సీఎం రేసులో లేను: షబ్బీర్‌

11 May, 2018 00:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తాను ముఖ్యమంత్రి రేసులో లేనని, తనకు ఎలాంటి తోకలు లేవని మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ వ్యాఖ్యానించారు. ముకద్దర్‌ కా సికందర్‌ (ముఖ్యమంత్రి)ను కాంగ్రెస్‌ పార్టీ అధినేత రాహుల్‌గాంధీనే నిర్ణయిస్తారని చెప్పారు.

గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తనకున్న సమాచారం మేరకు ఇందిరమ్మ ఇళ్ల ఫైలును ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన దగ్గర పెట్టుకున్నారని, అయినా ఆ విషయంలో అప్పటి మంత్రులకు ఆర్థిక ప్రమేయం ఏముంటుందని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నేతలపై అక్రమ కేసులు పెడితే ఊరుకునేది లేదని షబ్బీర్‌ అలీ హెచ్చరించారు. కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన బస్సుయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వస్తోందన్నారు.  

వెబ్‌సైట్‌పై జానారెడ్డి ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే గెలుపంటూ తాను వ్యాఖ్యలు చేసినట్లుగా ఓ వెబ్‌సైట్‌లో వచ్చిన వార్తలను సీఎల్పీ నేత జానారెడ్డి ఖండించారు. ఇది తనపై బురద చల్లడానికి, ప్రతిష్టకు భంగం కలిగించడానికి చేస్తున్న కుట్ర అని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సదరు వెబ్‌సైట్‌ వెనుక ఉన్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని సైబర్‌క్రైమ్‌కు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.

‘రైతుబంధు’ సొమ్ము మృతు లైన రైతులకు..: కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్‌: రైతుబంధు పథకం కింద తనకు వచ్చే దాదాపు రూ.రెండు లక్షలతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు సాయం చేస్తానని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత పెట్టుబడి సాయం అవసరం లేని ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. భూస్వాములు, వ్యాపారవేత్తలు, వివిధ వృత్తులలో ఉండి ఆర్థికంగా స్థిరపడిన వారంతా రైతుబంధు ద్వారా వచ్చే డబ్బులు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు అందజేసి వారిని ఆదుకోవాలని కోరారు.  

మరిన్ని వార్తలు