పుల్వామా ఎన్‌కౌంటర్‌.. కేంద్రంపై కాంగ్రెస్‌ ఫైర్‌

1 Jan, 2018 16:53 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : యూరీ ఘటనకు ప్రతీకారంగా భారత ఆర్మీ నిర్వహించిన సర్జికల్‌ స్ట్రైక్స్‌ అంశాన్ని మళ్లీ కాంగ్రెస్‌ పార్టీ తెరపైకి తెచ్చి ఆరోపణలు గుప్పించింది. అదంతా ఓ పెద్ద డ్రామాగా అభివర్ణిస్తోంది.   పుల్వామా ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి సందీప్‌ దీక్షిత్‌ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

‘‘విజయవంతంగా సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేశామని ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధాని గర్వంగా చెప్పుకుంటున్నారు. కానీ, ఇప్పుడు జరిగిన పుల్వామా ఎన్‌కౌంటర్‌ అదంతా డ్రామాగా తేల్చేసింది. ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్‌ కట్టిడి చేసేందుకు ఈ ప్రభుత్వం చేపడుతున్న చర్యలేవీ సత్ఫలితాలను ఇవ్వటం లేదు. పైగా  పాకిస్థాన్‌ బద్ధ శత్రువంటూ ఓ వైపు ప్రకటనలు ఇస్తూ.. మరోవైపు వారితో చర్చలు, ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకుంటున్నారు.  ఇదంతా ఎందుకు? బీజేపీ హయాంలో దేశ రక్షణ ప్రశ్నార్థకంగా మారింది. ప్రజలు అభద్రతా భావంతో ఉన్నారు’’ అంటూ దీక్షిత్‌ పేర్కొన్నారు. 

కాగా, అవంతిపూర్‌ సెంటర్‌ ట్రైనింగ్‌ వద్ద శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు జవాన్లు అమరులు కాగా, ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు దాగున్నారేమోనన్న అనుమానంతో తనిఖీలు చేపట్టినట్లు సీఆర్‌పీఎఫ్‌ స్పెషల్‌ డీజీ ఎస్‌ఎన్‌ శ్రీవాస్తవ తెలిపారు.  

>
మరిన్ని వార్తలు