సచివాలయమా.. సమస్యల నిలయమా?

10 Sep, 2018 14:55 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అభివృద్దిపై పదేపదే కేంద్రాన్ని తప్పుపట్టడం టీడీపీ నాయకులకు ఫ్యాషన్‌ అయిందని బీజేపీ ఎమ్మెల్సీ సోమూ వీర్రాజు ధ్వజమెత్తారు. సోమవారం శాసనమండలి సమావేశంలో ఆయన ప్రసంగిస్తుంటే అధికార పార్టీలు అడ్డుపడటంతో అసహనానికి లోనయ్యారు. ఈ క్రమంలో టీడీపీ సభ్యులకు, వీర్రాజుకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం అధికార సభ్యుల వైఖరిని నిరసిస్తూ సభ నుంచి వాకౌట్‌ చేశారు. అంతకుముందు ఆయన చేసిన ప్రసంగంలో రాజధాని నిర్మాణం పేరిట జరుగుతున్న అక్రమాలు, అవినీతి గురించి ప్రస్తావించారు.

అద్భుతమైన సచివాలయం కట్టామని చంద్రబాబు ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని.. కానీ కనీసం సరైన బాత్‌ రూమ్‌ కూడా లేదనే విషయం తెలుసుకోవాలని సూచించారు. బాత్‌ రూమ్‌ల కోసం చైర్మన్‌, డిప్యూటీ చైర్మన్‌ రూమ్‌లకు వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయం అంటే వర్షం వచ్చినప్పుడల్లా నీరు కారడమేనా అని ప్రశ్నించారు.  అసలు సచివాలయం నిర్మాణానికి ఎంత ఖర్చు పెట్టారో మంత్రి నారాయణ తెలపాలని డిమాండ్‌ చేశారు. ఏపీలో ఆరు లైన్లు, నాలుగు లైన్ల రోడ్ల నిర్మాణం కేంద్రమే చేపట్టిందన్న విషయం టీడీపీ నాయకులకు గుర్తు లేదనుకుంటా అంటూ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ సమగ్ర అభివృద్దికి కేంద్రం కట్టుబడివుందని వీర్రాజు స్పష్టం చేశారు. 
 

మరిన్ని వార్తలు