పుతిన్‌: గతమా? శాశ్వతమా?

19 Jan, 2020 02:56 IST|Sakshi

సుస్థిర స్థానంకోసమే రాజ్యాంగ సంస్కరణలు..

పుతిన్‌పై విమర్శలు గుప్పిస్తున్న రష్యా విపక్షాలు

రష్యా అధ్యక్షుడిగా పుతిన్‌ సుదీర్ఘకాలం కొనసాగాలనుకుంటున్నారా? రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తాజాగా తెరమీదకు తెచ్చి న రాజ్యాంగ సంస్కరణలు అదే విషయాన్ని ఖరారు చేస్తున్నాయంటున్నాయి రష్యాలోని ప్రతిపక్షాలు. చట్టసభలనుద్దేశించి పుతిన్‌ చేసిన వార్షిక ప్రసంగం సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. నిజానికి పుతిన్‌ పదవీకాలం 2024 వరకు కొనసాగనుంది. తాజాగా పార్లమెం టు సాక్షిగా పుతిన్‌ తన ప్రసంగంలో తన ఆలోచనలను ప్రజల్లోకితీ సుకెళుతున్నట్టు ప్రకటించారు. నేషనల్‌ ఓటింగ్‌ ద్వారా తన ప్రతిపాదనలను ప్రజామోదానికి ఉంచనున్నట్టు కూడా తేల్చి చెప్పారు. దీనికి ప్రజామోదం లభిస్తే శాశ్వతంగా పుతిన్‌ అధ్యక్ష పదవిలో కొనసాగే వీ లుంటుంది. పుతిన్‌ ఆలోచనల కొనసాగింపుగానే ద్విమిత్రి మెద్వదేవ్‌ తన ప్రభుత్వమంతా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం రష్యా ప్రధానిగా ఉన్న ద్విమిత్రి మెద్వదేవ్‌ పుతిన్‌కి కావాల్సిన వ్యక్తి కావడం, గతంలో రష్యా అధ్యక్షుడిగా ద్విమిత్రి పనిచేసినప్పుడు ఆయ న్ను వెనుకుండి నడిపించింది కూడా పుతిన్‌ కావడం గమనార్హం. కాగా, రష్యాలో జీవితకాలం ఏకఛత్రాధిపత్యం కొనసాగించేందుకే పుతిన్‌ ఈ సంస్కరణలను తెరపైకి తెచ్చారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. 

పుతిన్‌ ప్రతిపాదించిన రాజ్యాంగ సంస్కరణలివే..
1. రెండుసార్లకు మించి ఎవరూ అధ్యక్షుడిగా ఉండకూడదు. 
2. అధ్యక్ష పదవిలో ఉండేవారికి కఠిన నిబంధనలు అమలు చేయడం.. ఉదాహరణకు ద్వంద్వ పౌరసత్వం ఉండేవారిని దీనికి అనర్హులుగా చేయడం, 25 ఏళ్లపాటు రష్యాలో నివసించినవారై ఉండడం. ఇతర దేశాల్లో శాశ్వత నివాసమేర్పర్చుకున్న వారిని పోటీకి అనర్హులుగా ప్రకటించడం. 
3. అంతర్జాతీయ చట్టాల ప్రభావాన్ని తగ్గిస్తూ రష్యా రాజ్యాంగానికే ప్రాధాన్యతనివ్వడం. 
4. 2000 సంవత్సరంలో పుతిన్‌ తొలిసారి ఎన్నికైనప్పుడు అతను స్థాపించిన సలహా సంస్థ అధికారిక పాలకమండలిని బలోపేతం చేయడం. సలహామండలిగా వ్యవహరించే స్టేట్‌ కౌన్సిల్‌ (ప్రస్తుతం పుతిన్‌ దీనికి సారథ్యం వహిస్తున్నారు) పాత్రను, పరిధిని పెంచడం. 
5. చట్టసభల సభ్యులు, క్యాబినెట్‌ మినిస్టర్స్, న్యాయమూర్తులు, ఇతర అధికారులు ద్వితీయ పౌరసత్వం కలిగి ఉండకూడదు. వీరికి విదేశాల్లో శాశ్వత నివాసం ఉండరాదు.
6. రష్యా దిగువ సభ ‘స్టేట్‌ డ్యూమా’కు ప్రధానిని, మంత్రివర్గాన్ని నియమించే ప్రత్యేక కీలక బాధ్యతలు అప్పగించడం. 
7. అన్ని భద్రతా సంస్థల అధిపతులను నియమించడంలో అధ్యక్షుడి సలహాల మేరకు నిర్ణయం తీసుకునే అధికారాన్ని సెనేటర్స్‌కి అప్పగించడం. 
8. అగౌరవప్రదమైన న్యాయమూర్తులను అధ్యక్షుడి సలహా మేరకు తొలగించే అధికారాన్ని సెనేటర్లకు ఇవ్వడం. 
9. ముసాయిదా చట్టాలను ఆమోదించేముందు అధ్యక్షుడి కోరిక మేరకు వాటిని సమీక్షించే అధికారాన్ని న్యాయమూర్తులకు ఇవ్వడం. 
10. రష్యాలోని కనీస వేతనాలను దారిద్య్రరేఖకన్నా అధికంగా ఉంచడం, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఏటా పెన్షన్లను సర్దుబాటు చేయడం. 

మరిన్ని వార్తలు