టీడీపీలో నిశ్శబ్దం

25 May, 2019 04:04 IST|Sakshi

ఓటమి భారంతో బయటకు రాని పార్టీ నేతలు

ఘోర పరాజయాన్ని జీర్ణించుకోలేక సతమతం 

చంద్రబాబు దరిదాపుల్లో కానరాని నేతలు

గెలిచినా ఇంతవరకు అధినేతను కలవని టీడీపీ ఎమ్మెల్యేలు

టీడీఎల్పీ సమావేశంపైనా అనిశ్చితి

సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవడంతో టీడీపీలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఓటమి భారాన్ని దిగమింగుకోలేక, ఎలా ముందుకెళ్లాలో తెలియక పార్టీ తీవ్ర ఆందోళనలో మునిగిపోయింది. ఊహకు అందని రీతిలో ఎదురైన ఓటమిని జీర్ణించుకోలేని పలువురు పార్టీ నేతలు ఇంకా షాక్‌ నుంచి కోలుకోలేదు. ఫలితాల గురించి మాట్లాడేందుకు సైతం ఎవరూ ఇష్టపడడంలేదు. ఈవీఎంలను మేనేజ్‌ చేశారంటూ కొందరు నేతలు ఓటమికి సాకులను అన్వేషిస్తున్నారు. ఇంత అవమానకర ఓటమికి కారణాలేమిటనే దానిపై ఓడిన మంత్రులు, అభ్యర్థులు, ముఖ్యులు తీవ్రంగా మథన పడుతున్నారు. టీడీపీ పట్ల ప్రజల్లో ఈ స్థాయిలో వ్యతిరేకత ఉందని గ్రహించలేదంటూ అంతర్గతంగా వాపోతున్నారు. 

క్యాడర్‌ డీలా..
ప్రధానంగా జన్మభూమి కమిటీల వల్ల తీవ్ర నష్టం జరిగిందనే వాదనపై టీడీపీ నాయకులు విశ్లేషించుకుంటున్నారు. ఎక్కువ మంది మాత్రం వైఎస్‌ జగన్‌కు ఒక్క చాన్స్‌ ఇవ్వాలనే భావన రాష్ట్ర మంతటా బలంగా నెలకొనడం వల్లే ఇలాంటి ఫలితాలు వచ్చాయని చర్చించుకుంటున్నారు. ఏ చిన్న సంఘటన జరిగినా మీడియా ముందుకు వచ్చే నాయకులు ఈసారి టీవీ చర్చలకు సైతం సుముఖత వ్యక్తం చేయడం లేదు. మొన్నటివరకూ గెలుస్తామంటూ తొడలు కొట్టి నోరు పారేసుకున్న నేతలు ఏం మాట్లాడాలో తెలియక సతమతమవుతున్నారు. పార్టీ క్యాడర్‌లో అయితే తీవ్ర నిరుత్సాహం కనిపిస్తోంది.
 
కళావిహీనంగా బాబు ఉండవల్లి నివాసం
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం ప్రస్తుతం కళావిహీనంగా మారింది. శుక్రవారం ఎలాంటి హడావిడి కనిపించలేదు. గెలిచిన కొద్దిమంది ఎమ్మెల్యేలు కూడా ఆయన్ను కలిసేందుకు రాకపోవడం గమనార్హం. నిత్యం చంద్రబాబు వెంట ఉండే కొద్దిమంది మినహా మిగిలిన ముఖ్యులెవరూ ఆ దరిదాపుల్లో కానరావడం లేదు. బాబు కోటరీలోని కొందరు పరస్పరం నిందించుకుంటున్నట్లు సమాచారం. హిందుపురం నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచిన నందమూరి బాలకృష్ణ ఒక్కరే శుక్రవారం చంద్రబాబును కలిసి వెళ్లారు. చంద్రబాబు నివాసం ఉన్న దారి గుండా రైతులను వారి పంటపొలాలకు వెళ్లనివ్వకుండా గురువారం అడ్డుకున్న పోలీసులు శుక్రవారం ఎవరినీ అడ్డుకోలేదు.  

పార్టీ శాసనసభాపక్ష నేత ఎన్నికపై మౌనం
ప్రజా తీర్పు వెలువడిన అనంతరం టీడీపీలో శాసన సభాపక్ష సమావేశం గురించి కనీసం చర్చ కూడా జరగడం లేదంటే ఆ పార్టీ నాయకులు ఎంత నైరాశ్యంలో ఉన్నారో బోధపడుతోంది. ఎన్నికల ఫలితం ఎలా ఉన్నా గెలిచిన ఎమ్మెల్యేలను సమావేశపరచడం, శాసన సభాపక్ష నేతను ఎన్నుకోవడం ఏ పార్టీలోనైనా సాధారణంగా జరుగుతుంది. అయితే టీడీపీ శాసన సభాపక్ష సమావేశాన్ని ఎప్పుడు నిర్వహిస్తారనే అంశంపై ఎవరూ పెదవి విప్పకపోవడం గమనార్హం. చంద్రబాబు దీనిపై ఇంకా ఏమీ మాట్లాడకపోవడంతో పార్టీ నేతల్లో అయోమయం నెలకొంది.  

>
మరిన్ని వార్తలు