‘ప్రతిపక్ష నేతలపై అనుచిత పోస్టులు పెట్టినా చర్యలు తప్పవు’

8 Nov, 2023 16:51 IST|Sakshi

సాక్షి, విజయవాడ: సోషల్‌ మీడియాలో అనుచిత పోస్టుల వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది నేర దర్యాప్తు సంస్థ(Crime Investigation Department..సీఐడీ). ఈ క్రమంలో ఎవరి మీద పోస్టులు చేసినా వదలబోమని తాజాగా హెచ్చరించింది. సోషల్‌ మీడియాలో అనుచిత పోస్టుల అంశంపై దృష్టి సారించామని, నిబంధనల్ని ఎవరు ఉల్లంఘించినా చర్యలు తప్పవని ఏపీ సీఐడీ చీఫ్‌ సంజయ్‌ హెచ్చరించారు.

‘‘సీఎంపై, వారి కుటుంబసభ్యులపైనా అనుచిత పోస్టులు పెడుతున్నారు. మారుపేర్లతో పెడితే ఎవరికీ తెలీదని అనుకోవడం పొరపాటు. ఫేక్‌ అకౌంట్స్‌ను పట్టుకోలేమని అనుకోవడం సరికాదు. ఫేక్‌ అకౌంట్స్‌ను నడిపే వారిని పట్టుకుని చర్యలు తీసుకుంటాం. ఇలాంటి వారిని ప్రోత్సహించే వారిపైనా కఠిన చర్యలుంటాయి. హైకోర్టు జడ్జిలపైనా అనుచిత పోస్టులు పెడుతున్నారు. ఇటీవల మహిళా జడ్జిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంశంపైనా దృష్టిపెట్టాం’’ అని  ఏపీ సీఐడీ చీఫ్‌ సంజయ్‌ పేర్కొన్నారు.

బుధవారం ఏపీ సీఐడీ చీఫ్‌ సంజయ్‌ విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ మధ్య కాలంలో మంత్రులపైనా అనుచిత పోస్టులు పెడుతున్నారు. మహిళా నేతలపైనా అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి అనుచిత పోస్టులు పెట్టినవారిపై కచ్చితంగా చర్యలుంటాయి.

అలాగే ప్రతిపక్ష నేతలపైనా సోషల్‌ మీడియాలో పెడుతున్న పోస్టులను పరిశీలిస్తున్నాం. ఎవరి మీద అయినా సరే సోషల్‌ మీడియాలో అనుచిత పోస్టులు చేస్తే చూస్తూ ఊరుకోం. కఠిన చర్యలు మాత్రం తప్పవు అని స్పష్టం చేశారాయన. 

సోషల్‌ మీడియాను చాలా మంది దుర్వినియోగం చేస్తున్నారు. సోషల్‌ మీడియాను పాజిటివ్‌గా ఉపయోగించుకోవాలి. దీనిపై మరింత అవగాహన కల్పించాలని భావిస్తున్నాం అని సంజయ్‌ తెలిపారు.
చదవండి: తుస్సుమనిపించిన పవన్‌.. ఎందుకంత వణుకు? 

గత ఏడాది 1450 పోస్టులు.. ఈ ఏడాది 2164 సోషల్ మీడియాలో వచ్చిన అభ్యంతర మెసేజ్‌లను తొలగించాం. న్యాయ వ్యవస్ధపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే వీరి ఆస్తులు సీజ్ చేయడానికి వెనకాడం. ప్రతిపక్షాలపై అసభ్యకర పోస్టులపై కూడా కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఈ‌ విధంగా 45 తప్పుడు పోస్టులని గుర్తించాం. ఇతర దేశాలలో ఉండి అశ్లీల, అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై కేసులు నమోదు చేస్తాం. ఆయా దేశాల ఎంబసీతో సంప్రదింపులకు సీఐడీ ప్రత్యేక బృందాలు పంపించాం. యూకే, అమెరికా దేశాలకు సీఐడీ బృందాలు పంపాం. ఇప్పటికే 45 కేసుల్లో ఐదుగురిపై ఎల్‌వోసీ ప్రోసీడింగ్స్ చేపట్టాం. రాజకీయ పార్టీలపై ఉన్న అభిమానంతో అసభ్యకరపోస్టులు పెట్టి భవిష్యత్‌ను అంధకారం చేసుకోవద్దు’’ అని సీఐడీ సూచించింది.

సోషల్ మీడియా అకౌంట్స్‌ను వ్యక్తిగత దూషణలకు వినియోగించొద్దు. హైకోర్టు న్యాయమూర్తిపై అనుచిత పోస్టింగ్‌లు 19 మందికి నోటీసులు ఇచ్చాం. ఇందులో బుద్దా వెంకన్న కూడా ఉన్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేరు మీద గోరంట్ల రామ్ అకౌంట్ నడుపుతున్నారు. ఆయనకు నోటీసులు ఇచ్చాం. సోషల్ మీడియాలో అసభ్యకర మెసేజ్‌లు పెట్టే 2,972 మందిపై సైబర్ బుల్లియింగ్ షీట్స్ ఓపెన్ చేశాం. సీఎం, ఆయన కుటుంబ సభ్యులని ఉద్దేశించి అసభ్యకర పోస్టులు పెడుతున్న అకౌంట్లని గుర్తించాం. సోషల్ మీడియా పేరుతో పరిధి దాటి అసభ్యకరమెసేజ్‌లు పెడితే కఠినంగా వ్యవహరిస్తాం’’ ఏపీ సీఐడీ స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలు