మాజీ మంత్రికి పెద్దపల్లి ఎంపీ టికెట్‌!

17 Dec, 2023 15:24 IST|Sakshi

సాక్షి, పెద్దపల్లి: ఆ మాజీ మంత్రి ఆరుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఏడోసారి ఓడిపోయారు. త్వరలోనే లోక్‌సభ ఎన్నికలు రాబోతున్నాయి. ఇక ఇప్పుడు పెద్దపల్లి ఎంపీ సీటుపై కన్నేశారట ఆ మాజీ మంత్రి. మరి గులాబీ బాస్‌ ఆయనకు క్లియరెన్స్ ఇచ్చేశారా? మాజీ మంత్రికి కాదంటే పెద్దపల్లి బీఆర్‌ఎస్ అభ్యర్థి ఎవరు? అసలు అక్కడ నుంచి పోటీ చేయడానికి పోటీ పడుతున్న నేతలెవరు? 

పెద్దపెల్లి ఎంపీ సీటుకు గులాబీ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేరు తెరపైకొస్తోంది. సౌమ్యుడిగా, సీనియర్ నాయకుడిగా పేరున్న ఈశ్వర్ అయితేనే పెద్దపల్లి సీటు కచ్చితంగా గులాబీ పార్టీకి దక్కుతుందని పార్టీ అధినేత ఆలోచిస్తున్నాట్లు చెబుతున్నారు. ధర్మపురి నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఓటమిపాలైన ఈశ్వర్ ను ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించాలని అధిష్ఠానం గట్టి పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీగా వెంకటేశ్ నేతకాని ఉండగా.. చెన్నూరు అసెంబ్లీ బరిలో ఓటమిపాలైన బాల్కసుమన్ పేరు కూడా ప్రచారంలో ఉంది.

అయితే, వీరిద్దరి కంటే కూడా బెస్ట్ ఛాయిస్ గా గులాబీ బాస్ మాత్రం కొప్పుల ఈశ్వర్ అయితేనే బెటరని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా పెద్దపెల్లి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో పెద్దఎత్తున సింగరేణి కార్మికుల ఓట్లుండటం... ఆయా ప్రాంతాలన్నింటా ఈశ్వర్ కు పట్టుండటంతో పాటు.. ధర్మపురి నుంచి ఆరుసార్లు గెలిచి ఏడోసారి ఓటమిపాలైన కొప్పులను రాజకీయంగా ఉపయోగించుకోవాలంటే కచ్చితంగా పెద్దపెల్లి పార్లమెంట్ బరిలో నిలపాల్సిందేనని పార్టీ అగ్ర నాయకులంతా ఆలోచిస్తున్నట్టుగా సమాచారం.

ఈశ్వర్‌ను పెద్దపల్లి లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దింపాలని గులాబీ అధిష్ఠానం యోచిస్తుంటే... యవనేతగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కుమారుడు.. వంశీని బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ యోచిస్తున్నట్టుగా సమాచారం. బీజేపీ నుంచి ఎస్ కుమార్ పేరు వినిపిస్తోంది. అయితే, బీజేపీ నుంచి ఈసారి కొత్త ముఖాన్ని పెద్దపెల్లి పార్లమెంట్ బరిలో దింపే అవకాశాలూ లేకపోలేదని..ఇప్పటికే ఎస్. కుమార్‌ను ధర్మపురి అసెంబ్లీ బరిలో నిలిపినందున ఆయనకు అవకాశం దక్కకపోవచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది.

ఇంకోవైపు కాశిపేట లింగయ్య వంటివారు కూడా ప్రయత్నాలు చేస్తుండగా.. ఆయన్ను కమలం పార్టీ అధిష్ఠానం యాక్సెప్ట్ చేస్తుందో, లేదోనన్న భావన కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి ఎవరైనా బలమైన నేత వస్తే తప్ప.. ఇప్పటికైతే ప్రచారం జరుగుతున్నట్టుగా బీఆర్ఎస్ నుంచి అనుభవజ్ఞుడైన కొప్పుల ఈశ్వర్.. కాంగ్రెస్ నుంచి యువకుడైన వంశీ గనుక బరిలోకి దిగితే.. ఈ ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ కు తెర లేవనుంది.

మొత్తంమీద అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయో లేదో.. అప్పుడే వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో చర్చలు ఊపందుకున్నాయి. పొల్టీషియన్స్ అంతా ఎవరి ప్లాన్లల్లో వారు పడ్డారు. అలాగే పార్టీలు కూడా ఏ అభ్యర్థైతే బెటర్.. ఎవరైతే ప్లస్.. ఎవరైతే మైనస్ అనే లెక్కలు వేసుకుంటున్నాయి. 

ఇదీచదవండి..గవర్నర్ ప్రసంగంలో అసలు విషయం ఇదేనా?

>
మరిన్ని వార్తలు