కిరాతకుడికి రష్యా అధ్యక్షుడి క్షమాభిక్ష! సైనికుడిగా ఉక్రెయిన్‌ సరిహద్దుకు..

11 Nov, 2023 19:28 IST|Sakshi

ప్రియురాలిని అత్యంత కిరాతకంగా చంపిన హంతకుడికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ క్షమాభిక్ష ప్రసాదించారు. అంతేకాదు అతన్ని సైనికుడిగా ఉక్రెయిన్‌ సరిహద్దుకు పంపారు. వ్లాదిస్లావ్‌ కాన్యుస్‌ అనే వ్యక్తి తన మాజీ ప్రియురాలు వెరా పెక్తెలేవాను అత్యంత కిరాతకంగా చంపాడు. ఇందుకుగానూ అతనికి 17 ఏళ్ల శిక్ష పడగా ఇంకా సంవత్సరం కూడా పూర్తవకముందే అధ్యక్షుడు పుతిన్‌ అతనికి క్షమాభిక్ష పెట్టి వదిలేయడం చర్చనీయాంశంగా మారింది.

తనకు బ్రేకప్‌ చెప్పిందన్న కక్షతో పెక్తెలేవాను కాన్యుస్‌ అత్యాచారం చేసి, 111 సార్లు కత్తితో పొడిచి, మూడున్నర గంటల పాటు చిత్రవధ చేశాడు. ఆ తర్వాత ఆమె మెడకు కేబుల్‌ వైర్‌ బిగించి అత్యంత కిరాతకంగా హతమార్చాడని ‘ది సన్‌’ కథనం ద్వారా తెలిసింది. 

హతాశయురాలైన మృతురాలి తల్లి

మృతురాలి తల్లి ఒక్సానా.. సైనిక దుస్తులలో ఆయుధం చేతపట్టి ఉన్న హంతకుడు కాన్యుస్‌ ఫొటోలను చూసి హతాశయురాలయ్యారు.  తన కుమార్తెను అత్యంత పాశవికంగా హత్య చేసిన వ్యక్తికి క్షమాభిక్ష పెట్టి జైలు నుంచి వదిలేయడాన్ని ఆమె తీవ్రంగా ఆక్షేపించారు. అంతటి కిరాతకుడికి ఆయుధం ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఇది చాలా అన్యాయమని, తన కూతురు ఆత్మకు శాంతి చేకూరదని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఆ హంతకుడు బయట ఉంటే తమను కూడా చంపేస్తాడని ఆందళన వ్యక్తం చేశారు.

ఉక్రెయిన్ సరిహద్దులో ఉన్న దక్షిణ రష్యాలోని రోస్టోవ్‌కు కాన్యుస్‌ను బదిలీ చేసినట్లు జైలు అధికారులు ధ్రువీకరించారని మహిళా హక్కుల కార్యకర్త అలియోనా పోపోవా  తెలిపారు. ఆమె నవంబర్ 3 నాటి రష్యన్ ప్రాసిక్యూటర్ జనరల్ ఆఫీస్ నుంచి వచ్చిన ఒక లేఖను బయటపెట్టారు. కాన్యుస్‌కు క్షమాభిక్ష లభించిందని, ఏప్రిల్ 27న అధ్యక్షుడి ఆదేశాలతో అతని శిక్షను రద్దు చేసినట్లు ఆ లేఖలో ఉంది.

కాగా క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ఈ చర్యను సమర్థించారు. ఉక్రెయిన్‌లో పోరాడటానికి పంపిన రష్యన్ ఖైదీలు వారి నేరాలకు "రక్తంతో" ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారని ఆయన పేర్కొన్నట్లు ‘ఏఎఫ్‌పీ’ నివేదించింది.

మరిన్ని వార్తలు