మోదీకి నిద్రలేని రాత్రులు

3 Nov, 2018 03:54 IST|Sakshi

రఫేల్‌ ఒప్పందం ద్వారా అనిల్‌ అంబానీకి 30 వేల కోట్లు

తొలి దఫాగా రూ.284 కోట్లు

ప్రధానిపై మండిపడ్డ రాహుల్‌

న్యూఢిల్లీ: రఫేల్‌ యుద్ధవిమానాల  కొనుగొలులో జరిగిన భారీ అవినీతిపై దర్యాప్తు చేపడితే ప్రధాని మోదీకి మనుగడ ఉండదని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. దీనిపై దర్యాప్తు జరిగితే తగిన శిక్ష తప్పదనే భయంతో మోదీ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని పేర్కొన్నారు.  అనిల్‌ అంబానీకి రూ.30 వేల కోట్లు కట్టబెట్టేందుకే మోదీ ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని ఆరోపించారు. ‘అనిల్‌ అంబానీకి నాగపూర్‌ ఎయిర్‌పోర్టు వద్ద భూములు ఉన్నందునే కాంట్రాక్టును ఇచ్చినట్లు డసో ఏవియేషన్‌ సీఈవో రిక్‌ ట్రాపీర్‌ చెబుతున్నారు.

ఇదంతా అబద్ధం. డసో సంస్థ తొలి దఫాగా రూ.284 కోట్లు రిలయన్స్‌ డిఫెన్స్‌కు ముట్టజెప్పింది. ఈ ముడుపులతోనే రిలయన్స్‌ భూములు కొనుగొలు చేసింది’ అని రాహుల్‌ అన్నారు. తాజా ఆరోపణలపై మాత్రం ఇంకా బీజేపీ నోరుమెదపలేదు. కాగా, రఫేల్‌ ఒప్పందంపై రాహుల్‌ ఆరోపణలను అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ గ్రూప్‌ ఖండించింది. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే అనిల్‌పై, ఆయన కంపెనీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని పేర్కొంది.

మరిన్ని వార్తలు