కౌగిలింత.. కన్నుకొట్టడం... ఏంటది?

21 Jul, 2018 13:50 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: అవిశ్వాసంపై చర్చ సందర్భంగా శుక్రవారం లోక్‌సభలో  కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చేసిన పని.. చర్చనీయాంశంగా మారింది. ప్రసంగం ముగిశాక ప్రధాని మోదీ వద్దకు వెళ్లిమరీ కౌగిలించుకుని, షేక్‌ హ్యాండ్‌ ఇవ్వటం.. ఆపై తన కుర్చీలో కూర్చుని కన్నుకొట్టడం..  సోషల్‌ మీడియా మొత్తం అదే చర్చ నడిచింది. సభా వేదికగా జరిగిన ఈ ఊహించని పరిణామంతో ప్రధానితోసహా  సభలో ఉన్నవాళ్లంతా విస్మయం వ్యక్తం చేశారు. స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ కూడా రాహుల్‌ చేసిన పనిని తప్పుబట్టారు.

ఇక ఈ వ్యవహారంపై యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ కూడా తనయుడు రాహుల్‌ను ఆరాతీసినట్లు తెలుస్తోంది. ఓటింగ్‌ ముగిశాక బయటకు వచ్చే క్రమంలో రాహుల్‌ను పిలిపించుకుని ఆమె ఓ ఐదు నిమిషాలు మాట్లాడారని, అలా చేయటానికి గల కారణాలను గట్టిగానే నిలదీశారంట. ఈ మేరకు రాహుల్‌ కూడా వివరణ ఇచ్చుకున్నట్లు  ఓ ప్రముఖ వెబ్‌సైట్‌ శనివారం ఓ కథనం ప్రచురించింది. అయితే కాంగ్రెస్‌ నేతలు మాత్రం ఆ కథనాన్ని తోసిపుచ్చుతూ.. అధ్యక్షుడు చేసిన పనిపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

అది స్క్రిప్ట్‌కాదని  ‘జ్యోతిరాదిత్య సింధియా’ చెబుతుండగా.. రణ్‌దీప్‌ సూర్‌జెవాలా స్పందిస్తూ... ‘రాహుల్‌ గాంధీ చేసిన పనికి బీజేపీ ఎందుకంతలా ఊగిపోతుందని’ ప్రశ్నించారు. ‘అదో మ్యాజికల్‌ హగ్‌. ద్వేషాలను దూరం చేసేందుకు రాహుల్‌ అలా చేశారు. అది అప్పటికప్పుడు అలా వచ్చేసింది. దీనిపై రాజకీయం చేయటం సరికాదు’ అని రణ్‌దీప్‌ తెలిపారు. ఇక రాహుల్‌ చేసిన పనితో  చిప్కో ఉద్యమం గుర్తొచ్చిందని రాజ్‌నాథ్‌ సింగ్‌ ఎద్దేవా చేయటం తెలిసిందే. బీజేపీ ఎంపీ కిరణ్‌ ఖేర్‌.. రాహుల్‌ డ్రామా బాగుందని.. బాలీవుడ్‌లో చేరితే ఇంకా బావుంటుందని సలహా ఇస్తున్నారు. కేంద్ర మంత్రి బాబుల్‌ సుప్రియో.. అదేం గ్యాలెరీ షో కాదని, ప్రధానితో పరాచికాలు చేయటం నైతికత అనిపించుకోదని వ్యాఖ్యానించారు.  నటనకు నటనే సమాధానం అని వామపక్ష పార్టీకి చెందిన ఎంపీ ఒకరు వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు