హత్యలు చేసి ప్రజలను భయపెట్టలేరు

16 Mar, 2019 09:58 IST|Sakshi
ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి కార్యాలయంలో వైఎస్‌ వివేకానందరెడ్డి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న నాయకులు

సాక్షి, కావలి: వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డిని హత్య చేసి ప్రజలను భయపెట్టి ఎన్నికల్లో లబ్ధిపొందాలనే టీడీపీ నాయకుల కుట్రలు ఫలించవని వైఎస్సార్‌సీపీ నాయకులు అన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి సోదరుడు అయిన వైఎస్‌ వివేకానందరెడ్డిని అత్యంత పాశవికంగా హత్య చేయడాన్ని వైఎస్సార్‌సీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి కార్యాలయంలో శుక్రవారం వివేకానందరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నాయకులు నివాళులు అర్పించారు.

అలాగే పట్టణంలోని ముసునూరులో కూడా వైఎస్‌ వివేకానందరెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.  నాయకులు మాట్లాడుతూ వైఎస్‌ వివేకానందరెడ్డి చాలా సౌమ్యుడన్నారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలో ప్రజల ఓట్లను తొలిగించి నీచత్వానికి పాల్పడిన టీడీపీ నాయకులు, ఇప్పుడు మనుషులను అంతంమొందించే పనిలో ఉన్నట్లుగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రజలను భయపెట్టడానికి టీడీపీ నాయకులు చేస్తున్న దారుణాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. వచ్చేనెల 11 వతేదీ జరగనున్న పోలింగ్‌లో ప్రజలు టీడీపీ నాయకులు చేసిన పాపాలను గుర్తు చేసుకొని తగిన బుద్ధి చెబుతారని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి, కనుమర్లపూడి వెంకట నారాయణ, కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, కుందుర్తి కామయ్య, కేతిరెడ్డి శశిధర్‌రెడ్డి, కౌన్సిలర్లు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు