అభివృద్ధికి గుమ్మం చేస్తా!

29 Mar, 2019 08:48 IST|Sakshi
ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్థి రేణుకా చౌదరి

‘ఖమ్మం నా రాజకీయ ఎదుగుదలకు గుమ్మం. నాకు జన్మతః వచ్చిన ప్రశ్నించే తత్వాన్ని జిల్లా మహిళలు స్వాగతించారు. ఎవరైనా అక్రమంగా, అమానుషంగా ప్రవర్తిస్తే ఇదేమిటని ప్రశ్నించే చైతన్యాన్ని అలవరుచుకున్నారు మహిళలు. జిల్లాను అభివృద్ధి చేయాలన్న నా సంకల్పానికి ఖమ్మం ప్రజల సహకారం ఎల్లవేళలా ఉంటోంది. ఇక ముందు కూడా ఉండబోతుంది’.. అంటోన్న  కేంద్ర మాజీ మంత్రి, ఖమ్మం కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి గారపాటి రేణుకాచౌదరి ‘సాక్షి’తో పంచుకున్న విషయాలు ఆమె మాటల్లోనే..

ఉక్కులాంటి ఉపాధి...
బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పడం ద్వారా ఉపాధి అవకాశాలను పెంపొందించడం, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా పరిశ్రమలు స్థాపించడం, జిల్లాలో 80 శాతం పైగా వ్యవసాయ రంగంపై ఆధారపడిన రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించడం, సమీకృత వ్యవసాయ విధానం తీసుకురావడం నా ముందున్న తక్షణ కర్తవ్యం.

సమస్యలన్నీ ఎరుకే
ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలోని ప్రతి పల్లెతో నాకు ఆత్మీయ అనుబంధం ఉంది. అక్కడి అవసరాలపై స్పష్టమైన అవగాహన ఉంది. ఏ ప్రాంతంలో ఏ సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారో 20 ఏళ్ల నుంచి చూçస్తూ్తనే ఉన్నా. అనేక సమస్యలను.. సామాజిక రుగ్మతలను రూపు మాపాను కూడా. ఇంకా చేయాల్సింది చాలానే ఉంది. సీజనల్‌గా వచ్చే వ్యాధులను అరికట్టడానికి కార్యాచరణ లేకుండా అభివృద్ధిని అంకెల్లో చూపెట్టడం వల్ల ఏం ప్రయోజనం? జిల్లాలో దోమల బెడద తగ్గనే లేదు.

రేణుకా చౌదరి
స్వస్థలం: విశాఖపట్నం
భర్త పేరు: శ్రీధర్‌ చౌదరి
సంతానం: ఇద్దరు కుమార్తెలు
తల్లిదండ్రులు: వసుంధరరావు, కె.ఎస్‌.రావు
పుట్టిన తేది: ఆగస్టు 13, 1954
విద్యార్హతలు: పీజీ (ఇండస్ట్రియల్‌ సైకాలజీ)
రాజకీయ ప్రస్థానం: 1986, 1992, 2012లలో రాజ్యసభ మెంబర్, 1999–2004, 2004 – 2009 లోక్‌సభ మెంబర్‌
మంత్రి పదవులు: 1997– 98లో కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ, 2004 – 2006కేంద్ర పర్యాటక శాఖ, 2006– 2009మహిళ, శిశు అభివృద్ధిశాఖ.

నా ప్రచారాస్త్రం నేనే..
ఖమ్మం ఎంపీగా జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి, కార్గో ఎయిర్‌పోర్ట్‌ ఏర్పాటుకు శ్రమించాను. కార్యరూపం దాల్చే సమయంలో ప్రభుత్వం మారింది. ప్రభుత్వ గ్రాంటుతో ఏర్పాటు చేసిన ఇర్రేడియేషన్‌ ప్లాంట్‌ ఊసే లేకుండా పోయింది. రెండో కేంద్రీయ విద్యాలయం నా హయాంలో మంజూరైతే ఇప్పటికీ భవనాల నిర్మాణం పూర్తి కాలేదింకా. నా ప్రచారానికి ప్రధాన అస్త్రాన్ని నేనే. పాలేరు నుంచి పర్ణశాల వరకు పర్యాటక అభివృద్ధి చేయడంతో పాటు నియోజకవర్గంలో కుంటుపడిన అభివృద్ధిని మళ్లీ పట్టాలెక్కించడమే ప్రస్తుతం నా లక్ష్యాలు. నా పోరాటం వ్యక్తులతో ఉండదు. అవినీతి, అరాచకత్వం, ప్రజలకు జరగాల్సిన అభివృద్ధిపై మాత్రమే ఉంటుంది. నేను చేసిన పనులు, ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకమే నన్ను గెలిపిస్తాయి.

గృహహింస నిరోధక చట్టం
మహిళలు రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో అత్యున్నత స్థితికి చేరాలి. గృహహింస నిరోధక చట్టంతో మహిళలకు చట్టపరమైన రక్షణ లభించింది. ఆ చట్టానికి రూపకల్పన జరిగింది నేను కేంద్రమంత్రిగా ఉన్న సమయంలోనే. మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండేందుకు ఒక మహిళగా నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను.– మాటేటి వేణు, సాక్షి–ఖమ్మం ప్రతినిధి

మరిన్ని వార్తలు