కేసీఆర్‌ది తుగ్లక్‌ పాలన

10 Jun, 2018 20:30 IST|Sakshi
కార్యకర్తలను పార్టీలోకి ఆహ్వానిస్తున్న  రేణుకాచౌదరి

ఖమ్మం సహకారనగర్‌ :  రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ది తుగ్లక్‌ పాలన అని కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి విమర్శించారు. నగరంలోని 27వ డివిజన్‌లో కార్పొరేటర్‌ నాగండ్ల దీపక్‌చౌదరి ఆధ్వర్యంలో 50 కుటుంబాలకు చెందిన వారు శనివారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. రేణుకాచౌదరి వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ..  తెలంగాణ ఏర్పడితే బతుకులు బాగుంటాయని, ఉద్యోగాలు వస్తాయ ని పలువురు ఆశించారని, కానీ రాష్ట్రంలో ఒక కుటుంబంలోనే వెలుగులు నిండాయని విమర్శించారు. కేసీఆర్‌ కుటుంబంలోని నలుగురికే పండగలా ఉందన్నారు. ఎన్నికల హామీలలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని, డబుల్‌బెడ్‌ రూం, ఇంటికో ఉద్యో గం, దళితులకు మూడెకరాల భూమి, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల పర్మనెంట్‌ వంటి హామీలన్నింటిని గాలికొదిలేశారని ఆరోపించారు.

గతంలో కాం గ్రెస్‌ చేసిన అభివృద్ధినే తమదిగా టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ హయాంలో వేసిన రోడ్లకు అదనంగా ఎక్కడైనా రోడ్లు వేశారా అని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న నాగండ్ల దీపక్‌చౌదరిని అభినందించారు. అనంతరం దీపక్‌చౌదరి మాట్లాడుతూ నగరంలో టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. అంతకముందు పార్టీ జెండా ను రేణుకాచౌదరి ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు దిరిశాల భద్రయ్య, ఎస్‌కె.పాషా, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మానుకొండ రాధాకిషోర్, కొత్తగూడెం జిల్లా నాయకుడు యడవల్లి కృష్ణ, సైదులు నాయక్, ఎస్‌కె.ఖాజా, మొహినుద్దీన్, పిడతల రామ్మూర్తి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు