అతిరథుల పోరుగడ్డ

30 Apr, 2019 06:09 IST|Sakshi
బిహార్‌ రాష్ట్రంలోని బేగుసరాయి జిల్లాలో సోమవారం నిర్వహించిన లోక్‌సభ 4వ విడత పోలింగ్‌లో తమ ఓటుహక్కుని వినియోగించుకోవడానికి వచ్చిన ఓటర్లు

బిహార్, జార్ఖండ్‌ @ 5వ దశ

లాలూ పాత స్థానంలో వియ్యంకుడి పోటీ

పాశ్వాన్‌ నియోజకవర్గంలో తమ్ముడు పశుపతి పోటీ

రెండోసారి హజారీబాగ్‌ నుంచి జయంత్‌సిన్హా

కోడర్మ నుంచి పోటీచేస్తున్న మాజీ సీఎం

ఐదో దశలో మే 6న పోలింగ్‌ జరిగే బిహార్‌లోని ఐదు లోక్‌సభ స్థానాలు, జార్ఖండ్‌లోని నాలుగు సీట్లకు రెండు రాజకీయ కూటముల మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. బిహార్‌లోని మొత్తం 40 సీట్లకు ఏడు దశల్లో, జార్ఖండ్‌లోని 14 స్థానాలకు నాలుగు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. బిహార్‌లోని మిథిలా, చంపారణ్‌ ప్రాంతాలకు చెందిన సీతామఢీ, మధుబనీ, ముజఫ్ఫర్‌పూర్, సారణ్, హాజీపూర్‌లో బీజేపీ, జేడీయూ, ఎల్జేపీతో కూడిన ఎన్డీఏ, ఆర్జేడీ, కాంగ్రెస్, వికాస్‌శీల్‌ ఇన్సాన్‌పార్టీ(వీఐపీ), హిందుస్తాన్‌ ఆవామ్‌ పార్టీ, రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీ(ఆర్‌ఎల్‌ఎస్పీ) భాగస్వామ్యపక్షాలుగా ఉన్న మహాకూటమి మధ్య ప్రత్యక్ష పోరుకు రంగం సిద్ధమైంది. ఆర్జేడీ నేత, మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్‌ యాదవ్‌ వియ్యంకుడు చంద్రికా రాయ్‌ లాలూ పాత స్థానం సారణ్‌ నుంచి పోటీ చేస్తుండగా, లోక్‌జనశక్తి పార్టీ(ఎల్‌జీపీ) నేత రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ తమ్ముడు పశుపతి కుమార్‌ పారస్‌ అన్న నియోజకవర్గం హాజీపూర్‌ నుంచి పోటీకి దిగారు.  ఆర్జేడీ కూటమిలోని వీఐపీ ముజఫ్ఫర్‌పూర్, మధుబని నుంచి పోటీచేస్తోంది.

బిహార్‌

బిహార్‌ మ్యాప్‌

లాలూ వియ్యంకుడితో రాజీవ్‌ రూడీ పోటీ
లాలూ ‘కుటుంబ నియోజకవర్గం’ సారణ్‌లో ప్రతిష్టాకరమైన పోరుకు రంగం సిద్ధమైంది. ఇక్కడ బీజేపీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి, సిట్టింగ్‌ సభ్యుడు రాజీవ్‌ప్రతాప్‌ రూడీతో లాలూ వియ్యంకుడు(పెద్ద కొడుకు తేజ్‌ప్రతాప్‌ మామ) చంద్రికా రాయ్‌ ఆర్జేడీ తరఫున తలపడుతున్నారు. 2014లో లాలూ భార్య, మాజీ సీఎం రబ్రీదేవిని రూడీ 40 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో ఓడించారు. ఈ ఎన్నికల్లో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ అనే స్వతంత్ర అభ్యర్థి వేల సంఖ్యలో ఓట్లు చీల్చుకున్నారు. ఆయన వల్లే రబ్రీ ఓడిపోయారని ఆర్జేడీ భావించింది. ఈ స్వతంత్ర అభ్యర్థి మళ్లీ ఈసారి కూడా పోటీలో ఉన్నారు. 2004కు ముందు ఛప్రా పేరుతో ఉన్న ఈ నియోజకవర్గం నుంచి లాలూ మూడుసార్లు, రాజీవ్‌ రూడీ రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.


చంద్రికా రాయ్, రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ

2009లో సారణ్‌గా అవతరించాక లాలూ ప్రసాద్‌ విజయం సాధించారు. కిందటి ఎన్నికల్లో ఆయన భార్య తొలిసారి లోక్‌సభకు ఇక్కడి నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో తన మామ చంద్రికా రాయ్‌కి ఆర్జేడీ టికెట్‌ ఇవ్వడాన్ని లాలూ కొడుకు తేజ్‌ప్రతాప్‌ మొదట తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రధాని నరేంద్రమోదీ కేబినెట్‌లో దాదాపు మూడేళ్లు మంత్రిగా పనిచేసిన రాజీవ్‌ రూడీ బీజేపీ తరఫున మరోసారి రంగంలోకి దిగి ఆర్జేడీ అభ్యర్థి చంద్రికా రాయ్‌కు గట్టి పోటీ ఇస్తున్నారు. గతంలో మాదిరిగా మోదీ గాలి లేకున్నా ఆయనకు ఈసారి జేడీయూ మద్దతు ఇస్తున్నందున మెరుగైన స్థితిలో ఉన్నారు. ఆర్జేడీ ఎమ్మెల్యే అయిన లాలూ వియ్యంకుడి గెలుపునకు మహా కూటమి గట్టి ప్రయత్నమే చేస్తోంది.

సీతామఢీలో ఆర్జేడీతో జేడీయూ పోటీ
పూర్వ మిత్రపక్షాలైన ఆర్జేడీ, జేడీయూల మధ్య ప్రత్యక్ష పోరు సాగుతున్న స్థానం సీతామఢీ బీజేపీ–జేడీయూ కూటమి అభ్యర్థిగా మొదట ప్రకటించిన డా.వరుణ్‌కుమార్‌ పోటీకి విముఖత ప్రదర్శించడంతో రాష్ట్ర మంత్రి, బీజేపీ మాజీ నేత సునీల్‌ కుమార్‌ పింటూ జేడీయూ తరఫున పోటీకి దిగారు. ఆర్జేడీ అభ్యర్థిగా అర్జున్‌రాయ్‌ పోటీచేస్తున్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమిలో ఉన్న ఆర్‌ఎల్‌ఎస్పీ అభ్యర్థి రాంకుమార్‌ శర్మ కుష్వాహా తన సమీప ఆర్జేడీ ప్రత్యర్థి సీతారాం యాదవ్‌ను లక్షా 47 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో ఓడించారు.

అర్జున్‌ రాయ్, సునీల్‌ కుమార్‌ పింటూ

అప్పుడు జేడీయూ అభ్యర్థిగా పోటీచేసిన అర్జున్‌రాయ్‌ మూడో స్థానంలో నిలిచారు. ఈసారి ఎన్డీయే నుంచి ఆర్‌ఎల్‌ఎస్పీ వైదొలిగి ఆర్జేడీ కూటమిలో చేరింది. అయితే, ఈ సీటును ఆ పార్టీకి కేటాయించలేదు.  బీజేపీకి రాజీనామా చేసిన మంత్రి పింటూ బలమైన అభ్యర్థిగా భావిస్తున్నారు. అయితే, సీతామఢీ ఆర్జేడీకి గతంలో కంచుకోట. 2004లో ఈ పార్టీ తరఫున సీతారాం యాదవ్, 2009లో అర్జున్‌రాయ్‌ విజయం సాధించారు. ఆర్జేడీ, జేడీయూ మధ్య హోరాహోరీ పోటీ ఉన్నట్టు కనిపిస్తోంది.

మధుబనిలో హుకుందేవ్‌ కుమారుడు
ఆర్జేడీ కూటమి భాగస్వామ్యపక్షమైన వీఐపీకి కేటాయించిన స్థానం ఇది. గతంలో మధుబని నుంచి నాలుగుసార్లు గెలిచిన బీజేపీ సిట్టింగ్‌ సభ్యుడు హుకుందేవ్‌ నారాయణ్‌ యాదవ్‌ ఈసారి పోటీచేయడం లేదు. బీజేపీ టికెట్‌ ఆయన కొడుకు అశోక్‌కుమార్‌ యాదవ్‌కు ఇచ్చారు. మాజీ సోషలిస్ట్‌ అయిన హుకుందేవ్‌ 1990ల చివర్లో బీజేపీలో చేరి ఆ పార్టీ తరఫున కూడా సీతామఢీ నుంచి మూడుసార్లు ఎన్నికయ్యారు. ఆయన కొడుకు అశోక్‌ లోక్‌సభకు పోటీచేయడం ఇదే మొదటిసారి.

బద్రీకుమార్‌ పూర్బే, అశోక్‌కుమార్‌ యాదవ్‌

బాలీవుడ్‌ మాజీ సెట్‌ డిజైనర్, నిషాద్‌(మత్స్యకారులు) వర్గానికి ముకేష్‌ సహనీ స్థాపించిన వీఐపీ పార్టీకి మహా కూటమి ఈ సీటు కేటాయించింది. ఈ పార్టీ తరఫున బద్రీకుమార్‌ పూర్బే పోటీకి దిగారు. కిందటి ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై పోటీచేసిన హుకుందేవ్‌ తన సమీప ఆర్జేడీ అభ్యర్థి అబ్దుల్‌ బారీ సిద్దిఖీని 20 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో ఓడించారు. ఈసారి బీసీలు, ముస్లింల ఓట్లు భారీగా కూటమి అభ్యర్థి పూర్బేకు పడితే బీజేపీ గెలుపు కష్టమేనని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఆర్జేడీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి ఎంఏఏ ఫాత్మీ మొదట బీఎస్పీ తరఫున నామినేషన్‌ వేసి తర్వాత ఉపసంహరించుకున్నారు. 2004లో కాంగ్రెస్‌ టికెట్‌పై గెలిచిన పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి షకీల్‌ అహ్మద్‌ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. ఆయన కాంగ్రెస్, ముస్లిం ఓట్లు చీల్చుకుంటే వీఐపీ పార్టీ అభ్యర్థికి పడే ఓట్లు తగ్గే ప్రమాదముంది.

జార్ఖండ్‌లో హోరాహోరీ

జార్ఖండ్‌ మ్యాప్‌

ఐదో దశలో పోలింగ్‌ జరిగే జార్ఖండ్‌లోని నాలుగు సీట్లు–కోడర్మా, రాంచీ, ఖూంటీ(ఎస్టీ), హజారీబాగ్‌ సీట్లలో బీజేపీ కూటమి, కాంగ్రెస్‌ కూటమికి మధ్య గట్టి పోటీ నెలకొంది. కాంగ్రెస్‌ కూటమిలో జేఎంఎం, జేవీఎం(ప్రగతిశీల్‌), ఆర్జేడీ ఉన్నాయి. రాజధాని రాంచీ  స్థానం నుంచి కేంద్ర మాజీ మంత్రి సుబోధ్‌కాంత్‌ సహాయ్‌(కాంగ్రెస్‌) పోటీ చేస్తుండగా, హజారీబాగ్‌ నుంచి కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి జయంత్‌ సిన్హా(బీజేపీ) మళ్లీ బరిలోకి దిగారు. కోడర్మా నియోజకవర్గం నుంచి జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్‌ మరాండీ(జేవీఎం–పీ) కాంగ్రెస్‌ కూటమి తరఫున పోటీలో ఉన్నారు. షెడ్యూల్డ్‌ తెగలకు రిజర్వ్‌ చేసిన ఖూంటీ స్థానం నుంచి బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులు రంగంలో ఉన్నారు. 2014 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జార్ఖండ్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ కూటమి మెజారిటీ సాధించింది. బీజేపీ నేత రఘువర్‌ దాస్‌ నేతృత్వంలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం గత నాలుగున్నరేళ్లుగా అధికారంలో ఉంది.

రాంచీలో సహాయ్‌దే పైచేయి!
1989 నుంచీ ప్రస్తుత కాంగ్రెస్‌ అభ్యర్థి సుబోధ్‌కాంత్‌ సహాయ్, బీజేపీ సిట్టింగ్‌ సభ్యుడు రామ్‌తహల్‌ చౌధరీ ఇప్పటి వరకూ రాంచీకి లోక్‌సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటికి చౌధరీ రాంచీ నుంచి ఐదుసార్లు బీజేపీ తరఫున విజయం సాధించారు. అయితే, ఈసారి ఆయనకు పార్టీ టికెట్‌ లభించపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో నిలిచారు. వరుసగా రెండుసార్లు గెలిచిన సహాయ్‌ కిందటి ఎన్నికల్లో ఓడిపోయారు. 1989లో జనతాదళ్‌ తరఫున గెలిచిన సహాయ్‌ మళ్లీ కాంగ్రెస్‌ టికెట్‌ సంపాదించి పోటీలో ఉన్నారు.

సుబోధ్‌ సహాయ్‌, సంజయ్‌ సేఠ్‌

బీజేపీ తరఫున ఖాదీ గ్రామోద్యోగ్‌ మాజీ చైర్మన్‌ సంజయ్‌ సేuŠ‡ పోటీచేస్తున్నారు. ఆయన ఎన్నికల్లో పోటీకి దిగడం ఇదే తొలిసారి. బీజేపీ అగ్రనేత ఎల్‌.కె.ఆడ్వాణీ వర్గీయుడని, 85 ఏళ్లు దాటాయనే కారణాలతో తహల్‌కు టికెట్‌ నిరాకరించడం వల్ల ఆయన వర్గమైన కుర్మీ కులస్తుల ఓట్లు గతంలో మాదిరిగా బీజేపీకి పడవని చెబుతున్నారు. మూడుసార్లు గెలిచిన కాంగ్రెస్‌ నేత సహాయ్‌ గతంలో వీపీసింగ్, చంద్రశేఖర్, మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు. రాంచీ నుంచి తనను నాలుగోసారి లోక్‌సభకు పంపితే నాలుగో ప్రధాని కేబినెట్‌లో మంత్రినవుతానని సహాయ్‌ ప్రచారం చేసుకుంటున్నారు. బీజేపీలో కీచులాటలు, కుల సమీకరణల్లో మార్పుల వల్ల సహాయ్‌కు అనుకూల వాతావరణం ఉందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.

హజారీబాగ్‌లో జయంత్‌ సిన్హా వర్సెస్‌ గోపాల్‌ సాహూ
గతంలో కేంద్ర మాజీ యశ్వంత్‌ సిన్హా మూడుసార్లు గెలిచిన హజారీబాగ్‌ నుంచి ఆయన కొడుకు, బీజేపీ సిట్టింగ్‌ సభ్యుడైన కేంద్ర మంత్రి జయంత్‌ సిన్హా రెండోసారి పోటీచేస్తున్నారు. తండ్రి బీజేపీకి రాజీనామా చేసినా ఆయన మోదీ కేబినెట్‌లో కొనసాగుతున్నారు.

జయంత్‌ సిన్హా, గోపాల్‌ సాహూ

కాంగ్రెస్‌ తరఫున కొత్త అభ్యర్థి గోపాల్‌ సాహూ రంగంలోకి దిగారు. తండ్రికి బదులు తొలిసారి రాంచీ నుంచి పోటీచేసిన జయంత్‌ కిందటిసారి తన సమీప కాంగ్రెస్‌ ప్రత్యర్థి సౌరభ్‌ నారాయణ్‌సింగ్‌ను భారీ ఆధిక్యంతో ఓడించారు. 1991, 2004లో సీపీఐ తరఫున విజయంసాధించిన భువనేశ్వర్‌ ప్రసాద్‌ మెహతా మళ్లీ సీపీఐ అభ్యర్థిగా బరిలోకి దిగారు. 2004లో ఆయన యశ్వంత్‌ సిన్హాను ఓడించారు. కాంగ్రెస్‌ అభ్యర్థికి జేఎంఎం, జేవీఎం(పీ) వంటి మిత్రపక్షాల మద్దతు ఉంది. తండ్రి యశ్వంత్‌ ఆశీస్సులున్నాయని చెబుతున్న జయంత్‌ ఈసారి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు.

కోడర్మా పోటీలో బాబూలాల్‌ మరాండీ
జార్ఖండ్‌లో మరో కీలక స్థానమైన కోడర్మాలో బీజేపీ అభ్యర్థి అన్నపూర్ణాదేవి యాదవ్, కాంగ్రెస్‌–జేఎంఎం కూటమి అభ్యర్థి బాబూలాల్‌ మరాండీ(జేవీఎం–పీ) మధ్య గట్టి పోటీ జరుగుతోంది. రాష్ట్ర ఆర్జేడీ అధ్యక్షురాలిగా పనిచేసి ఎన్నికల ముందు పార్టీలో చేరిన అన్నపూర్ణాదేవి యాదవ్‌కు బీజేపీ టికెట్‌ లభించింది. బీజేపీ తరఫున జార్ఖండ్‌ మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసిన మరాండీ గతంలో బీజేపీలో ఉండగా రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. జేఎంఎం నేత, మాజీ సీఎం శిబు సొరేన్‌ను ఓడించారు. బీజేపీ తరఫున 2014లో ఇక్కడ నుంచి గెలిచిన రవీంద్రరాయ్‌కు ఈసారి టికెట్‌ ఇవ్వకపోయినా అన్నపూర్ణ తరఫున ప్రచారం చేస్తున్నారు. కిందటి ఎన్నికల్లో ఆయన తన సమీప సీపీఐ(ఎంఎల్‌–లిబరేషన్‌) ప్రత్యర్థి రాజ్‌కుమార్‌ యాదవ్‌ను దాదాపు లక్ష ఓట్ల మెజారిటీతో ఓడించారు. మళ్లీ రాజ్‌కుమార్‌ పోటీచేస్తున్నారు.


బాబూలాల్‌ మరాండీ, అన్నపూర్ణాదేవి


బిహార్‌ సమస్తీపూర్‌లో ఓటు వేసిన ఆనందంలో ఓ మహిళ

సోమవారం లోక్‌సభ ఎన్నికల 4 విడత పోలింగ్‌ ముగిసింది. దేశంలోని 8 రాష్ట్రాల్లోని 71 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరిగింది. మహిళలు, వృద్ధులు, ఆదివాసీలు, ఉద్యోగులు, వివిధ వర్గాల వారు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు.


రాజాస్తాన్‌లోని బ్యావర్‌ ప్రాంతంలో వీల్‌చైర్లో వచ్చి ఓటు వేసిన ఓ పెద్దాయన


ఓటు వేసి సిరా చుక్కను చూపిస్తున్న పశ్చిమ బెంగాల్‌లోని ఇల్లంబజార్‌ ఆదివాసీ మహిళలు


జమ్మూ శివారు ప్రాంతమైన  కుల్గాం నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రవాసి కశ్మీరి పండిట్‌ మహిళ


శ్రీనగర్‌లో ఓటు వెయ్యడానికి వచ్చిన వృద్ధుడికి సాయం చేస్తున్న భారత పారామిలిటరీ జవాను


ముంబైలోని ఒక పోలింగ్‌ స్టేషన్‌లో క్యూలో నిలబడి ఓటర్‌ ఐడీ కార్డులు చూపిస్తున్న ఓటర్లు


రాజస్తాన్‌ అజ్మేర్‌ శివార్లలో పోలింగ్‌ క్యూలో నిల్చున్న మహిళలు


ఓటు వేశానంటూ ఇంకు వేసిన వేలు చూపిస్తున్న వృద్ధుడు. 

>
మరిన్ని వార్తలు