ప్రణబ్‌ కుమార్తెకు కీలక బాధ్యతలు

9 Sep, 2019 20:26 IST|Sakshi

న్యూఢిల్లీ : జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ వాదనను బలంగా వినిపించేదుకు ఆ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్‌ జాతీయ అధికార ప్రతినిధులుగా శర్మిష్ట ముఖర్జీ, అన్షుల్‌ మీరా కుమార్‌లను నియమించింది. వీరి నియామకానికి కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమోద ముద్ర వేశారు. వీరిలో షర్మిష్ట మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కుమార్తె కాగా, అన్షుల్‌ లోక్‌సభ మాజీ స్పీకర్‌  మీరా కుమార్‌ తనయుడు అన్న సంగతి విదితమే. కాగా, తొలుత ఢిల్లీ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధిగా ఉన్న షర్మిష్ట.. ఆ తర్వాత ఢిల్లీ మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. తాజాగా తనను కాంగ్రెస్‌ జాతీయ అధికార ప్రతినిధిగా నియమించడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. అలాగే సోనియాకు కృతజ్ఞతలు తెలిపిన శర్మిష్ట.. అన్షుల్‌కు అభినందనలు తెలియజేశారు. 

కాగా, లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాభవం తరువాత పలువురు కాంగ్రెస్‌ జాతీయ అధికార ప్రతినిధులు తమ పదవుల నుంచి వైదొలగారు. అలాగే లోక్‌సభ ఫలితాలు వెలువడిన తరువాత.. నెల రోజులపాటు తమ పార్టీ నుంచి టీవీ డిబెట్లకు ఎవరిని పంపడం లేదని కాంగ్రెస్‌ ప్రకటించింది. అయితే సోనియా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పార్టీలో పలు కీలక నియామకాలు చేపడుతున్నారు. ఇటీవలే హర్యానా కాంగ్రెస్‌కు కొత్త సారథిగా కేంద్ర మాజీ మంత్రి కుమారి సెల్జాను నియమించిన సంగతి తెలిసిందే. 

>
మరిన్ని వార్తలు