నెహ్రూను తగ్గించాలని కాదు

19 Apr, 2019 04:22 IST|Sakshi

నెహ్రూకు బదులు సర్దార్‌ పటేల్‌ విగ్రహం ఏర్పాటుపై మోదీ వ్యాఖ్య

గుజరాత్, కర్ణాటకలో ప్రచారం

సాక్షి, బళ్లారి/అమ్రేలీ/బాగల్‌కోట: భారత తొలిప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రాధాన్యతను తగ్గించేందుకు సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ విగ్రహాన్ని నిర్మించలేదని ప్రధాని మోదీ తెలిపారు. సర్దార్‌ పటేల్‌ తమ నాయకుడని చెప్పుకునే కాంగ్రెస్‌ నేతలు, గుజరాత్‌లో నర్మదా నదీతీరాన నిర్మించిన పటేల్‌ విగ్రహం ‘స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ’ని ఇప్పటివరకూ ఎందుకు సందర్శించలేదని ప్రశ్నించారు.సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించిన మోదీ కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు.

కశ్మీర్‌లో 75 శాతం పోలింగ్‌..
గతంలో పుణే, అహ్మదాబాద్, జమ్మూలో తరచూ బాంబు పేలుళ్లు జరిగేవి. కానీ గత ఐదేళ్లలో ఒక్క బాంబు దాడి జరిగినట్లైనా మీరు విన్నారా?  కశ్మీర్‌లో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 75 శాతం పోలింగ్‌ నమోదైంది. ఈ సందర్భంగా ఒక్క హింసాత్మక ఘటన జరగలేదు. నేను పటేల్‌ విగ్రహాన్ని నెహ్రూను తక్కువ చేయడానికి నిర్మించలేదు. పటేల్‌ విగ్రహం ఎంత ఎత్తుగా ఉందంటే, మీరు(కాంగ్రెస్‌ నేతలు) ఇకపై ఇతరులను తక్కువ చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు’ అని అన్నారు.  

గుజరాత్‌ నన్ను దృఢంగా మార్చింది
2017లో చైనాతో డోక్లామ్‌ ఉద్రిక్తత సందర్భంగా కటువుగా, దృఢంగా వ్యవహరించేలా గుజరాత్‌ నన్ను తయారుచేసింది. గుజరాత్‌ ప్రజలు నాలో నైతిక విలువలను పెంపొందింపజేశారు. ఇందుకు నేను కృతజ్ఞతలు చెబుతున్నా. దేశద్రోహ చట్టాన్ని రద్దు చేస్తామనీ, కశ్మీర్‌లో సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని (అఫ్సా) తొలగిస్తామని కాంగ్రెస్‌ చెబుతోంది. అదే జరిగితే అమర్‌నాథ్‌ యాత్రికులను ఉగ్రవాదులు చంపేయరా? వైష్ణోదేవి ఆలయాన్ని భక్తులు ప్రశాంతంగా దర్శించుకోగలరా?’’ అని ప్రశ్నించారు.

కేంద్రంలో మరోసారి బలమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని మోదీ కర్ణాటక ప్రజలకు పిలుపునిచ్చారు. బాగల్‌కోట, ఛిక్కొడి, బెళగావిల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో మోదీ మాట్లాడుతూ..‘కేంద్రంలో కాంగ్రెస్‌ బలహీన, నిస్సహాయ ప్రధానిని నియమించాలని అనుకుంటోంది. బలమైన ప్రభుత్వం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఢిల్లీ(కేంద్రం) వైపు చూడండి. బలహీనమైన ప్రభుత్వం ఎలా ఉంటుందంటే బెంగళూరువైపు చూడండి’ అని తెలిపారు.
ఆమ్రేలీలో పార్లమెంటు భవంతి ఆకృతిలో జ్ఞాపికను అందుకుంటున్న ప్రధాని మోదీ

మరిన్ని వార్తలు