్రాన్ని కోరింది.

మేఘాలయ: స్థానిక గిరిజనుల హక్కుల రక్షణ కోసం ఎన్నార్సీ తరహా చర్యలు చేపట్టాలని ఖాసీ స్టూడెంట్స్‌ యూనియన్‌ (కేఎస్‌యూ) ఉప ముఖ్యమంత్రి ప్రెస్టోన్‌ను కలిసి విజ్ఞప్తి చేసింది. అస్సాం ఎన్నార్సీ విడుదల అనంతరం అక్రమ వలసదారుల గుర్తింపు, ప్రవేశాన్ని అడ్డుకునేందుకు సరిహద్దు ప్రాంతాల్లో కేఎస్‌యూ 3 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసింది.

త్రిపుర: త్రిపురలోనూ ఎన్నార్సీ చేపట్టాలని ఇండిజీనస్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ త్రిపుర (ఐపీఎఫ్‌టీ) డిమాండ్‌ చేస్తోంది. అయితే ఈ డిమాండ్‌ను అధికార బీజేపీ తోసిపుచ్చింది. ఈశాన్య రాష్ట్రాలన్నింటిలోనూ ఎన్నార్సీ నిర్వహించాలని ఈశాన్య రాష్ట్రాల విద్యార్థి సంఘం (ఎన్‌ఈఎస్‌ఓ) డిమాండ్‌ చేస్తోంది.  

మరిన్ని వార్తలు