శరద్‌ యాదవ్‌ మాటలు సిగ్గుచేటు

8 Dec, 2018 05:31 IST|Sakshi

జైపూర్‌: ఎన్నికల ప్రచారంలో తన శరీరాకృతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన లోక్‌తాంత్రిక్‌ జనతాదళ్‌ అధినేత శరద్‌ యాదవ్‌పై చర్యలు తీసుకోవాలని రాజస్తాన్‌ ముఖ్యమంత్రి వసుంధరరాజే ఎన్నికల సంఘాన్ని కోరారు. రాజస్తాన్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి రోజు అయిన బుధవారం శరద్‌యాదవ్‌ మాట్లాడుతూ ‘రాజే చాలా లావై పోయారు, ప్రజలు ఆమెకు విశ్రాంతి ఇవ్వాల్సిన అవసరం ఉంది’ అని వ్యాఖ్యానించారు. ‘ఇది నాకు అవమానంగా అనిపించింది. నిజానికి ఇది మహిళా జాతికే అవమానం, ఆయన మాటలతో నేను నిశ్చేష్టురాలినయ్యాను.

ఒక అనుభవమున్న సీనియర్‌ నేత నుంచి ఇలాంటి విమర్శలు ఎంతమాత్రం ఊహించలేదు’ అని ఆమె ఝలావర్‌లో విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. ఎన్నికల సంఘం దీనిపై దృష్టిసారించాలి. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని ఆమె కోరారు. శరద్‌ యాదవ్‌ మాట్లాడినట్లుగా చెబుతున్న ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ప్రసారం కావడంతో ప్రజల నుంచి కూడా ఆయన మాటలపట్ల వ్యతిరేకత వ్యక్తమైంది. ‘మొదట్లో ఆమె నాజూకుగా ఉంది. ఇప్పుడు విపరీతంగా లావైపోయింది. ప్రజలు ఆమెకు విశ్రాంతినిస్తే బావుంటుంది’’ అని అన్నట్లుగా ఆ వీడియోలో ఉంది. ఈ వీడియో ఓటింగ్‌పై గణనీయమైన  ప్రభావం చూపించే అవకాశం ఉంది. డిసెంబర్‌ 11న జరిగే ఓట్ల లెక్కింపులో ఈ ప్రభావం ఎంతన్నది తేలనుంది.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు