మరో 25 ఏళ్లు సీఎం పీఠం మాదే: శివసేన

15 Nov, 2019 17:58 IST|Sakshi

ముంబై : మహారాష్ట్రలో మరో ఇరవై ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రి పీఠం తమదేనని శివసేన రాజ్యసభ ఎంపీ సంజయ్‌ రౌత్‌ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కనీస ఉమ్మడి కార్యక్రమానికి(కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రాం) అంగీకరించినట్లు స్పష్టం చేశారు. గత మూడువారాలుగా మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభనకు తెరదించుతూ శివసేన, కాంగ్రెస్‌ పార్టీ, ఎన్సీపీ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహా రాజకీయాల్లో వివాదానికి కారణమైన సీఎం పదవిని శివసేనకు అప్పగించేందుకు మిగిలిన రెండు పార్టీలు సుముఖత వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌కు స్పీకర్ పదవి, ఎన్సీపీకి మండలి చైర్మన్‌ పదవి దక్కేలా ఒప్పందం కుదిరింది.

ఈ నేపథ్యంలో శివసేన ముఖ్యనేత, ఎంపీ సంజయ్‌ రౌత్‌ మాట్లాడుతూ.. ‘రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం. కరువు నివారణకై చర్యలు తీసుకోవడం, మౌలిక సదుపాయాల కల్పన, వరదల కారణంగా ఏర్పడ్డ ఇబ్బందులను తొలగించేందుకు రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు అత్యవసరం. మాతో కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చిన వారు పాలనలో ఎంతో అనుభవం కలిగినవారు. వారి సహకారంతో మేం ముందుకు సాగుతాం’ అని స్పష్టం చేశారు.

అదే విధంగా పదవుల పంపకంపై విలేకరుల ప్రశ్నకు బదులుగా... ఆ విషయంపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఐదేళ్లే కాదు ఏకంగా 25 ఏళ్లు మహారాష్ట్ర సీఎం పీఠంపై శివసేన నాయకులే కూర్చుంటారని వ్యాఖ్యానించారు. తమ పార్టీ అధినేత ఉద్ధవ్‌ ఠాక్రేకు సొంతంగా నిర్ణయాలు తీసుకోగల సత్తా ఉందని... తమను ఆపే శక్తి ఎవరికీ లేదని పేర్కొన్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో తమకు 50 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకొచ్చారు. ఇక రాజకీయంగా బద్ధశత్రువుగా భావించే కాంగ్రెస్‌ పార్టీతో మైత్రి గురించి మాట్లాడుతూ... కురువృద్ధ పార్టీగా చరిత్రకెక్కిన కాంగ్రెస్‌ పార్టీలోని నాయకులు దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన విషయాన్ని మర్చిపోవద్దన్నారు. అదేవిధంగా మహారాష్ట్ర అభివృద్ధిలో కూడా వారి పాత్ర ఉందన్నారు.(చదవండి : లైన్ క్లియర్.. శివసేనకే సీఎం పీఠం)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా