అప్పుడు వాళ్లే..ఇప్పుడు వాళ్లే

31 Mar, 2019 12:14 IST|Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌ : ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్‌సభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల ప్రక్రియలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా పార్టీల నుంచి పోటీ చేసి ఓటమి పాలైన అభ్యర్థులు లోక్‌సభ బరిలోకి దిగి మరోసారి తమ అదృష్ట్యాన్ని పరీక్షించుకుంటున్నారు.

ప్రస్తుతం ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్‌ తరుపు నుంచి పోటీ పడుతున్న రాథోడ్‌ రమేష్‌ ఖానాపూర్‌ అసెంబ్లీకి, బీజేపీ నుంచి ఎంపీ బరిలో దిగిన సోయం బాపూరావు బోథ్‌ అసెంబ్లీకి పోటీ చేసిన విషయం తెలిసిందే. పెద్దపల్లి లోక్‌సభ బరిలోనూ టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ పడుతున్న వెంకటేష్‌ నేతకాని గత అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూర్‌ నుంచి పోటీ పడి ఓటమి చెందిన వారే.

వీరితోపాటు మరో ఐదుగురు ఇతర అభ్యర్థులు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూసిన వారుండటం గమనార్హం! మరి అసెంబ్లీ ఎన్నికలప్పుడు వీరిని వెక్కిరించిన అదృష్టం.. ఈ లోక్‌సభ ఎన్నికల్లోనైనా వరిస్తుందో లేదో వేచిచూడాలి.

ఖానాపూర్‌ నుంచి రాథోడ్‌ రమేష్‌.. 
డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్‌ అసెంబ్లీకి కాంగ్రెస్‌ అభ్యర్థిగా రాథోడ్‌ రమేష్‌ పోటీ చేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రేఖానాయక్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో మొత్తం 1,49,380 ఓట్లు పోలవగా, రాథోడ్‌ రమేష్‌కు 46,428 వచ్చాయి. రేఖానాయక్‌కు 67,138 ఓట్లు వచ్చాయి. 20,710 ఓట్ల తేడాతో రమేష్‌ రాథోడ్‌ ఓటమి చెందారు.

2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆదిలాబాద్‌ లోక్‌సభకు టీడీపీ నుంచి పోటీ చేయగా, 1.84 లక్షల ఓట్లు రావడంతో రమేష్‌ రాథోడ్‌ మూడో స్థానానికి పరిమితమయ్యారు. 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఈయనకు 3.72 లక్షల ఓట్లు వచ్చాయి. దీంతో అప్పుడు ఎంపీ అయ్యారు. దీంతో ఇప్పుడు మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

బోథ్‌ నుంచి సోయం బాపూరావు.. 
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా సోయం బాపూరావు బోథ్‌ అసెంబ్లీకి పోటీపడ్డారు. ఈ ఎన్నికల్లో 1.54 లక్షల ఓట్లు పోలవగా, సోయం బాపూరావుకు 54,639 ఓట్లు వచ్చాయి. టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసి గెలుపొందిన రాథోడ్‌ బాపూరావుకు 61,125 ఓట్లు రావడంతో ఆ ఎన్నికల్లో సోయం బాపూరావు 6,486 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో ఇదే అసెంబ్లీ స్థానానికి టీడీపీ నుంచి బరిలోకి దిగిన సోయం బాపూరావు 35,218 ఓట్లతో మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఎంపీ బరిలో దిగి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 

చెన్నూర్‌ నుంచి వెంకటేష్‌ నేతకాని.. 
చెన్నూర్‌ అసెంబ్లీకి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడిన వెంకటేష్‌ నేతకాని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బాల్క సుమన్‌ చేతిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో వెంకటేష్‌ నేతకానికి 43,848 ఓట్లు వచ్చాయి. చెన్నూర్‌ ఎమ్మెల్యేగా గెలుపొందిన బాల్క సుమన్‌కు 71,980 ఓట్లు రావడంతో 28,132 ఓట్ల తేడాతో వెంకటేష్‌ నేతకాని ఓటమి పాలయ్యారు. తద్వారా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పెద్దపల్లి ఎంపీగా పని చేసిన చెన్నూర్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ స్థానంలోకి వచ్చి లోక్‌సభకు పోటీపడుతుండటం విశేషం.

ఇతరులు కూడా.. 
2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన ఐదుగురు కూడా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. సిర్పూర్‌ నుంచి పోటీ చేసిన గంట పెంటన్నకు అప్పుడు 595 ఓట్లు వచ్చాయి. ఈయన ప్రస్తుతం ఆదిలాబాద్‌ లోక్‌సభ బరిలో ఉన్నారు. ఇటీవల ఎన్నికల్లో బెల్లంపల్లి అసెంబ్లీకి పోటీ చేసిన సబ్బని క్రిష్ణకు ఆ ఎన్నికల్లో 1812 ఓట్లు వచ్చాయి.

అదే నియోజకవర్గానికి అసెంబ్లీ బరిలో నిలిచిన అంబాల మహేందర్‌కు 706 ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో రామగుండం అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిన ఇరికిల్ల రాజేష్‌కు ఆ ఎన్నికల్లో 299 ఓట్లు వచ్చాయి. ధర్మపురి అసెంబ్లీకి పోటీ చేసిన కుంటాల నర్సయ్యకు 13,114 ఓట్లు వచ్చాయి. వీరు నలుగురు ప్రస్తుతం పెద్దపల్లి లోక్‌సభ బరిలో ఉన్నారు. 

మరిన్ని వార్తలు