తేలని శాఖలు

9 Dec, 2023 05:24 IST|Sakshi

ఢిల్లీలో ఖర్గే, రాహుల్, కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్‌ భేటీ 

శుక్రవారం అర్ధరాత్రి వరకు చర్చోపచర్చలు 

ఎవరికి ఏ శాఖ అనే అంశంపై నేడు స్పష్టత! 

ఎంపీ పదవికి రేవంత్‌ రాజీనామా 
కొడంగల్‌ ఎమ్మెల్యేగా విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌రెడ్డి, తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. మల్కాజిగిరి పార్లమెంటు నియోజక వర్గం నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఉన్న ఆయన, స్పీకర్‌ ఓం బిర్లాను కలిసి తన రాజీనామా సమర్పించారు. 

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణ స్వీ కారం చేసిన నేతలకు శాఖల కేటాయింపుపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. శుక్రవారం ఈ అంశంపై స్పష్టత వస్తుందని భావించినా ఏమీ తేల్లేదు. ఈ అంశంపై చర్చించేందుకు ఢిల్లీ కి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైకమాండ్‌ పెద్దలతో భేటీ కావాల్సి ఉన్నప్పటికీ వా రంతా బిజీ బిజీగా ఉన్నారు.

ఇటీవల ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌ ఎన్నికల ఫలితాలపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ రోజంతా సమీక్షల్లో పాల్గొన్నారు. దీంతో పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో రేవంత్‌ దాదాపు రెండు గంటల సేపు భేటీ అయి శాఖల కేటాయింపుపై చర్చించారు. హోం, ఆరిక్థ, రెవెన్యూ, వైద్యం, మునిసిపల్, విద్యుత్, నీటిపారుదల వంటి కీలక శాఖల కేటాయింపుపై సీనియర్ల నుంచి వస్తున్న వినతులపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. గతంలో మంత్రులుగా పనిచేసిన సీనియర్లకే కీలక శాఖలు ఇవ్వాలని ఈ భేటీలో నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీనియర్‌ మంత్రులు

ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు వంటి సీనియర్లకు కీలక శాఖలు ఇవ్వాలని, వారి సేవలను వినియోగించుకోవాలని కేసీ సూచించినట్లు సమాచారం. అయితే ఎవరికి ఏ శాఖ ఇచ్చేలా నిర్ణయం జరిగిందన్న విషయం బయటకు రాలేదు. కాగా ఈ భేటీ అనంతరం కేసీ, ఠాక్రే, రేవంత్‌ కలిసి ఖర్గే నివాసానికి వెళ్లారు.

కాసేపటి తర్వాత రాహుల్‌ కూడా వారితో చేరారు. అర్ధరాత్రి వరకు చర్చలు కొనసాగాయి. శనివారం ఉదయానికి ఈ అంశంపై స్పష్టత వస్తుందని తెలుస్తోంది. ఇక మిగిలిన ఎమ్మెల్యేలలో ఎవరికి మంత్రివర్గంలో చోటు కల్పించాలి? అనే దానిపై మరోసారి చర్చిద్దామని వేణుగోపాల్‌ సూచించడంతో దీనిపై నిర్ణయాన్ని పెండింగ్‌లో పెట్టినట్లు సమాచారం.

>
మరిన్ని వార్తలు