పదునెక్కుతున్న ప్రచారాస్త్రాలు

3 Nov, 2018 03:54 IST|Sakshi
భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి శుక్రవారం రైతుబజార్‌లో ఇలా..

అధికారపక్షం చెప్పింది చేశాం!

ప్రతిపక్షం చేయంది చెబుతాం!

 ప్రగతి నివేదికతో టీఆర్‌ఎస్‌ సిద్ధం

గల్ఫ్‌ కార్మికుల కోసం ప్రవాస పాలసీ తెచ్చాం: అధికార పార్టీ

లొసుగులున్నాయంటున్న ‘కూటమి’∙

వలసజీవుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏదీ అంటున్న ప్రతిపక్షాలు

ఎన్నికల వేళ ఏం చేయాలో అభ్యర్థులకు బాగా తెలుసు. అందుకే ఏ ప్రాంతంలో ఏ సమస్యలున్నాయో చిత్రిక పడుతున్నారు. ప్రధాన సమస్యలు గుర్తించి...తాము అధికారంలోకి వస్తే పరిష్కరిస్తామని చెప్పుకుంటున్నారు. ఇదే కోవలో ముందస్తు ఎన్నికల సందర్భంగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ప్రధాన సమస్యలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. గత ఎన్నికల్లో మేనిఫెస్టోలో చెప్పినవిధంగా ‘మేం అది చేశాం..ఇది చేశాం’ అంటూ అధికార పక్షం చెబుతుండగా..నెరవేర్చని హామీలను గుర్తించి వాటిపై ఏం చేశారంటూ విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. కరీంగనర్‌ జిల్లాలో 2014 ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన పలు అంశాలు అధికార, విపక్షాలకు ఇప్పుడు ప్రచారాస్త్రాలు అవుతున్నాయి.

మేనిఫెస్టోలో అంశాల అమలు అధికార పార్టీకి అనుకూలంగా మారనుండగా.. అమలు కాని, అసంపూర్తి పథకాలపై విపక్షాలు విమర్శలు గుప్పించనున్నాయి. ప్రధానంగా బీడీ కార్మికుల సమస్యలు, ముత్యంపేట చక్కెర కర్మాగారం, పసుపు బోర్డు ఏర్పాటు, ప్రవాస పాలసీ, కరీంనగర్‌లో మెడికల్‌ కాలేజ్, లెదర్‌పార్కు, పరిశ్రమలు, నిరుద్యోగ సమస్య, డబుల్‌ బెడ్రూమ్, దళితులకు మూడెకరాలు భూమి, రైతుబంధు, బీమా, ఆసరా, కాళేశ్వరం, మిడ్‌మానేరు, సాగునీటి ప్రాజెక్టులు, రహదారుల నిర్మాణం తదితర అంశాలు ఇరు పార్టీలకు ప్రచారాస్త్రాలు కానున్నాయి.   

- ఉమ్మడి జిల్లాలో దాదాపు లక్షా 50 వేల మందికి పైగా బీడీ కార్మికులు ఉన్నారు.  
వీరి కోసం సిరిసిల్లలో ఈఎస్‌ఐ ఆస్పత్రి కట్టిస్తామని చెప్పినా జరగలేదు. గృహనిర్మాణ పథకం కూడా అమలు కాలేదు. 
చాలా చోట్ల బీడీలను బ్యాన్‌ చేయడంతో ఉపాధి కోల్పోతున్న కార్మికులకు ప్రత్యామ్నాయం దొరకడం లేదు. ఈ విషయంలో  ఎలాంటి పురోగతి లేదు.  
1,29,681 మంది బీడీ కార్మికులకు మాత్రం నెలనెలా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు.  
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్‌పల్లి ప్రాంతంలోని నిజాం దక్కన్‌ షుగర్స్‌ ప్రై .లిమిటెడ్‌ చెరుకు ఫ్యాక్టరీ ఈ ఎన్నికల్లోను ప్రధానాంశం కానుంది. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో ప్రధానాంశంగా చేర్చింది. చెరకు రైతులకు పెద్ద మొత్తంలో (రూ.12 కోట్ల మేరకు) బకాయిలను ప్రభుత్వం చెల్లించింది.  
అయితే ముత్యంపేట ప్యాక్టరీ మూసివేయడంతో రైతులు ఇతర పంటల వైపు వెళ్లారు. ప్రభుత్వం ప్రయత్నం ఇంకా కొనసాగుతుండగా... ఇదే అంశాన్ని కాంగ్రెస్, ఇతర రాజకీయ పక్షాలు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వ్యూహరచన చేస్తున్నాయి.  
కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల్లో పసుపు పంట దాదాపు 35 వేల ఎకరాల వరకు సాగవుతుంది. పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రయత్నాలు చేసింది. సాధ్యం కాలేదు. దీన్ని కాంగ్రెస్‌ తెరపైకి తీసుకు వస్తోంది.   
జగిత్యాల, సిరిసిల్ల ప్రాంతాలు గల్ఫ్‌ వలసలకు కేరాఫ్‌గా చెప్పొచ్చు. వందలాది గ్రామాల్లో ఇంటికి ఒకరిద్దరి చొప్పున సుమారు 40 వేల మంది సౌదీ అరేబియా, దుబాయ్, షార్జా, మస్కట్, ఒమన్, కువైట్, ఖతర్‌లో ఉంటున్నారు.  
వీరిలో మంచి హోదాలో ఉన్న వారు నాలుగు వేలకు మించి ఉండరు. మిగిలిన వారందరూ కార్మికులుగా పనిచేస్తూ దుర్భర జీవితాలు గడుపుతున్నారు. 
గల్ఫ్‌లో కార్మికుల సమస్యల పరిష్కారానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవాస పాలసీని అమలు చేస్తామని చెప్పింది. కొంత ప్రగతి సాధించింది. అయితే అధికారికంగా మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయలేదనే అంశాన్ని ప్రతిపక్షాలు ఎత్తిచూపుతున్నాయి.

‘బీడీ కార్మికుల ఆస్పత్రి’ కూడా ప్రచారాస్త్రమే.. 
ఏడు పూర్వ జిల్లాల్లో 16.41 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే లక్ష్యంతో మొదలెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా రైతులు ఆశలు పెట్టుకున్నారు.  
మంథని, పెద్దపల్లి, రామగుండం, కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎస్సారెస్పీ ప్రాజెక్టు నీరు అందడం లేదు. ప్రతియేటా ఈ నియోజకవర్గాల ప్రజలు ఆందోళన చేయడం పరిపాటిగా మారింది. దీంతో ప్రభుత్వం ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంకు శంకుస్థాపన చేయగా, కాళేశ్వరం ప్రాజెక్టుతో ‘పునరుజ్జీవం’ ముడిపడి ఉంది.   
సిరిసిల్లలో బీడీ కార్మికుల ఆస్పత్రి, నేతన్నలకు అమల్లోకి రాని వర్కర్‌ టూ ఓనర్‌ పథకం, మహిళల ఉపాధికి అపెరల్‌ పార్క్, ఇంటర్నేషనల్‌ డ్రైవింగ్‌ స్కూల్, వేములవాడ రాజన్న ఆలయ అభివద్ధికి ఏటా వంద కోట్లు.. ఇలాంటి హామీలు, పథకాలన్నీ  అధికార, ప్రతిపక్ష పార్టీలకు ప్రచారాస్త్రాలవుతాయి.
కరీంనగర్‌ కేంద్రంగా ప్రభుత్వ మెడికల్‌ కళాశాల కలగానే మిగిలింది. పర్యాటక అభివృద్ధి నేపథ్యంలో మానేరు రివర్‌ఫ్రంట్, బృందావన్‌ గార్డెన్, తీగెల వంతెన పనులు సాగుతున్నాయి. కరీంనగర్‌ ఐటీ టవర్‌ నిర్మాణం సాగుతున్నా, ఉద్యోగావకాశాలపై చర్చ జరగనుంది. 
పేదలకు డబుల్‌ బెడ్రూమ్‌ ఇండ్ల పథకం కింద ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో వివిధ కోటాల కింద 14,500 ఇండ్లు మంజూరైనట్లు ప్రకటించినా పూర్తిస్థాయిలో నిర్మించలేదు.  
కోల్‌బెల్టు (రామగుండం) ప్రాంతంలో సింగరేణి అధికారులకు ఇస్తున్న విధంగా సింగరేణి కార్మికులకు సొంతింటి కోసం 3 గుంటల స్థలం కేటాయింపు, కేసీఆర్‌ హామీ ఇచ్చిన మారుపేర్లను వెంటనే మార్చే ప్రక్రియ, సింగరేణిలో కూడా మెడికల్‌ కళాశాల ఏర్పాటు, రామగుండంలోని రాముని గుండాలు, శ్రీపాద ప్రాజెక్టు పర్యాటక కేంద్రాలు, బసంత్‌నగర్‌లో ఎయిర్‌పోర్టు ఏర్పాటు తదితర అంశాలు ఎన్నికల తెరపైకి రానున్నాయి.  
సుమారు 5.89 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.612 కోట్ల మేరకు ప్రభుత్వం పంపిణీ చేసింది. రైతుబీమా కింద మొదటి విడతలో 3.19 లక్షల మంది అర్హులైన రైతులకు బీమా బాండ్లను అందజేశారు. ప్రతినెలా 5,44,215 మందికి పింఛన్లు మంజూరవుతున్నాయి. వాటిలో 1,92,563 మంది వృద్ధులు, 1,31,226 మంది వితంతవులు, 67,804 మంది వికలాంగులు, 9074 మంది చేనేత కార్మికులు, 11,615 మంది గీత కార్మికులు, 1,29,681 మంది బీడీ కార్మికులున్నారు. వీరికి ప్రభుత్వం ప్రతినెలా రూ.59.09 కోట్లు చెల్లిస్తోంది. 

ప్రధానాంశాలివే... 
- బీడీ కార్మికుల సంక్షేమం 
- పసుపు బోర్డు, ముత్యంపేట షుగర్‌ ఫ్యాక్టరీ 
- గల్ఫ్‌ వలస బాధితులు 
- కాళేశ్వరం, మధ్య మానేరు ‘పునరుజ్జీవం’, ఎస్సారెస్పీ 
- డబుల్‌ బెడ్రూం, రైతుబంధు,బీమా, ఆసరా సంక్షేమ పథకాలు 
- మెడికల్‌ కళాశాల, అపెరల్‌ పార్క్, వర్కర్‌ టు ఓనర్‌ పథకం 
- సింగరేణి కార్మికులకు సొంతింటి స్థలం
- కె.శ్రీకాంత్‌రావు, నెట్‌వర్క్‌ ఇన్‌చార్జి

మరిన్ని వార్తలు