మంత్రి తమ్ముడా.. మజాకా!

26 Jun, 2018 10:23 IST|Sakshi
మంత్రి సునీత తమ్ముడు మురళీ కుటుంబ సభ్యుల ఫొటో తీస్తున్న వీఆర్వో జనార్దన్‌రావు

రాచమర్యాదలు చేసిన     రెవెన్యూ అధికారులు

ఫొటోగ్రాఫర్‌గా మారిన వీఆర్వో

మంత్రాలయం: అధికారం ఉంటే ఎలాంటి మర్యాదైనా అలా నడిచివస్తుందేమో! మంత్రి తమ్ముడి రాకతో ఇక్కడి రెవెన్యూ అధికారులు రాచమర్యాదలు చేశారు. అడుగడుగునా వంగి వంగి దండాలు పెట్టారు. అడిగిన వెంటనే స్వామి దర్శనంతో పాటు పీఠాధిపతి ఆశీర్వచనాలూ అందజేయించారు. ఆఖరికి కుటుంబ సభ్యుల ఫొటోలు తీయడానికి ఫొటోగ్రాఫర్లుగానూ మారిపోయారు. మండల మేజిస్ట్రేట్‌ మొదలు ఇద్దరు వీఆర్వోలు ‘తమ్ముడి’ సేవలో తరించారు. ఈ దృశ్యం చూసి భక్తులంతా ముక్కున వేలేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత తమ్ముడు మురళీ కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం శ్రీరాఘవేంద్రస్వామి దర్శనార్థం మంత్రాలయం వచ్చారు. రెవెన్యూ అధికారులు ప్రొటోకాల్‌ను విస్మరించి.. దగ్గరుండి ‘తమ్ముడి’ సేవలో తరించారు.

విడిది కోసం వసతి మొదలు పీఠాధిపతి ఆశీర్వచనం వరకు దగ్గరుండి చేయించారు. తహసీల్దార్‌ చంద్రశేఖర్, వీఆర్వోలు జనార్దన్‌రావు, భీమయ్య వారి సేవల్లో తరించారు. గ్రామ దేవత మంచాలమ్మ, శ్రీరాఘవేంద్రస్వామి దర్శనం, పీఠాధిపతి సుభుదేంద్రతీర్థుల ఆశీర్వచనాలు రాచమర్యాదలతో చేయించారు. ప్రసాదాల పార్శిళ్లతో పాటు ఆశీర్వచన ఫల, పూల మంత్రాక్షింతలు, శేషవస్త్రాలను రెవెన్యూ అధికారులే మోసుకుని ప్రదక్షిణ చేశారు. శ్రీమఠంలో చివరికి కుటుంబ సభ్యుల ఫొటోలు తీయడానికి వీఆర్వో జనార్దన్‌రావు ఫొటోగ్రాఫర్‌గా మారిపోయారు. మంత్రులు వస్తే ఇవ్వాల్సిన ప్రొటోకాల్‌ వారి తమ్ముళ్లకు సైతం లభిస్తోందంటే నిజంగా దౌర్భాగ్యమని భక్తులు వ్యాఖ్యానించారు. కార్యాలయాల్లో పనులు పక్కనపెట్టి రెవెన్యూ అధికారులు ఇలా ‘తమ్ముడి’ సేవలో తరించడం విమర్శలకు తావిస్తోంది.

మరిన్ని వార్తలు