TS: గవర్నర్ ప్రసంగంలో అసలు విషయం ఇదేనా?

17 Dec, 2023 13:00 IST|Sakshi

తెలంగాణ గవర్నర్ తమిళసై శాసనసభలో చేసిన ప్రసంగం పరిశీలిస్తే కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత భయం, భయంగా నడక ప్రారంభించిందన్నది అర్ధం అవుతుంది. తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి గొప్ప అవకాశం వచ్చినప్పటికీ, మున్ముందు ఎదుర్కోబోయే కష్టాలు కూడా అంతర్లీనంగా ఈ ప్రసంగంలో కనిపిస్తాయి. ఆ విషయాలు నేరుగా గవర్నర్ ప్రసంగం ద్వారా చెప్పించకపోయినా, ఉపన్యాస సరళిని గమనిస్తే ఆ భావం కలుగుతుంది. ఇంతకాలంగా అధికారంలో ఉన్న కేసీఆర్ పాలనను నిర్భంధ పాలనగా, నియంతృత్వ పాలనగా సహజంగానే విమర్శిస్తారు. దానికి కొంతమేర కేసీఆర్ అవకాశం ఇచ్చారని చెప్పకతప్పదు. అలాగే ఆయన చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతిన్న విషయంలో విచారణ కొనసాగుతుందని గవర్నర్ వెల్లడించారు.

ఇది బీఆర్ఎస్‌కు ఎంబరాస్‌మెంట్ కలిగించే అంశమే అవుతుంది. కాంగ్రెస్ పార్టీ తాను ఇచ్చిన హామీలన్నిటిని నెరవేర్చడం కష్టం అయినప్పుడు ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ కు ఇబ్బందిగా ఉండే విషయాలను తెరపైకి తెచ్చే అవకాశం ఉంటుంది. రాజకీయ పార్టీలు అలా వ్యవహరించడం సహజమే. ప్రజలు తమ కష్టాలు చెప్పుకోవడానికి వీలుగా ప్రజావాణి కార్యక్రమం ప్రారంభించామని ఈ స్పీచ్‌లో తెలిపారు. ప్రస్తుత వాతావరణం గమనిస్తే వేల సంఖ్యలో ముఖ్యమంత్రిని కలవడానికి వచ్చి తమ వినతులు అందిస్తున్నారు. వాటన్నిటిని పరిష్కరించడం అంత తేలికకాదు. వాటిలో ఎక్కువగా వ్యక్తిగత సమస్యలే ఉండవచ్చు. వాటిని ఏమి చేయాలన్నదానిపై ఒక విధానం తీసుకోవలసి ఉంటుంది. లేకుంటే ఆ వినతులు ఇచ్చినవారిలో అసంతృప్తి పెరిగే అవకాశం ఉంటుంది. 

ఇందిరమ్మ రాజ్యం తెస్తామని హామీ ఇచ్చామని, నిర్భంధాలు, నియంతృత్వ ధోరణులు ఉండవని ప్రభుత్వం భరోసా ఇవ్వడం బాగానే ఉంది. కాకపోతే ఇందిరమ్మ  ఎమర్జెన్సీ తెచ్చి దేశాన్ని నియంతగానే పాలించారన్న సంగతి గుర్తుకు వస్తుంటుంది. అయినా ప్రజలకు పూర్థి స్వేచ్ఛ ఇస్తామని రేవంత్ ప్రభుత్వం ప్రకటించడం ముదావహమని చెప్పాలి.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల గురించి ప్రస్తావిస్తూ ప్రభుత్వం చేపట్టిన 48 గంటలలో రెండు హామీలను నెరవేర్చడం  రేవంత్ రెడ్డి చిత్తశుద్దికి నిదర్శనమని తెలిపారు. అంతవరకు ఓకే. అవి రెండు తేలికగా అయ్యేవి కనుక చేశారు. అందులో కూడా ఇబ్బందులు లేకపోలేదు. ఆర్టీసీ బస్ లలో మహిళలకు ఉచిత ప్రయాణం హామీని నెరవేర్చింది వాస్తవమే.

కాని దీనివల్ల ఆర్టీసీకి కలిగే నష్టాన్ని ఎలా భర్తీ చేసేది కూడా ప్రభుత్వం చెప్పగలిగి ఉంటే బాగుండేది. ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఈ నష్టం మేరకు మొత్తాన్ని ఆర్టిసికి చెల్లిస్తుందా?లేక దానిని మరింత నష్టాలలోకి నెడుతుందా అన్నది చూడాలి. ఈ హామీ అమలు వల్ల వేలాది మంది ఆటోవాలాలు, క్యాబ్ ల వారు ఉపాధి కోల్పోతున్నారన్న విషయం బాగా ప్రచారం అవుతోంది. దీనిని ఎలా పరిష్కరిస్తారో ఆలోచించాలి. మరో హామీ పది లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీని పెంచుతున్నట్లు ప్రకటించారు. దీనివల్ల ఇప్పటికప్పుడు ప్రభుత్వం మీద పడే ఆర్ధిక భారం పెద్దగా ఉండదు. కాని ఎంతో కొంత బడ్జెట్ పెంచవలసి ఉంటుంది. దాని సంగతి ఏమి చేస్తారో తెలియదు.మిగిలిన హామీలు మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసా ఇందిరమ్మ ఇళ్లు మొదలైన గ్యారంటీల పేర్లు ప్రస్తావించి వంద రోజుల కార్యాచరణ అన్నారు తప్ప వాటి వివరాల జోలికి వెళ్లినట్లు కనిపించలేదు.ఇక్కడే వారిలో భయం ఏర్పడిందన్న విషయం అర్ధం అవుతుంది.  

మహాలక్ష్మి స్కీమ్ కింద ప్రతి మహిళకు 2500 రూపాయల ఆర్ధిక సాయం, గృహజ్యోతి కింద ఇంటికి 200 యూనిట్ల విద్యుత్ ఉచితం,రైతు భరోసా కింద పదహారువేల సాయం, ఇందిరమ్మ ఇళ్లకు ఐదు లక్షల సహాయం వంటివాటిని అమలు చేయవలసి ఉంది. వీటన్నిటికి అయ్యే వ్యయం అంచనా వేస్తే కనీసం ఏభైవేల కోట్ల వరకైనా ఉండవచ్చన్నది ఒక అబిప్రాయం. కాని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ అంచనా వేసిన ప్రకారం లక్ష కోట్లు అవసరం అవుతాయి. ఆ డబ్బు ఎలా వస్తుందన్నది మున్ముందు రోజుల్లో చెబుతారేమో చూడాలి. ఇవి కాకుండా  ఆయా డిక్లరేషన్లు ఉండనే ఉన్నాయి. ఉదాహరణకు దళిత బంధు కింద పన్నెండు లక్షల రూపాయల సాయం ఇస్తామని హామీ ఇచ్చారు. దాని ఊసేమీ ఎత్తలేదు. నిరుద్యోగ భృతి ప్రస్తావన లేదు. గత ప్రభుత్వం అమలు చేయాలనుకున్న రైతు భరోసా ఆగిపోయినప్పుడు రేవంత్ రెడ్డి ఒక హామీ ఇస్తూ, తాము అధికారంలోకి రాగానే పదిహేనువేల చొప్పున ఇస్తామని చెప్పారు. దాని సంగతి కూడా చెప్పినట్లు లేదు. 

ఆరు గ్యారంటీలను మొదటి క్యాబినెట్ లోనే ఆమోదిస్తామని అప్పట్లో రాహుల్ గాంధీ చెబుతుండేవారు. ఆ ప్రకారం మంత్రివర్గం ఆమోదించినా, ఆ తర్వాత ప్రక్రియ ఏమిటో  ప్రభుత్వం వివరించలేదు. మరో వైపు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదని, విద్యుత్ సంస్థలు 81 వేల కోట్ల అప్పుల్లో ఉన్నాయని,పౌర సరఫరా సంస్థ 56వేల కోట్ల అప్పుల్లో ఉందని ప్రభుత్వం గవర్నర్ ప్రసంగం ద్వారా వెల్లడించింది. మంత్రులు కూడా ఈ విషయాలను మీడియాకు చెబుతున్నారు. నిజానికి ఈ పరిస్థితి గురించి ఎన్నికల ముందు కూడా వీరికి తెలుసు. అయినా ఈ వాగ్దానాలు చేశారంటే, పదేళ్లుగా అధికారం లేక అల్లాడుతున్న కాంగ్రెస్ ను ఎలాగైనా పవర్ లోకి తీసుకురావాలన్న ఆకాంక్ష తప్ప మరొకటి కాదు.రెండు లక్షల రుణమాఫీపై కార్యాచరణ చేపడతామని కూడా ఈ స్పీచ్ లో పేర్కొన్నారు. 

ఇది కూడా అంత తేలిక కాకపోవచ్చు.మెగా డిఎస్సి ద్వారా టీచర్ల పోస్టులను భర్తీ చేస్తామని కూడా గవర్నర్ పేర్కొన్నారు. నిజంగానే ఆరు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయగలిగితే రేవంత్ ప్రభుత్వానికి మంచి క్రెడిట్టే వస్తుంది. ధరణి పోర్టల్ బదులు భూ మాత పోర్టల్ తెస్తామన్న హామీని కూడా ప్రస్తావించారు. మళ్లీ దీనివల్ల రైతులకు కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్తపడితే మంచిది.గత ప్రభుత్వం మాదిరే మూసి నది ప్రక్షాళన చేస్తామని ఈ ప్రభుత్వం కూడా వెల్లడించింది. దానికి తోడు మూసి నదీ పరివాహక ప్రాంతాన్ని ఉపాధికల్పన జోన్ చేస్తామని అంటున్నారు. అది ఎలా జరుగుతుందో వేచి చూడాలి.గత ప్రభుత్వం గ్రామ పంచాయతీలను ప్రచారానికి మాత్రమే వాడుకుందని, తదితర విమర్శలు కూడా ఈ స్పీచ్ లో ఉన్నాయి.రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితులపై   శ్వేతపత్రాల విడుదలకు రంగం సిద్దం చేసుకుంటున్నారు.

కాని ప్రజలకు కావల్సింది శ్వేతపత్రాలు కాదుకదా! చేసిన వాగ్దానాలను నెరవేర్చడం కదా! అన్న వ్యాఖ్యలు ప్రతిపక్షం నుంచి వస్తాయి. గత ప్రభుత్వంపై నెపం నెట్టి కాలయాపన చేయడానికి ఇవి పాతరోజులు కాదన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఇది రాచరికం కాదు.. ప్రజాస్వామ్యం అన్న విశ్వాసాన్ని ప్రజలలో కల్పిస్తామని చెప్పడం మంచి విషయమే. తమ ప్రభుత్వం మాటలకన్నా చేతలనే నమ్ముకుందని, మార్పును మీరు చూస్తారని ప్రజలకు ఒక భరోసా ఇవ్వడానికి రేవంత్ ప్రభుత్వం ప్రయత్నించింది. ఒకరకంగా చూస్తే ఇది ఆశలు కల్పించి,వాటిని నెరవేర్చడానికి యత్నించే  ప్రభుత్వంగా కనిపిస్తుంది.మరో రకంగా చూస్తే ఇచ్చిన  హామీలను అమలు చేయడంలో ఉన్న ఇబ్బందులను పరోక్షంగా ప్రస్తావిస్తూ భయం,భయంగా సాగే ప్రభుత్వం అన్న అభిప్రాయం కలుగుతుంది.


-కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్

>
మరిన్ని వార్తలు